Munugode By Election 2022: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ నిజంగానే భయపడుతోందా..? వచ్చే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు ఇతర పార్టీల మద్దతు కోరుతోందా..? ఇన్నాళ్లు తానొక్కడే జగజ్జేత అని అనుకున్న కేసీఆర్ ఇప్పుడు సీపీఐ నాయకులను కలవడానికి కారణమేంటి..? తెలంగాణలో ఇప్పటి వరకు అనేక ఉప ఎన్నికలు జరిగాయి. 2018 నుంచి ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికలు జరగగా అందులో రెండు టీఆర్ఎస్, రెండు బీజేపీ గెలిచాయి. అయితే చివరిగా జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి చెందింది. భారీగా నిధులు సమకూర్చినా టీఆర్ఎస్ ను ఆదరించలేదు. దీంతో ఇప్పుడు జరిగే మునుగోడు ఉప ఎన్నికలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందా..? అనే చర్చ జరుగుతోంది. అయితే ఆ పరిస్థితి రాకుండా కేసీఆర్ ముందే జాగ్రత్తపడుతున్నారు. ఇందులో భాగంగా సీపీఐని మద్దతు కోరారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా సీపీఐ నాయకులను కలిశారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలని అడిగారు. అధికారంలో ఉన్న పార్టీ మద్దతు కోరితే ఏ పార్టీ కాదంటుంది..? అందుకే సీపీఐ నాయకులు వెంటనే ఒప్పేసుకున్నారు. వాస్తవానికి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అందుకే 2018లో టీఆర్ఎస్ హవా సాగినా ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఎంతో కాలంగా ఈ నియోజకవర్గం ఉన్న నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గాలే వీస్తోంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన అనుచవర్గం రాజగోపాల్ రెడ్డితో వెళ్లలేదని తెలుస్తోంది.
Also Read: Pawan kalyan On Rayalaseema: రాయలసీమ కష్టాలపై కదిలివస్తున్న పవన్ కళ్యాణ్
ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గెలుపుపై సర్వత్రా చర్చ సాగుతోంది. తమ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామన్న రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని అక్కడి ప్రజలు ఆగ్రహం చెందుతున్న విషయం కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలుస్తోంది. ఈ తరుణంలో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అయితే మునుగోడులో టీఆర్ ఎస్ కేడర్ కాంగ్రెస్ కన్నా తక్కువగా ఉంది. దీంతో ఇతర పార్టీలను కలుపుకుంటే ఆ సమస్య ఉండదని భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ను తనలో కలుపుకునే అవకాశం లేదు. అందుకే కేసీఆర్ తనదైన శైలిలో సీపీఐ నాయకులను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అవసరం ఉన్న మేరకు పార్టీలతో పొత్తు పెట్టుకొని.. ఆ తరువాత వారిని దూరం పెట్టడం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. గతంలోనూ ప్రత్యేక తెలంగాణ రాకముందు కేసీఆర్ సీపీఐ నాయకులతో కలిసి పోటీ చేశారు. ఆ తరువాత యధావిధిగా వారిని దూరం పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కు వారి అవసరం పడింది. అయితే సీపీఐ నాయకుల తీరు మారలేదు. తమల్ని అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారని వారు గుర్తించడం లేదు. అధికార పార్టీ అడిగిందే తడవుగా వారు వెంటనే ఒప్పేసుకున్నారు. అంతేకాకుండా నేడు అఫీషియల్ గా కూడా డిక్లేర్ చేయనున్నారు.
అయితే సీపీఐ నాయకులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు. వారి కేడర్ తో ఎంతో కొంత ఉపయోగం ఉండవచ్చు. అయితే ఈ కలయికతో ప్రాయోజనం ఉంటుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ ఇంతటితో ఆగకపోవచ్చు. మరికొంతమంది నాయకులపై ఇలాగే వల వేయవచ్చు. అవకాశం దొరికితే టీఆర్ఎస్ లోకి వెళ్దామనుకున్న కాంగ్రెస్ నాయకులు కొందరు ఉండే ఉంటారు. వారిపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇలా మొత్తానికి మునుగోడును కైవసం చేసుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. దుబ్బాక, హుజూరాబాద్ విషయంలో లైట్ తీసుకోవడంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేందుకు కేసీఆర్ కొత్త కొత్త వ్యూహం పన్ననున్నారు.