ఒకప్పుడు ఉపాధికి కేరాఫ్ హైదరాబాద్. ఉన్నత విద్యావంతుల నుంచి మొదలుకొని ఓనమాలు రాని వారు సైతం పట్నం వస్తే ఏదో ఒక పని చేసుకుని బతికే పరిస్థితి ఉండేది. ఇదంతా గతం.. ఇప్పుడు నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు రాజధానిలో నమోదుకావడం తో ప్రజలలో మరింత భయాందోళనలు పెరిగాయి. ఇంట్లో ఉన్నా పక్కింట్లో పాజిటివ్ ఉన్నారేమోననే భయం.. ఉద్యోగం, ఉపాధి కోసం బయటకు వెళ్తే మరో భయం. చివరికి సరుకులు కొనుక్కొందామన్నా మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. దీంతో ఏ మాత్రం అవకాశం ఉన్నా సొంతూళ్లకు వెళ్లి, దొరికిన పని చేసుకుని బతుకుదామని భావిస్తున్నారు. వాచ్ మెన్లు, ఆటో రిక్షా డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, ఇతర విభాగాల్లో పని చేసేవారు, చివరికి ఐటీ ఉద్యోగులు సైతం ఇళ్లకు వెళ్లి పోతున్నారు.
లాక్ డౌన్ లో ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పనులు లేక, జీతాలు రాక చాలామంది అర్ధాకలితో కాలం గడిపారు. ఇప్పుడు పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినా.. వైరస్ భయం వెంటాడుతోంది. పైగా జీతాలు కూడా అరకొరగానే ఇస్తున్నారు. పిల్లల చదువుల కోసం పట్నంలో ఉందామనుకున్నా దానిపైనా సరైన స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలి సొంత ఊర్లకు వెళ్తున్నారు. రెండు మూడు వారాలుగా ఇలాంటి వారి సంఖ్య పెరిగింది. చాలా మంది తాత్కాలికంగా కాకుండా… ఏడాది, రెండేళ్ల పాటు ఊళ్లలోనే ఉందామనే భావనతో వెళ్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో నగరంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పని చేసే వాతావరణం ఉండేది. కరోనా కారణంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనులు చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనం విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన వారు సైతం రోడ్లపైకి వస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎవరి నుంచి వైరస్ సోకుతుందో అర్థంకాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పల్లె బాట పట్టడం మంచిదని అనేకమంది నిపుణులు సలహాలు ఇస్తున్నారు.