Pawan Kalyan: విశాఖపట్నం వేదికగా జరిగిన దమనకాండను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పూసగుచ్చినట్టు వివరించి వైసీపీ సర్కార్ కు హెచ్చరికలు పంపారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆంధ్రాను ‘వైసీపీ విముక్త రాష్ట్రం’గా మార్చడమే తన ధ్యేయమంటూ ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ క్రిమినల్ రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ క్రిమినల్స్ ఆలోచనతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తోందంటూ మండిపడ్డారు.

ఏపీలో నాలాంటి ప్రముఖుడినే జనం వద్దకు వెళ్లకుండా ఇంత నిర్బంధిస్తే సామాన్యుల సంగతి ఏంటని.. ప్రజలు ఎలా గళమెత్తుతారంటూ పవన్ ప్రశ్నించారు. ప్రశ్నించిన వారికి పింఛన్లు సహా అన్నీ కట్ చేస్తున్నారని ఇదే రాజ్యం అంటూ నిలదీశారు. పోలీస్ వ్యవస్థ కూడా నమ్మకం లేదన్న సీఎం మాటలకు తలొగ్గవద్దని.. భావస్వేచ్ఛను గౌరవించాలని సూచించారు.
ఓ ఐపీఎస్ తననే బెదిరిస్తున్నాడని.. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని.. ఇంతటి నిర్బంధ కాండను తాను ఎప్పుడూ ఎక్కడ చూడలేదని పవన్ అన్నారు. జనవాణి రద్దు చేసుకుంటామన్నా వినకుండా పోలీసులు వ్యవహరించిన తీరు ను పవన్ తూర్పారపట్టారు.
ఏపీలో వైసీపీ దౌర్జన్యాలు, దోపిడీలకు తట్టుకోలేక చాలా మంది తెలంగాణకు వెళ్లిపోతున్నారని.. ఇలాగే వైసీపీ ఉంటే ఏపీలో ఎవరూ మిగలరని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎలాగైతే యువత బలిదానాలు చేసి మరీ సాధించుకున్నారో ఆస్ఫూర్తితో ఏపీ ప్రజలు, యువత పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఈ దమనకాండకు బాధితులుగా తనతోపాటు ఏపీ ప్రజలు మిగిలిపోతున్నారని.. గొంతెత్తినవారిపై కేసులు, అరెస్ట్ లు, జైలు పాలు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని.. దయచేసి ఏపీ బాగు కోసం మీడియా, యూట్యూబ్ చానెల్స్, పత్రికలు గళం ఎత్తాలని.. ప్రజలను చైతన్యవంతం చేసేలా వైసీపీ అక్రమాలు బయటపడేలా రాయాలని.. చూపించాలంటూ రెండు చేతులు ఎత్తి మరీ పవన్ విజ్ఞప్తి చేశారు.మీడియా బలంగా ఉంటేనే సామాన్యుల గోడు తెలుస్తుందని..ఇది తన కోసం చేయమనడం లేదని.. కేవలం ఏపీ ప్రజల కోసం మీడియా అంతా ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చాడు.