
Rahul Gandhi Disqualified: మోడీ అనే ఇంటి పేరు ఉన్న వారి పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ పై పార్లమెంటు అనర్హత వేటు వేసింది. ఇప్పుడు ఇది దేశం మొత్తం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో ఒక సెక్షన్ మీడియా రాహుల్ గాంధీకి మద్దతు పలుకుతుండగా.. మరొక సెక్షన్ మీడియా పార్లమెంట్ చేసిన దాన్ని సమర్థిస్తోంది. కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ ఒక్కడిపైనే పార్లమెంటు బహిష్కరణ అస్త్రం ప్రయోగించిందని కలరింగ్ ఇస్తోంది.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే చట్టసభ సభ్యులు అనర్హతకు గురవుతారు. శిక్ష కాలం పూర్తయిన తర్వాత.. మరో ఆరు సంవత్సరాలు పాటు పోటీ చేసేందుకు అవకాశాన్ని కోల్పోతారు. ఇక ఈ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం రాహుల్ గాంధీ శిక్ష ఎదుర్కొంటుండగా.. గతంలో చాలామంది శిక్షకు గురైన వారు ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్
దాణా కుంభకోణం కేసులో 2013 అక్టోబర్ మూడున లాలూ ప్రసాద్ యాదవ్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. మరుసటి రోజే ఈ ఆర్ జె డి అధినేత లోక్ సభ సభ్యత్వం పై వేటు పడింది.
జయలలిత
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష జయలలితకు పడింది. 2014లో జయలలిత తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆమె తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ శిక్షకాలం పూర్తయిన తర్వాత జయలలిత మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
మహమ్మద్ పైజల్
లక్షద్వీప్ నియోజకవర్గం ఎన్సీపీ ఎంపీ అయిన ఫైజల్.. ఓ హత్యా ప్రయత్నం కేసులో స్థానిక న్యాయస్థానం ఇతనికి ఈ ఏడాది జనవరిలో పదేళ్ల జైలు శిక్ష విధించింది. పైజల్ పై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ తన అనర్హత ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్టు లోక్ సభ సచివాలయం ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఆజం ఖాన్
వివాదాస్పద ప్రసంగాల కేసులో సమాజవాది పార్టీ నేత ఆజం ఖాన్ కు.. 2002 అక్టోబర్ లో మూడేళ్ల జైలు శిక్ష పడింది. రాంపూర్ సదర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే పై ఉత్తర ప్రదేశ్ శాసనసభ వేటువేసింది.
అనిల్ కుమార్ సాహ్నీ
ఈయన ఆర్ జే డీ ఎమ్మెల్యే. కుర్హానీ శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతడి పై అక్టోబర్ 2022లో బీహార్ శాసనసభ వేటు వేసింది. మోసం కేసులో మూడేళ్ల పాటు ఇతడికి శిక్ష పడటమే ఇందుకు కారణం.
విక్రమ్ సింగ్ షైనీ
ఉత్తర ప్రదేశ్ లోని కతౌళి నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఇతడు. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో విక్రమ్ కు రెండు సంవత్సరాలపాటు జైలు శిక్ష పడింది. దీంతో 2022లో ఈయన తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ప్రదీప్ చౌధరి
హర్యానాలోని కాల్క నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇతడు. ఓ దాడి కేసులో మూడేళ్ల పాటు జైలు శిక్ష పడటంతో.. ఇతడి పై హర్యానా శాసనసభ వేటువేసింది.
కులదీప్ సింగ్ సెంగర్
ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే ఇతడు..ఉన్నావ్ లోని బాంగర్ పూర్ నుంచి ఎన్నికైన ఇతడు.. అత్యాచారం కేసులో శిక్ష పడటంతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయాడు.

అబ్దుల్లా ఆజం ఖాన్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని చెందిన సమాజవాది పార్టీ నేత ఆజం ఖాన్ తనయుడు ఇతడు. రాంపూర్ లోని స్వార్ శాసనసభకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓ పాత కేసులో 2023లో రెండు ఏళ్ల పాటు కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో అతడు అనర్హతకు గురయ్యాడు.
అనంత సింగ్
బీహార్ లో ఆర్జెడి ఎమ్మెల్యే. ఆయుధాల కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొని.. 2022 జూలైలో శాసనసభ సభ్యత్వానికి దూరమయ్యాడు.