YCP BC Leaders: ఏపీలో సలహదారులు, కీలక నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి సామాజికవర్గందే అగ్రస్థానం. వారి నియామకం నుంచి జీతభత్యాల కేటాయింపు వరకూ అంత గోప్యంగా జరుగుతోంది. వారికి ఇట్టే కొనసాగింపు లభిస్తుంది. ఒక వేళ కాస్తా ఆలస్యమైనా.. ఏరియర్స్ తో సహా చెల్లింపులు వస్తాయంటూ పునర్నియామక ఉత్తర్వుల్లోనే తెలియజేస్తారు. అధినేత సామాజికవర్గం కాబట్టి రెడ్డి సామాజికవర్గం వారికి రాజభోగాలు, అనుకూల జీవోలు వస్తుంటాయి.కానీ బీసీల విషయానికి వస్తే మాత్రం అంతలా ఇంట్రస్ట్ చూపరు. జయహో బీసీ అన్న నినాదంతో గర్జించి వారం రోజులైనా గడవ లేదు. రాష్ట్రంలో ఉన్న బీసీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దయ్యాయి. తమకు తిరుగులేదు,.,కొనసాగింపు లభిస్తుందని ఆశపెట్టకున్న నేతలకు ప్రభుత్వం షాకిచ్చింది. పాత వారినే కొనసాగిస్తున్నట్టు.. లేకుంటే వారి స్థానంలో మరో బీసీ నేతలను భర్తీ చేస్తున్నామన్న ప్రకటనేదీ వెలువడలేదు. దీంతో రెండేళ్ల కిందట నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యవర్గసభ్యులు అంతా మాజీలయ్యారు.

రెండేళ్ల కిందట ..అంటే 2020 డిసెంబరు 17న ‘బీసీల సంక్రాంతి’ పేరిట 56 బీసీ కార్పొరేషన్లకు జగన్ సర్కారు చైర్మన్లను నియమించింది. వారితో పాటు సరాసరి మరో 300 మందికి పదవులు కట్టబెట్టింది. వారి ప్రమాణ స్వీకారం చేసిన నాడు విజయవాడలో పెద్ద పరేడే నిర్వహించింది. దీంతో తమకు విధులు, నిధులు ఖాయమని కార్పొరేషన్ చైర్మన్లు తెగ సంబరపడిపోయారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. అయితేవేతనాలు, ఇతర అలవెన్స్ లు, వాహన సదుపాయం సమకూరడంతో కులానికి కాకపోయినా.. పదవి తమకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చిందని లోలోపల మదనపడుతూనే సంతృప్తి పడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో పైసా విదిల్చలేదు. పథకాలనే కార్పొరేషన్లకు విభిజించి మీకు ఇంత లబ్ధి చేకూర్చాం చూడండి అంటూ జగన్ వారిలో సంతృప్తి నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా పదవులు కోల్పోయేసరికి నేతలకు తత్వం బోధపడింది. కులంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేకపోయాం.. చివరకు తాము కూడా రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయామన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది.

వాస్తవానికి జగన్ ప్రకటించిన ఈ 56 కార్పొరేషన్లకు ఎటువంటి చట్టబద్ధత లేదు. సాధరణంగా కార్పొరేషన్లకు కంపెనీల చట్టం కింద నమోదు చేస్తారు. అలా చేస్తేనే అవి ఇండిపెండెంట్ గా పనిచేయగలుగుతాయి. కానీ జగన్ తెలివిగా వాటిని కంపెనీల చట్టం కింద కాకుండా… స్వచ్ఛంద సంస్థలు, సొసైటీలుగా నమోదుచేశారు. ఇవి కేవలం సర్వీస్ ఓరియెంట్ గా పనిచేయాల్సి ఉంటుంది. రూపాయి నిధులు ఆశించకూడదు. అసలు నిధుల గురించి డిమాండ్ చేసే చాన్సలేదు. కేవలం వైసీపీ రాజకీయ నిరుద్యోగుల కోసమే ఈ బీసీ కార్పొరేషన్లు తప్పించి… సొంత కులంలో ఒక్క నిరుద్యోగ యువకుడికి రుణం ఇప్పించుకోలేని దయనీయ స్థితి కార్పొరేషన్ చైర్మన్లది. ఇన్నాళ్లూ వారికి ఈ విషయం తెలియదు. ఇప్పుడుపదవులు పోయే ప్రమాదముందని తెలియడంతో తెగ బాధపడుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో జగన్ కొత్త వారితో ప్రయోగం చేస్తారన్న టాక్ నడుస్తోంది. దీంతో పాత వారంతా ఏడుపులు మొదలుపెడుతున్నారు. తమను కాదని కొత్తవారికి ఎలా ఇస్తారో చూస్తామంటూ స్థానిక ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. జగన్ చర్యల పుణ్యామా అని మేము బాధ్యులం అవ్వాల్సి వస్తోందని బాధపడడం వారి వంతైంది.