Hindi National Language : దేశంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. సరే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఏం చేసినా వ్యతిరేకించాలి కాబట్టి.. అందునా ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు కాబట్టి.. నిరసన గళం విప్పుతున్నారు. ఇదే సమయంలో ఆంగ్లభాషపై ఎనలేని మోజును ప్రదర్శిస్తున్నారు. సరే దీనిని భావ దారిద్ర్యం అనాలో.. మరొకటి అనాలో.. కానీ హిందీ చరిత్ర, హిందీ భాష ఔన్నత్యం ఈనాటివి కావు. జాతీయ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న కాలంలో ఆనాటి పాలకుల భాష అయిన ఇంగ్లీష్ కాకుండా భారతీయులలో జాతీయ స్ఫూర్తిని రగిలించగలిగే ఒక ప్రభావశీలమైన దేశీయ భాష అవసరం ఏర్పడింది. రాజకీయ, సాంఘిక అవసరాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలనే ఆవశ్యకత అవసరమైంది. 130 కి పైగా భాషలు వ్యవహారంలో ఉన్న ఇంత పెద్ద దేశానికి జాతీయ భాషగా హిందీ అయితే అనుకూలంగా ఉంటుందని అప్పటి నేతలు భావించారు. భారతదేశంలో 30 శాతం ప్రజలు మాట్లాడే హిందీని ఇంకా సులభతరం చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని గాంధీజీ, బాబూ రాజేంద్రప్రసాద్, పండిట్ మదన్ మోహన్ మాలవ్య, పురుషోత్తమ దాస్ టాండన్ తదితరులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భాగంగా హిందీ విద్యాపీఠం దేవగడ్, నాగరి ప్రచారిణి సభ కాశి, హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రయాగ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ మొదలైన సంస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగ పరిషత్ 1949 సెప్టెంబర్ 14న దేవనాగరి లిపి తో కూడిన హిందీని జాతీయ భాషగా ఆమోదించింది. అప్పటి నుంచి హిందీ భాషాభిమానులు ఏటా సెప్టెంబర్ 14న హిందీ దివస్ ను జరుపుకుంటున్నారు. బీహార్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీతోపాటు మారిషస్, ఫీజీ దీవులు, రష్యా, ట్రినిడాడ్, సూరి నామ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలలో హిందీ అనేది ఒక వ్యవహార భాషగా ఉంది. అక్కడిదాకా ఎందుకు అమెరికాలో కూడా ఇంగ్లీష్ తర్వాత అత్యధికులు మాట్లాడేది హిందీనే. ప్రపంచంలో సైతం చైనీస్, ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా హిందీ గుర్తింపు పొందింది.

హిందీ భాష పుట్టింది ఇలా
సింధూ నది తూర్పు ప్రాంతీయుల నుంచి హిందీ అనే పదం ఉద్భవించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. హిందీ భాషా చరిత్ర ప్రకారం అపభ్రంశ భాషా మాండలికా లైన శూర సేని, మైధిలి, అవధి, రాజస్థానీ, వజ్రభాష, భోజ్ ఫురీ, ఖడీ బోలీ కలయికతో హిందీ భాష ఏర్పడిందని చరిత్రకారులు చెబుతుంటారు. 19వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశంలో సైతం దక్కనీ పేరుతో ఖడీ బోలీ వ్యవహార భాషగా వినతి చెక్కింది. కచ్చితంగా చెప్పాలంటే ఖడీ బోలీ ని సంస్కరించిన రూపమే హిందీ అని తెలుస్తోంది. ఇండో, ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన హిందీ పదో శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది. హిందీ అనే పదాన్ని మొదటిగా ప్రయోగించిన కవి అమీర్ ఖుస్రూ.
ఈ పంచాయితీ ఈనాటిది కాదు
హిందీని జాతీయ భాషగా నిర్ణయించే ప్రక్రియలో రాజ్యాంగ పరిషత్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు నడిచాయి. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వ్యవహారంలో ఉండే ఒక భాషను ఏ ప్రాతిపదికపై జాతీయ భాషగా నిర్ణయిస్తారని దక్షిణాది సభ్యులు ఆ రోజుల్లో వాదించారు. మరీ ముఖ్యంగా భాషాభిమానంలో సదా ముందుండే తమిళులు ఆనాటి నుంచి నేటి వరకు హిందీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. “అధిక సంఖ్యకుల భాష జాతీయ భాషగా గుర్తించాలి అనుకుంటే నెమలి స్థానంలో కాకిని జాతీయ పక్షిగా ఎన్నుకోవాలని” ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఇది అప్పటికప్పుడు ఏర్పడిన వ్యతిరేకత కాదు. దీని మూలాలు స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉన్నాయి. 1937 లో మద్రాసు రాష్ట్రంలో చక్రవర్తుల రాజగోపాలచారి నేతృత్వంలో జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. గాంధీ జీ అభిప్రాయానికి అనుగుణంగా తమిళనాడులోని పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమిళులు హిందీ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా రాజ్యాంగ సభ 11 ఏళ్ల తర్వాత జాతీయ భాషగా హిందీని నిర్ణయించినప్పుడు కూడా ఇదే తరహా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఉత్తరాది వారి ఒత్తిడితో ఎట్టకేలకు దేవ నాగరి లిపి తో కూడిన హిందీని జాతీయ భాషగా రాజ్యాంగ సభ ఆమోదించింది.. దక్షిణాది వారి ఆందోళనను అర్థం చేసుకున్న రాజ్యాంగ సభ హిందీ జాతీయ భాష అయినప్పటికీ, 15 సంవత్సరాలపాటు ఆంగ్లమే అధికారిక అవసరాలకు ప్రాతిపదికగా ఉంటుందని ఒక ప్రత్యేకంగా నిబంధనను ఇందులో చేర్చింది.. దేశంలో అన్ని ప్రాంతాలు అంగీకరించినప్పుడే పూర్తిస్థాయిలో హిందీని అధికారభాషగా అమలు చేస్తామని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రకటించారు. వాస్తవానికి అధికార భాషగా హిందీని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తదనంతర కాలంలో అనేక కమిటీలను ఏర్పాటు చేసినా అవి ఆశించినంత ఫలితాన్ని సాధించలేకపోయాయి. రాజ్యాంగ సభ నిర్దేశించిన 15 ఏళ్ల కాల పరిమితి పూర్తి కావడంతో హిందీ అమలుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది
1965 పార్లమెంటు సమావేశాలలో హిందీ అధికార భాష కావాలి అనే ఏక వాక్యం తీర్మానం ఒక్క ఓటుతో నెగ్గింది. ఈ పరిణామం మద్రాసు రాష్ట్రంలో అగ్గి పుట్టించింది.. సుమారు రెండు నెలలపాటు రాష్ట్రమంతా తీవ్ర హింస చెలరేగింది. అప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏలుతున్న నేపథ్యంలో పారా మిలిటరీ దళాలతో కాల్పులు జరిపించింది. ఫలితంగా 70 మంది దాకా చనిపోయారు. ఈ పరిణామంతో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి హిందీని బలవంతంగా రుద్దబోమంటూ పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఇక తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఫలితంగా కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. 1967 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి, డీఎంకే ప్రభుత్వం విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం మరలా తమిళనాడులో అధికారంలోకి రాలేదు. ఇక అదే సంవత్సరంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారిక భాషల చట్టాన్ని సవరించారు. హిందీని, ఇంగ్లీషును నిరవధికంగా అధికార భాషలుగా కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా ఈ భాషా సమస్యను పరిష్కరించేందుకు 1965 లో కేంద్ర విద్యా విషయక సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. హిందీయేతర రాష్ట్రాల్లో జాతీయ భాష అయిన హిందీని తప్పకుండా బోధించాలని, హిందీ రాష్ట్రాల్లో ఒక దక్షిణ భారత భాష తప్పనిసరిగా నేర్చుకోవాలన్నది ఈ సూత్రం ముఖ్య ఉద్దేశం.. కానీ ఉత్తరాది వారు దక్షిణ భారతీయ భాషల స్థానంలో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. అదే రీతిలో తమిళనాడు కూడా హిందీని పక్కన పెట్టింది. అయితే ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక అధికార భాషా విషయంలో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి సహా హిందీ తెలిసిన వారంతా కూడా తమ వ్యవహారాలు మొత్తం హిందీలోనే చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఈ సిఫారసును ఆమోదించారు. తో వివాదం మరలా రాజుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి డిఎంకె నాయకుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇండియాను ” హిందీయా” గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హిందీ భాష మాట్లాడలేని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తారా అని మండిపడ్డారు. అయితే త్రిభాషా సూత్రం పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో హిందీ భాషను బోధిస్తున్నా ప్రజలందరికీ దీనిపై గట్టి పట్టు ఉన్నట్టుగాని, ప్రత్యేక అభిమానం ఉన్నట్టుగాని అనిపించడం లేదు. ఇక అధికార భాషగా హిందీ ఏర్పడి 68 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయం సాధించలేకపోవడం విచారకరం. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు చాలావరకు హిందీలోనే సాగుతుండటం మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక మార్పు అని చెప్పవచ్చు.