CM KCR: ఈ శీర్షిక చదివి మరీ ఇంత వ్యంగ్యం అవసరమా? అని మీరు మమ్మల్ని తిట్టుకోవచ్చు. కానీ మాకు తప్పడం లేదు. ఎందుకంటే కెసిఆర్ ఇప్పుడు ఢిల్లీలో కార్యకర్తలకు సర్వదర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మరో రెండు రోజులు కెసిఆర్ ఢిల్లీలోనే ఉంటారు. అందుబాటులో ఉంటారు. ఇందుకోసం తుగ్లక్ రోడ్డులోని కెసిఆర్ అధికారిక నివాసంలో ఏర్పాట్లు చేశారు.. సీఎంను కలిసేందుకు కార్యకర్తలు భారీగా రావడంతో అక్కడ జన సందోహంగా మారింది.. ఈ సందర్భంగా కెసిఆర్ జిందాబాద్, జై బిఆర్ఎస్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తిపోయింది.

-ఎందుకు ఈ నిర్ణయం
సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలంటే అంత సులభం కాదు. ప్రగతి భవన్ వెళ్దామంటే అది శత్రు దుర్భేద్యమైన కోట. మొన్నటిదాకా ఆ సూది, దబ్బుణం పార్టీల అధినేతలకే కెసిఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు.. అసలు వారిని కలిసే అవకాశం కూడా కెసిఆర్ ఇవ్వలేదు.. ఉద్యమంలో ఆయనతోపాటు నడిచినా సరే పెద్దగా పట్టించుకోలేదు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తనకు అవసరం కనుక ప్రగతి భవన్ కు పిలిచి భోజనాలు పెట్టి పంపించాడు.. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాడు కాబట్టి కార్యకర్తలకు సర్వదర్శనం ఇస్తున్నాడు. ఢిల్లీలో కాబట్టి సరిపోయింది.. రేపు తెలంగాణలో కూడా ఇలానే ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి.
-మారినట్టే కనిపిస్తోంది
సాధారణంగా కేసీఆర్ ఎవరిని ఎక్కువగా కలవడు.. ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయన ధోరణి అంతే. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన పెద్దగా ఎవరిని కలిసేందుకు ఇష్టపడేవాడు కాదు. ఆయనకు అవసరమంటే తన వద్దకే పిలిపించుకునేవాడు.. ఆ తర్వాత కంటికి కూడా కనిపించేవాడు కాదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఆయన వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేసిన కపిలవాయి దిలీప్ కుమార్. కెసిఆర్ వ్యవహార శైలిపై ఆయన ఏకంగా ‘అపరిచితుడు’ అనే పుస్తకమే రాశాడు.

ఇక వర్తమానానికి వస్తే భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలు, మీడియా దెప్పి పడకుండా ఉండేందుకు, తాను పూర్తిగా మారిపోయాననే సంకేతం ఇచ్చేందుకు కార్యకర్తలను కెసిఆర్ కలుస్తున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు. ఫోటోలు కూడా దిగుతున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారంతా ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.. మేము చూస్తున్నది పాత కేసీఆర్ నేనా అని తమ ఒళ్ళు తాము గిల్లి చూసుకుంటున్నారు.. వాళ్ళ మాటల ప్రకారమే.. కెసిఆర్ సార్.. మీరు మారిపోయారండి.