Padayatra: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా ముందస్తు ఎన్నికలతో రాజకీయ వేడి రాజుకుంది.. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈసారి తమ సత్తా చాటాలని ఇప్పటినుంచే వ్యూహం పన్నుతున్నాయి. వాటికున్న మార్గాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలతో గ్రామాల్లో తిరుగుతూ వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని పార్టీలు పాదయాత్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్సీతో సహా కొత్తగా ఏర్పాటయిన వైఎస్ ఆర్టీపీ సైతం తెలంగాణలో పాదయాత్రల జోరు పెంచాయి. అయితే పాదయాత్రలు చేయడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చా..? గతంలో ఎవరెవరు పాదయాత్ర చేశారు..? ఎలాంటి ఫలితాన్ని పొందారు..? దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పాదయాత్రే తోడ్పడిందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.

దేశ స్వాతంత్ర్యం కోసం 1930లో మహాత్మగాంధీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా పాదయాత్ర చేశారు. వినోబా భావే తెలంగాణలో 1951లో భూదాన్ ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు టీడీపీ రెండు సార్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పాదయాత్ర చేసింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేయడంతో 2009లో అధికారంలోకి వచ్చారు. 2012లో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రతో 2014లో అధికారంలోకి వచ్చారు. ఇక వైఎస్ రాజేశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రిబాటలోనే విభజన ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టి 2019లో అధికారంలోకి వచ్చారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం ఆశలు.. ఎంత సింపులో తెలుసా?
ఇలా ఎందరో నాయకులు పాదయాత్రలు చేపట్టి అధికారంలోకి వచ్చారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలతో ప్రజల వద్దకు చేరుతున్నాయి. పాదయాత్రలు చేయడం ద్వారా ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవచ్చనే భావనతో ఉన్నారు. వేల కిలోమీటర్లు నడుస్తూ శ్రమకోర్చి ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎంతో కొంత లాభం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ యే పార్టీ ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేస్తోంది..?
-బీజేపీ -ప్రజాసంగ్రామయాత్ర:

తెలంగాణలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని, ప్రధాన ప్రతిపక్షం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు ప్రజా సంగ్రామ యాత్రను మొదలుపెట్టారు. మొత్తం 380 కిలోమీటర్లు సాగనున్న ఈ పాదయాత్ర సుమారు 10 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుందని తెలుపుతున్నారు. అయితే విడదల వారీగా పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాయకులు ప్రస్తుతం రెండో విడతలో భాగంగా గ్రామగ్రామాన తిరుగుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పెట్టిన ఈ యాత్ర 2021 ఆగస్టులో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మొదలైంది. మే 13న మహేశ్వరంలోని యాత్ర ముగుస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
-కాంగ్రెస్-పీపుల్స్ మార్చ్ యాత్ర:

గత రెండు పర్యాయాలు అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2019 వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మూడో స్థానానికి వెళ్లింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆ పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం మధిరలోని యాదవెల్లి గ్రామం నుంచి ఫిబ్రవరి 27న పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా ఈ జిల్లాలోని 135 గ్రామాల్లో 506 కిలోమీటర్లు పర్యటించిన తరువాత ఇతర జిల్లాలో చేయాలని విక్రమార్క లక్ష్యంగా పెట్టుకున్నారు.
-వైఎస్ఆర్టీపీ – ప్రజాప్రస్థానం యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురైన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా సక్సెస్ అయిన తండ్రి బాటలోనే షర్మిల 2021 అక్టోబర్ 21న చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. అయితే ఆ సమయంలో కొవిడ్ నిబంధనలు అడ్డు రావడంతో 21 రోజుల తరువాత తాత్కాలికంగా వాయిదా వేశారు. మార్చి 18 నుంచి మళ్లీ ఈ పాదయాత్రను మొదలు పెట్టారు. తెలంగాణలోని 90 నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-బీఎస్పీ -బహుజన రాజ్యాధికార యాత్ర

ఐపీఎస్ అధికారి అయిన ఆర్.ఎస్ ప్రవీన్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ లో చేరిన తరువాత ఆ పార్టీను కొత్త దారిలో తీసుకెళ్తున్నాడు. పాదయాత్రతోనే సక్సెస్ అవుతామని భావించిన ఆయన మార్చి 6న బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించారు. దళితుల హక్కుల కోసం పోరాడే పార్టీగా ఆయన పార్టీకి ముద్ర ఉంది. జనగామ జిల్లాలోని ఖిలాశాపూర్ గ్రామం నుంచి మొదలు పెట్టిన ఈ యాత్ర 300 రోజులు కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ, పంజాబ్లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం పాదయాత్ర చేస్తోంది. ఆ పార్టీకి చెందిన సెర్చ్ కమిటీ చైర్మన్ ఇందిరా శోభన్ నేతృత్వంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఎన్నిరోజులు, ఎన్నికిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉంటుందో ఇప్పుడే చెప్పేలేం అని ఆమె తెలిపారు.
Also Read:Somu Veerraju: తగ్గేదెలే అంటున్న సోము వీర్రాజు.. అత్మకూరు బరిలో బీజేపీ అభ్యర్థి
[…] Wanted Lease Farmer: దేశంలో సాగు రంగం కుదేలవుతోంది. రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీంతో నష్టాలే పలకరిస్తున్నాయి. ఈనేపథ్యంలో రైతు నిరంతరం దిగులు చెందుతున్నాడు. కలిసిరాని కాలంతో వేగలేక సాగుకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాడు. చేసిన కష్టానికి ప్రతిఫలం లేకపోవడంతో ఇక లాభం లేదనుకుని అస్త్ర సన్యాసం చేస్తున్నాడు. వ్వవసాయంలో సాయం లేక ఇక ఆ పని చేయడానికి సైతం వెనకాడుతున్నాడు. ఇన్నాళ్లు అల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు చూశాం. కానీ రాబోయే రోజుల్లో పొలం కూడా అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు వస్తాయని తెలుస్తోంది. వ్యవసాయంలో రైతులకు లాభం లేకపోగా నష్టాలే పలకరిస్తున్నాయి. […]