https://oktelugu.com/

Ratha Saptami 2024: నేడు రథసప్తమి.. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం పొందొచ్చు

Ratha Saptami 2024 ప్రతి ఏడాది ఫిబ్రవరి 16న మాఘ మాసంలో శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈసారి ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు రథసప్తమి వచ్చింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 16, 2024 / 08:25 AM IST
    Follow us on

    Ratha Saptami 2024: సూర్యుడు మండే గ్రహం. సూర్య భగవానుడు ప్రసరించే కాంతితోనే సమస్త భూ ప్రపంచానికి వెలుగు లభిస్తుంది. ఆ వెలుగుతోనే అనేక జీవులు మనగడ సాగిస్తాయి. ఉదయం సూర్యుడు కాంతిలో కొంతసేపు నడిస్తే శరీరానికి కావలసిన డీ విటమిన్ లభిస్తుంది. సూర్యుడు మనకు వెలుగునిచ్చే గ్రహంలా కాకుండా దేవుడిలాగా కొలుస్తారు. పలు దేవాలయాల్లో నవగ్రహాలతో పాటు సూర్యుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టిస్తారు. ఇక ఈ సూర్యుడికి కోణార్క్, అరసవిల్లి ప్రాంతాలలో ఆలయాలు ఉన్నాయి.

    ప్రతి ఏడాది ఫిబ్రవరి 16న మాఘ మాసంలో శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈసారి ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు రథసప్తమి వచ్చింది. పంచాంగ కర్తల అభిప్రాయం ప్రకారం ఈరోజు కొన్ని పనులు చేస్తే సూర్య దేవుడి అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి నాడు సూర్య దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం ఆచరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ఈ దీక్ష చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయట. సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తుందట. రథసప్తమి నాడు నిర్వహించే వ్రతాన్ని అచల సప్తమి వ్రతం అంటారు. ఈ రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. దీన్ని ఆచరించడం వల్ల తమకు శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపుడిగా ఉంటాడు. ప్రకృతిలో జీవాన్ని నింపి.. మనుగడ కొనసాగించేలాగా చేస్తాడు. మధ్యాహ్నం వెయ్యి కి పైగా కిరణా లతో మహేశ్వరుడి లాగా మారతాడు. సాయంకాలం వేళ విష్ణుమూర్తి అవతారంలో చల్లని కిరణాలతో మనోరంజకంగా కనిపిస్తాడు. ఇలా మూడు గడియలు.. మూడు తీర్లుగా కనిపించి సమస్త లోకంలో చీకటి తొలగించి వెలుగులు ప్రసరింప చేస్తాడు.

    రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందు పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయట. ఒకవేళ నదికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో కొంచెం నది జలాన్ని తీసుకొచ్చి.. దాని కలుపుకొని స్నానం చేయాలి. అనంతరం ఆదిత్య హృదయం స్తోత్రం, గజేంద్ర మోక్షాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట. ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం.. ఆర్థికపరంగా లాభాలు రావడం.. ఆత్మవిశ్వాసం పెరగడం.. వంటి శుభశకునాలు చోటు చేసుకుంటాడట..

    రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేసి.. ఒక రాగి పాత్రలో నీటితో నింపి.. అందులో ఒక ఎర్రని పుష్పాన్ని ఉంచి.. దానిని సూర్యునికి సమర్పిస్తే అదృష్టం కలుగుతుందట. శత్రువుల నుంచి విజయం, కష్టాల నుంచి విముక్తి లభిస్తుందట. ఆర్థిక సామర్థ్యం ఉంటే సూర్యుడికి రథాన్ని చేయిస్తే.. దానధర్మాలు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. రథసప్తమి నాడు మట్టికుండలో పాలను ఉంచి.. నీ కొద్దిగా వేడి చేసిన తర్వాత.. ఆ పాలను సూర్యకిరణాలతో కొంత సమయం ఉంచి.. వాటితో నైవేద్యం తయారుచేసి లక్ష్మీదేవికి.. సూర్య భగవానుడికి సమర్పిస్తే మంచి జరుగుతుందట. ఇలా చేస్తే జాతకంలో సూర్యుడి స్థానం బలపడి శుభ ఫలితాలు వస్తాయట.

    రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్నానం పూర్తయిన తర్వాత సూర్యుడు పేరు మీద దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది. సూర్యుడికి సంబంధించిన వస్తువులైన గోధుమలు, బెల్లం, ఎరుపు పసుపు రంగు కలబోతతో ఉండే దుస్తులు, ఎర్రచందనాన్ని దానం చేస్తే సూర్యుడు అనుగ్రహిస్తాడట..
    (ఈ వివరాలన్నీ జ్యోతిష్య సమాచారం ప్రకారం.. కొన్ని మత విశ్వాసాల ఆధారంగా మేము మీకు అందించాం. వీటికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు మా వద్ద లేవు)