Pawan Kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు యాత్రకు అనుమతి ఇచ్చారు. వారాహి యాత్రకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కాకినాడ ఎస్పీ సతీశ్‌కుమార్ స్పష్టం చేశారు. డీఎస్పీలు జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్‌లోనే ఉన్నారని.. పవన్‌పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా.. తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని తెలిపారు. జనసైనికులు ఎలాంటి హడావుడి చేయకుండా, సజావుగా యాత్ర నిర్వహించాలని సూచించారు. వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోవడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
యాగం ముగియగానే అన్నవరానికి పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యాగం మంగళవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగుస్తుంది. సాయంత్రం పవన్ మంగళగిరి నుంచి బయలుదేరి రాత్రికి అన్నవరం దేవస్థానంకు చేరుకుంటారు. పవన్ కంటే ముందే వారాహి వాహనాన్ని అన్నవరం చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు జనసేనాని పవన్ టచ్‌లో ఉన్నారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
జన సైనికుల్లో జోష్..
వారాహి యాత్రకు ఉన్న ఆటంకాలు తొలగిపోవడంతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం వరకు కూడా యాత్రకు అనుమతి రాలేదు. దీంతో ఒకింత టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అడిగిన సమాచారం అందించారు. దీంతో మధ్యాహ్నం యాత్రకు లైన్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా కాకినాడ జనసేన నేత కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న జనసేన వారాహి యాత్రకి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. పోలీసు సానుకూలంగా స్పందించి, యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. జనసైనికులు హడావుడి చేయకుండా, సజావుగా సభ నిర్వహించేలా సహకరించాలని కోరారు. క్రేన్లద్వారా భారీ పూలమాల వేసే ప్రక్రియ లాంటివి లేకుండా, ప్రశాంతంగా యాత్ర చేసుకోవాలని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు.
వలంటీర్ల ఏర్పాటు..
ఇదిలా ఉండగా భద్రత దృష్ట్యా రాష్ట్ర, జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థను జనసేన ఆధ్వర్యంంలో ఏర్పాటు చేశారు. వీరు పవన్‌కళ్యాణ్‌కు నిరంతరం భద్రతగా ఉంటారు. యాత్ర పొడవునా వలంటీర్ల భద్రత కొనసాగుతుంది. ఇక రాత్రికి అన్నవరం చేరుకోనున్న పవన్ బుధవారం ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారు. తర్వాత యాత్ర ప్రారంభిస్తారు. కత్తిపూడిలో నిర్వహించే మొదటి బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.