-200 సీట్లు సర్దుబాటు చేసుకుందామంటూ ప్రతిపాదనలు
Congress : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాలకు ఆయువుపట్టు వచ్చినట్లయ్యుంది. . 2024 సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ కు దూరంగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మూడోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా విపక్షాలు ఒక్కతాటిపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. మొన్నటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విశ్వసించని పార్టీలు ఇప్పుడు స్వరం మార్చుతున్నాయి. అయితే బీజేపీతో ప్రత్యక్ష పోరులో ఉన్న కాంగ్రెస్ 200 పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాయి.
మమత అభిప్రాయం మారింది
కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో కాంగ్రెస్ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మనసు మారింది. కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని కొద్ది రోజుల క్రితం మమత వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ వారికి మద్దతు ఇవ్వాలని షరతులు పెట్టింద. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ ప్రభావం తక్కువేనని, అక్కడ ఆయా పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నేను కర్నాటకలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాను.. కానీ బెంగాల్‌లో వారు నాకు వ్యతిరేకంగా పోరాడకూడదని, టీఎంసీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాంగ్రెస్ మద్దతు ఇస్తేనే బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోగలమని చెప్పారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ సిద్ధపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే..
బలమున్న చోట దృష్టి పెట్టాలి..
కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలి. మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలకు వదిలివేయాలి. ఈ ఫార్ములా ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన, తమిళనాడులో డీఎంకే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీపై కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టకూడదనే ఆలోచన.
సీట్ల సమీకరణ
వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సీట్లను కూడా చేర్చారు. మమతా బెనర్జీ విశ్లేషణ ప్రకారం, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వగల 200 సీట్లు ఉన్నాయి. ఆ 200 సీట్ల పైనే గురి పెట్టడం ముఖ్యం. మధ్యప్రదేశ్‌లో 29, కర్ణాటకలో 28, గుజరాత్‌లో 26, రాజస్థాన్‌లో 25, అస్సాంలో 14, ఛత్తీస్‌గఢ్‌లో 11, హర్యానాలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నింటి సీట్లు కలిపితే ఈ సంఖ్య 143 అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. ఈ సీట్లపై కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఇది కాకుండా పెద్ద రాష్ట్రాల్లో నాలుగైదు సీట్లు ఇవ్వడం ద్వారా ఈ సంఖ్య 200కి చేరనుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో కేటాయిస్తే 200 సంఖ్యకు చేరుకుంటుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇదే ఫార్ములాతో ముందుకు వచ్చారు.ఈ ప్రతిపాదలను కాంగ్రెస్ అంగీకరిస్తే 2024 లో బీజేపీకి చెక్ పడుతుందనే భావన ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నది.
-శెనార్తి