Rajya Sabha Elections : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే

మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో అజయ్ మాకెన్, జీసీ చంద్రశేఖర్ (కాంగ్రెస్), నారాయన్స బందగే(బీజేపీ), కుపేంద్ర రెడ్డి( జేడీఎస్) బరిలో నిలిచారు.

Written By: NARESH, Updated On : February 27, 2024 11:00 pm
Follow us on

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల్లో మంగళవారం సంచలనం నమోదయింది. మరీ ముఖ్యంగా కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అక్కడి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని బీజేపీ ముందుగానే అనుమానించింది. ఎన్నికలకు ముందు తమ పార్టీ అభ్యర్థులకు సూచనలు కూడా చేసింది. కానీ పోలింగ్ సమయంలో అవేవీ వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడు. ఈ మేరకు అసెంబ్లీలో బీజేపీ చీఫ్ విప్ దొడ్డన గౌడ జీ పాటిల్ ప్రకటించారు.

“సోమశేఖర్ వేరే పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది మంచి పరిణామం కాదు. క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన సోమశేఖర్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ తర్వాతే తదుపరి అడుగులు ఉంటాయి. ఇప్పటికే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానం పార్టీ లోని మిగతా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ని లొంగదీసుకోవాలని చూస్తోంది. అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఒక ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేసినంత మాత్రాన మిగతావారు అలాంటి తప్పుడు దారిలో వెళ్లరు” అని దొడ్డన గౌడ అసెంబ్లీలో ప్రకటించారు.

మరోవైపు ఈ క్రాస్ ఓటింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్టీ సోమశేఖర్ తొలిసారిగా నోరు విప్పారు. ” నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, నీటి వనరుల కోసం ఎవరైతే హామీ ఇచ్చారో వారికే నేను ఓటు వేశాను. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే నాకు ముఖ్యం. ఎందుకంటే వారు లేకుండా నేను లేను. వారు ఓటు వేస్తే ఇక్కడిదాకా వచ్చాను. అలాంటప్పుడు వారి ప్రయోజనాల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఇలాంటప్పుడు ఏవేవో ఆరోపణలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ నేను పట్టించుకోనని” సోమశేఖర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో అజయ్ మాకెన్, జీసీ చంద్రశేఖర్ (కాంగ్రెస్), నారాయన్స బందగే(బీజేపీ), కుపేంద్ర రెడ్డి( జేడీఎస్) బరిలో నిలిచారు.