Pawan Kalyan CM Candidate: రాబోవు ఎన్నికల్లో గెలుపోటములపై ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు ఆయా పార్టీల్లో మొదలయ్యాయి. అంతిమంగా జనాకర్షణతో పాటు నమ్మదగిన వ్యక్తి అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ప్రజల మైండ్ సెట్ 50 శాతం వరకు మారిపోతుంది. ఈ క్రమంలో ఈ సారి ముఖ్యమంత్రి పదవికి ప్రతీసారి పోటీలో నిలుస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాకుండా, శరవేగంగా పార్టీని విస్తరింపజేసిన పవన్ కల్యాణ్ బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు జరుగుతున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన నాయకులు అవుననే చెబుతున్నారు.
గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో జనసేన అవమానాల పాలైంది. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే పవన్ కల్యాణ్ కంకణం కట్టుకున్నారని వైసీపీ నేతలు విమర్శలు దాడి చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజమని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన అధినేత కాలు కదిపిన వెంటనే ఆ పార్టీ మంత్రుల చేత తిట్టించడం మొదలుపెట్టారు. అయితే, పదే పదే ఆ అవకాశం ఇవ్వకుండా ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చెప్పు చూపించి మరీ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చి నోళ్లూ మూయించారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీతో జట్టుకట్టింది. తనకు రూట్ మ్యాప్ ఇస్తే ఏపీలో అధికారం సాధించి చూపుతానని పవన్ కల్యాణ్ పలుమార్లు అన్నారు. అయినా, అటు నుంచి సానుకూల పవనాలు రాకపోయినప్పటికీ అంతర్గతంగా బీజేపీతో కలిసే ఉన్నట్లు ప్రకటిస్తూనే ఉన్నారు. వైసీపీ నేతలు బీజేపీతో అంటగాకుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి కూడా జనసేన తెరదించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైసీపీ మునిగిపోయే నావ అని బీజేపీ నేతలు తెలుసుకునేందుకు పెద్దగా సమయం కూడా పట్టలేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. బీజేపీ పెద్దలతో సమావేశమైన ప్రతీసారి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. అంతేగాక తెలుగుదేశం పార్టీని బీజేపీతో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ-జనసేన- టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపై ఏ పార్టీ స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. అయినా, తెరవెనుక ఇంకేదో జరుగుతుందన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అదే పవన్ కల్యాణ్ అభ్యర్థిత్వంపై తర్జన భర్జన. ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీదారుడిగా ప్రకటిస్తే పొత్తుకు ఓకేనని బీజేపీ పెద్దలు కూడా సూచన ప్రాయంగా తెలిపినట్లుగా విశ్వసనీయ సమాచారం.
రెండు రోజుల క్రితం జనసేన ముఖ్య నేత నాగబాబు మాట్లాడుతూ గతంలో జనసేనకు 2 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందని, ప్రస్తుతం 35 శాతానికి చేరిందని అన్నారు. అంత ఓటు బ్యాంకు ఉందని నమ్ముతున్న పార్టీ ఇంకో పార్టీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించేందుకు ఎందుకు సహకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన పెట్టిన ప్రతిపాదనకు టీడీపీ కూడా ఓకే అన్నట్లు సమాచారం. 5 యేళ్లలో చెరో 2 1/2 సంవత్సరాలు జనసేన, టీడీపీ ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేందుకు టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది.