AP Kapu Politics : పవన్, ముద్రగడ, మాజీ జేడీ.. ఈ ముగ్గురిలో “కాపు” కాసేది ఎవరికి?

గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ అనుసరించిన చర్యలతో కాపుల్లో అసంతృప్తి ఉంది. కానీ జేడీ లక్ష్మీనారాయణ, ముద్రగడ సైతం కాపు ఓటర్లను కొంతవైపు తమ వైపు తిప్పుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Written By: Dharma, Updated On : December 24, 2023 10:22 am
Follow us on

AP Kapu Politics : ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తన కొత్త పార్టీని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ ప్రభావం ఏ పార్టీపై పడుతుందన్న చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే రాజకీయ సమీకరణలకు తెరతీస్తూ సీఎం జగన్ వైసిపి అభ్యర్థులను మార్చుతున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేర్చుకొనున్నారు. ఇప్పటికే టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకుంది.దీంతో కాపు సామాజిక వర్గం ఎటు అన్నదానిపై లోతైన చర్చ నడుస్తోంది.

జనసేనతో తెలుగుదేశం పొత్తు కారణం కాపు సామాజిక వర్గం. పవన్ వెంట కాపులు నడుస్తారని చంద్రబాబు బలంగా విశ్వసించారు. కానీ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ రూపంలో సరికొత్త చిక్కు వచ్చి పడింది. జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొగ్గు చూపుతుండడంతో కాపు సామాజిక వర్గంలో చీలిక వస్తుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పవర్ షేరింగ్ విషయంలో లోకేష్ తేల్చి చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారని తేల్చేశారు. అయితే ఈ విషయంలో జనసేనాని పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో హరి రామ జోగయ్య లాంటి నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాపులకు రాజ్యాధికారం కావాలని కోరుకున్న వారు పునరాలోచనలో పడ్డారు.

జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. లక్ష్మీనారాయణ గతంలో జనసేన లో పనిచేశారు. విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పార్టీని వీడి.. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీని ప్రకటించడం విశేషం. అయితే గతంలో జనసేన ను వీడిన నాయకులు, పవన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని అసంతృప్తిగా ఉన్న నేతలు లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అలాగే వైసిపి, టిడిపి, జనసేనతో కలవలేని వారు సైతం కొత్త పార్టీ గొడుగు కిందకు వస్తారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ వైసీపీలో చేరడం దాదాపు ఖాయం. ముద్రగడ కాకుంటే ఆయన కుమారుడు వైసీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఒకవైపు పవన్, మరోవైపు జెడి లక్ష్మీనారాయణ, ఇంకోవైపు ముద్రగడ పద్మనాభం. ఈ ముగ్గురిలో కాపు ఓట్లు ఎటువైపు వెళ్తాయన్నది ఇప్పుడు చర్చ. అయితే పవన్ సినీ గ్లామర్ ముందు ఇద్దరు నేతలు తేలిపోతారని ఒక టాక్ ఉంది. ఇప్పటికే ముద్రగడ చర్యలతో కాపుల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చింది. ఆయన వెంట నేతలే తప్ప ఓటర్లు లేరని విశ్లేషణలు ఉన్నాయి. అటు జేడీ లక్ష్మీనారాయణ సైతం వివిధ రాజకీయ పార్టీల్లో చేరి.. విశాఖ నుంచి పోటీ చేయాలని చూశారని.. అది వీలు పడకపోవడం వల్లే సొంత పార్టీ పెట్టుకున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. అటు పవన్ సైతం సీఎం పదవి విషయంలో స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఈ విషయంలో సైతం ఆయనపై అసంతృప్తి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కాపులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మెజారిటీ వర్గం మాత్రం పవన్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ అనుసరించిన చర్యలతో కాపుల్లో అసంతృప్తి ఉంది. కానీ జేడీ లక్ష్మీనారాయణ, ముద్రగడ సైతం కాపు ఓటర్లను కొంతవైపు తమ వైపు తిప్పుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.