Pawan kalyan: ఊరికే చేయరు మహానుభావులు అని.. పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అడిగిన వారికి.. అడగని వారికి భారీగా విరాళాలు అందించే మన పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించి భారీ విరాళం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ముఖ్యంగా ఏపీలో అత్యధికంగా ఉన్న దళితులను ఆకర్షించే భారీ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోట్లలో విరాళాలు ఇస్తుంటారు. గతంలో ప్రకృతి విపత్తులు, కరోనా వేళ ప్రభుత్వాలకు రూ. కోటి చొప్పున సాయం చేశాడు. సైనిక సంక్షేమానికి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఇదే తరహాలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని పాలించిన ఒక దళిత దిగ్గజం కోసం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో దళితులకు రాజ్యాధికారం వచ్చింది వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో ముఖ్యుడు దామోదరం సంజీవయ్య. ఉమ్మడి ఏపీకి రెండేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండేళ్లలోనే ప్రజాహిత పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దళిత నేత.. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల పాలిటిక్స్ కు పదవి కోల్పోయాడు. ఆ తర్వాత ఈ దళిత నేతను అటు కాంగ్రెస్ ఇతర పార్టీలు పట్టించుకున్న పాపాన పోలేదు.
పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీకి ఈ దళితదిగ్గజాన్ని ఓన్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య స్మారకం నిర్మాణం కోసం ఏకంగా రూ. కోటి విరాళం ప్రకటించడం సంచలనమైంది. ఈ కోటితోపాటు నిధిని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి స్మారకం నిర్మిస్తానని పవన్ చేసిన ప్రకటన మిగతా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇన్నాళ్లు ఈ దళిత దిగ్గజ నేతను కాంగ్రెస్ పార్టీ సహా అన్ని వదిలేశాయి. పవన్ ప్రస్తుతం ఆయన మంచి పనులను వెలుగులోకి తీసుకొచ్చి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి ఘనతను చాటాలని డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ లో నాడు 6 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశాడని.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడని.. బోయలు, కాపులను బీసీల్లో చేర్చిన గొప్ప నేత అని పవన్ గుర్తు చేస్తున్నాడు.
చూస్తుంటే జనసేన ఈ దిగ్గజ నేతను ఓన్ చేసి దళితుల ఓట్లపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. సంజీవయ్యను ముందుపెట్టి పవన్ ప్రత్యర్థి వర్గాల నుంచి దళితుల ఓట్లను ఆకర్షించే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దళిత ఓటు బ్యాంక్ కోసం పవన్ వేస్తున్న ఈ ఎత్తుగడలు ఫలిస్తాయో లేవో చూడాలి మరీ..