Samantha: హీరోయిన్స్ కి గుడులు కట్టడం కొత్తేమీ కాదు. గతంలో కుష్బూ, నమిత వంటి హీరోయిన్స్ కి గుడి కట్టి జనాలు పూజలు చేశారు. తాజాగా స్టార్ లేడీ సమంతకు ఓ అభిమాని గుడి కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా, చుండూరు మండలం, అలపాడుకు చెందిన సందీప్ తెనాలి సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు ప్రాణదానం చేస్తున్న సమంత ఔదార్యానికి ముగ్ధుడయ్యాడు. చాలా కాలంగా సమంతను పిచ్చిగా ఆరాధిస్తున్నాడు.
తన అభిమానానికి గుర్తుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఇంటి ప్రాంగణంలో కొంత స్థలం కేటాయించి గుడి నిర్మాణం చేపట్టాడు. ప్రముఖ శిల్పి చేత సమంత ప్రతిమ రూపొందించారు. గుడి నిర్మాణం చివరి దశకు చేరుకోగా త్వరలో సమంత విగ్రహం అందులో ఏర్పాటు చేయనున్నాడు. ఈ విషయం తెలిసిన మీడియా అతన్ని సంప్రదించింది. గుడి నిర్మాణం చేస్తున్న ప్రదేశం చిత్రీకరించారు.
సమంతను నేరుగా ఎప్పుడూ కలవలేదు. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అంటూ సందీప్ చెప్పుకొస్తున్నారు. ఏకంగా గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్స్ ని సమంత కలవాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. సమంతకు మయోసైటిస్ సోకిన సంగతి సందీప్ ని కలచి వేసిందట. ఆమెకు నయం కావాలని అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి మొక్కులు తీర్చుకున్నాడట. ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తిని ఇంతలా ఆరాధించడం గొప్ప విషయం. సినిమా తారలతో అభిమానులకు ఇంత గట్టి బాండింగ్ ఏర్పడుతుంది.
సమంత నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం ఇటీవల విడుదలైంది. అయితే చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ కొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే సిటాడెల్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.