Mission Bhagiratha: మిషన్‌ భగీరథపై విజి‘లెన్స్‌’.. కేసీఆర్‌ను ఇరికించే వ్యూహం!

ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ సర్కార్‌ 2016లో మిషన్‌ భగీరథకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభించింది. ఇందుకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది.

Written By: Raj Shekar, Updated On : February 8, 2024 8:44 am

Mission Bhagiratha

Follow us on

Mission Bhagiratha: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పదేళ్ల కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ పరిస్థితిపై స్వేతపత్రాలు విడుదల చేసింది. ఇక ఎన్నికలకు ముందు కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీతోపాటు మొత్త ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. నేడే రేపో ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు విజిలెన్స్‌ అధికారులు రెడీ అవుతున్నారు. ప్రాథమిక నివేదికలోనే రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించారని తెలుస్తోంది.

ఇప్పుడు భగీరథ వంతు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, అవినీతి, అక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం బయట పెడుతున్నా.. బీఆర్‌ఎస్‌ నాయకులు దూకుడు తగ్గించడం లేదు. ప్రభుత్వంపై ఎదురు దాడిచేస్తున్నారు. హామీల అమలుకు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టులపై రాద్ధాంతం చేస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్‌ పదేళ్ల పాలనలో చేపట్టిన మరో పెద్ద పథకం మిషన్‌ భగీరథపై విచారణ జరిపించేందుకు సర్కార్‌ రెడీ అవుతోంది. మాజీ సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలన్నీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూ.40 వేల కోట్లతో నిర్మాణం..
ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ సర్కార్‌ 2016లో మిషన్‌ భగీరథకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభించింది. ఇందుకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే నాసిరకం పైపులైన్లు వాడినట్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన కంపెనీల నుంచి పైపులు కొనుగోలు చేసినట్లు, అప్పటికే నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు రంగులు వేసి నిర్మించినట్లు బిల్లులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. దీనిపై విచారణ జరిపించే అంశంపై సీఎం ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

పనులు చేయకుండా బిల్లులు..
మిషన్‌ భగీరథ పథకంలో చేపట్టిన పనులు.. చేకుండానే బిల్లులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు చేసిన పనులనే చేసినట్లు చూపించారని, సామగ్రి కొనకుండానే కొన్నట్లు చూపించారని ప్రభుత్వానికి ఫిర్యాదుల వచ్చాయి. కొన్నవాటిని వినియోగించకుండా డబ్బులు వృథా చేశారని కూడా ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్‌ విజిలెన్స్‌ విచారణే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. నేడో, రేపో విజిలెన్స్‌ విచారణపై ఉత్తర్వులు వస్తాయని సమాచారం. ఆదేశాలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగేందుకు విజిలెన్స్‌ అదికారులు కూడా రెడీ అవుతున్నారు.