Chandrababu Naidu : రాహుల్ గాంధీ మరోసారి భంగపడ్డారు. ఇప్పటికే కేసుల నమోదుతో బీజేపీ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేయగా.. అదే సమయంలో చంద్రబాబు దెబ్బకొట్టారు. గత ఎన్నికల్లో తండ్రి లేని పిల్లాడి మాదిరిగా రాహుల్ గాంధీని అక్కున చేర్చుకున్నారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఉన్నా నిన్ను నేను ప్రధాని చేస్తాను కన్నా అని లాలించారు. ఎలా రాజకీయాలు చేయాలో నేర్పించారు. సభలు, సమావేశాల్లో పక్కన కూర్చోబెట్టి మరీ తన అభిమానాన్ని చూపించారు. పెద్దాయనా.. అందునా రాజకీయాల్లో ఆరితేరిన వాడని తెలిసి రాహుల్ గాంధీ కూడా చంద్రబాబును ఎంతగానో నమ్మారు. ఇక తనకు తిరుగులేదని.. ప్రధాని కిరీటం అప్పగించగల సమర్థత చంద్రబాబులో ఉందని బలంగా నమ్మాడు. కానీ అనుకున్నది ఒకటి అయితే అయ్యిందొక్కటి అన్న చందంగా మారింది. కాంగ్రెస్ ఓడడమే కాకుండా తన టీడీపీని కూడా పతనమంచుకు తీసుకెళ్లారు. తరువాత రాహుల్ అనే యువ నాయకుడు ఒకరు ఉన్నారన్న మాటనే చంద్రబాబు మరిచిపోయారు.
ఎన్నికల ముందు నుంచే..
2019 ఎన్నికల ముందు నాటి నుంచే కాంగ్రెస్ పార్టీ యువనేతతో చంద్రబాబు వేదికలను పంచుకున్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వేదికగా తొలిసారిగా రాహుల్ ను కలుసుకున్న చంద్రబాబు సుదీర్ఘ మంతనాలే జరిపారు. ‘గతాన్ని వదిలేసి భవిష్యత్ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. పొత్తలు విషయంలో గతం గురించి ఆలోచించడం లేదు. బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడమే మా ప్రథమ కర్తవ్యం. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తాం. ఇది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమయం’అంటూ ఆ ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు ఏపీలో అధికారానికి దూరమయ్యారు. రాహుల్ గాంధీ సైతం కాంగ్రెస్ రాజకీయాల నుంచి కొద్దిరోజుల పాటు అస్త్రసన్యాసం తీసుకున్నారు.
పెద్దన్నగా చంద్రబాబు…
అయితే నాడు చంద్రబాబు రాహుల్ కు పెద్దన్నగా ఉంటానని ఇచ్చిన హామీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలయికను ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేయరన్న నిజం తెలుసుకున్నారు. దీనికితోడు సమీప భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే స్థితిలో లేదని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ నీడ నుంచి చంద్రబాబు తప్పుకున్నారు. కనీసం రాహుల్ సహచర నాయకుడన్న విషయం మరిచిపోయారు. మొన్నటికి మొన్న ఆయన కేసుల్లో చిక్కుకున్నప్పుడు సంఘీభావం తెలపలేదు సరికదా.. కనీసం మీడియా ముఖంగానైనా స్పందించలేదు. తాజాగా ఎన్డీఏ నుంచి బయటకు ఎందుకు వచ్చిన విషయాన్ని ప్రకటించారు. కానీ గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి ఎందుకు దూరమైందీ.. ఇంతవరకూ చెప్పలేదు. అందుకే రాహుల్ తెగ బాధపడిపోతున్నారుట.
బీజేపీకి స్నేహహస్తం..
అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సైతం నాటి ఎన్టీఆర్ ఉదంతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి రాహుల్ గాంధీ ఒక లెక్క అని సరిపోల్చుకుంటున్నారు. అయితే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడుబోసుకున్న పార్టీ తెలుగుదేశం. అటువంటిది ఆ రెండు పార్టీలు కలవడం తప్పిదమే. దానిని దేశ రక్షణకు అని చెప్పడం సాహసమే. గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ రెండు పార్టీల మైత్రి కొనసాగి ఉంటే దానిని ప్రజలు కూడా హర్షించి ఉండేవారు. అయితే ఓటమి ఎదురైన మరుక్షణం చంద్రబాబు పక్కకు తప్పుకున్నారు. రాహుల్ గాంధీని నడివీధులో విడిచి వెళ్లినట్టు వెళ్లిపోయారు. అందుకే రాహుల్ ఎక్కువగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు తనంతట తానుగా మోదీకి స్నేహ హస్తం అందిస్తుండడంతో నాడు ఎన్టీఆర్ వెన్నుపోటే తనకు ఎదురైందన్న తెగ బాధపడిపోతున్నారు.