Real Estate: ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే అనుకూల వాతావరణం ఉంటేనే సాధ్యమయ్యేది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఏ వ్యాపారం చేసినా అది వర్కవుట్ కాదు. ఇప్పుడు ఏపీలో అటువంటి పరిస్థితే ఉంది. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. మరికొన్ని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కొత్త పరిశ్రమల జాడలేదు. అందుకు తగ్గ అనుకూల వాతావరణం కల్పించడంలో జగన్ సర్కారు విఫలమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆశాజనకంగా లేదు. తెలంగాణతో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి అంతంతమాత్రమే. కొవిడ్ తరువాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడం, సాఫ్ట్ వేర్, ఇతరత్రా రంగాల్లో రాష్ట్రంలో ఆశించిన పురోగతి లేకపోవడం దీనికి కారణం.

గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రకటన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అప్పట్లో తెలంగాణ కంటే మెరుగైన స్థితిలో ఉండేది. వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రకటనతో పరిస్థితి తారుమారైంది. దాయాది రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే పూర్తిగా వెనుకబడిపోయింది. 2015—, 2022ల మధ్య రిజిస్ట్రయిన డాక్యుమెంట్లు, ఆదాయం పరిశీలిస్తే రెండు రాష్ట్రాల మధ్య తేడా ఇట్టే తెలిసిపోతోంది. 2015,16 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2021,22 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 228.29 శాతానికి పెరిగింది. ఏపీలో మాత్రం ఆ వృద్ధి కేవలం 104.89 శాతం మాత్రమే. అంటే తెలంగాణలో సగం కూడా ఆదాయం పెంచుకోలేని స్థితిలో ఏపీ ఉందన్న మాట.
వాస్తవానికి ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఎక్కువ జీతాలిచ్చే ఐటీ వంటి రంగాలు హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడితో పోల్చుకుంటే విజయవాడ, విశాఖలో ఐటీ రంగం పురోగతి అంతంతమాత్రం. అటు అనుకూలంగా లేకపోవడంతో ఉన్న సంస్థలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడానికి ఇదొక కారణం. చిన్నస్థాయి నుంచి భారీ పెట్టుబడులు పెట్టే వ్యాపారులు కూడా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు. స్థలాలు, ఇళ్లపై పెట్టుబడి పెట్టాలనుకునే ప్రవసాంధ్రులు ఏపీ కంటే తెలంగాణ శ్రేయస్కరమని భావిస్తున్నారు.

తెలంగాణ కంటే ఏపీలో భూముల మార్కెట్ ధర అధికం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి ఒకసారి మార్కెట్ ధర పెంచుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2021లో మాత్రమే తెలంగాణలో మార్కెట్ ధర పెంచారు. ఏపీలో మాత్రం ఆదాయం పెంచుకునేందుకు మార్కెట్ ధర పెంచాల్సిన అనివార్య పరిస్థితి. అయినా సరే తెలంగాణతో పోల్చుకుంటే భూ క్రయ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన వాతావరణం కల్పించకపోవడమే దీనంతటికీ కారణం.
వాస్తవానికి వైసీపీ సర్కారు అమరావతిని కొనసాగించి ఉంటే రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకునేది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలు పెట్టబడులు పెట్టాలనుకున్న వారికి చుక్కానిలా కనిపించాయి. అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఇమేజ్ రావడంతో పేరుమోసిన నిర్మాణ సంస్థలు విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు సర్కారు విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దీంతో ప్రముఖ సంస్థలైన మెడ్ టెక్ జోన్ ఏర్పాటు, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ డేటా సెంటర్ కు స్థలాలను కేటాయింది. ఆ ప్రభావం నిర్మాణరంగంపై చూపించింది. రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కానీ వైసీపీ సర్కారు వచ్చాక అంతా తారుమారైంది. అమరావతి రాజధాని నిలిచిపోయింది. ఇటు విశాఖ నుంచి ఒక్కో సంస్థ తరలిపోయింది. దీంతో అటు విజయవాడ, ఇటు విశాఖలో నిర్మాణరంగం నీరసించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కల చెదిరింది. కళావిహీనమైంది.