Pawan kalyan Nagababu: రైతుల ఆవేదనను జనసేనాని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కడిగిపారేశారు. పవన్ కళ్యాణ్ పంచులు.. అధికారపక్షంపై మరో కీలక నేత నాగబాబు సెటైర్లతో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మద్దతు ధర.. రైతులు మోసపోతున్న వైనాన్ని జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఎండగట్టారు. అన్నం పెట్టే రైతన్న రాష్ట్రంలో బహిరంగంగా మోసపోతున్నాడని.. కర్షకుడు తన కష్టాన్ని అమ్ముకునే క్రమంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అతడి కష్టం దోచుకుంటున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2గం.30నిమిషాలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలు, మోసాన్ని పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వారు మిల్లర్లతో కుమ్మక్కై రైతును ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు రైతుకి కనీస ధర ఇవ్వకుండా నష్టపరుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. దీనిపై గడపగడపకు కార్యక్రమంలో అడిగితే బెదిరింపులకు దిగారని ఆవేదన చెందారు.
ఏపీలో రైతులకు అండగా ఉండాల్సిన రైతు భరోసా కేంద్రాలు వాళ్లను మభ్యపెట్టి సగం ధరకే అమ్ముకునేలా చేస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. తేమ ఎక్కువశాతం ఉందని.. బియ్యం రంగు మారాయని.. నూక వస్తోందని రకరకాలు కారణాలు చెబుతున్నారు. రైతుభరోసా కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. మిల్లర్లు చెలరేగిపోతున్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ లేవనెత్తి రైతుల పక్షాన మాట్లాడారు. రైతుభరోసా కేంద్రాల సిబ్బంది, మిల్లర్లు ఓ ముఠాగా ఏర్పడి చేస్తున్న తతంగాన్ని బయటపెట్టారు.
ఇక మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సెటైర్లతో హోరెత్తించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మట్టిని కూడా వదిలిపెట్టకుండా తవ్వుకొని తినేశాడని సెటైర్లు వేశారు. దీనికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పడిపడి నవ్వారు. అనంతరం విశాఖలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కౌలు రైతులకు లక్ష చొప్పున ఇవ్వలేదని ఓ వ్యక్తి తనను ప్రశ్నించాడని.. వాళ్లు ఎవరని ప్రశ్నిస్తే అసెంబ్లీని కౌలుకు తీసుకున్న జగన్, చంద్రబాబు అన్నారని.. ఇదెక్కడి న్యాయం ప్రశ్నించాడని సెటైర్ వేశారు. దీనికి సైతం పవన్, నాదెండ్ల నవ్వుకున్నారు.
మొత్తంగా పవన్ కల్యాణ్ కౌలు రైతుల ఆవేదన, ఆక్రందనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. నాగబాబు నేతల అవినీతి, వ్యవహారశైలిపై సెటైర్లు వేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.