Modi mark politics : ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో’ వాడే పండుగాడు అన్నట్టుగా మోడీ తన ‘పవర్’ చూపిస్తున్నారు. ఎవరిని ఎక్కడ ఎలా లొంగదీసుకోవాలో.. దెబ్బతీయాలో మోడీకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదనడంలో ఎలాంటి సందేహం లేదు. తనను మోసం చేసిన వారిని వదలకుండా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడంలో మోడీ షాలను మించిన కరుడుగట్టిన నేతలు మరొకరు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసి.. తనకు బద్ద శత్రువైన కాంగ్రెస్ తో కలిసిన చంద్రబాబుకు ఇప్పుడు శంకరగిరి మాన్యాలే దిక్కు అన్నట్టుగా చేసేశారు మోడీషాలు. ఏపీలో చంద్రబాబు, టీడీపీ లేకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఓవైపు జగన్ తో.. మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకొని చంద్రబాబును ఎదగనీయకుండా కనుమరుగు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇక ఏపీలోనే కాదు.. దేశంలోనూ బీజేపీ వ్యతిరేకులను అంత ఈజీగా వదిలపెట్టరు మోడీ షా బ్యాచ్. గతంలో ప్రతిపక్షంలో ఉండగా అమిత్ షాను జైలు పాలు చేసి ముప్పుతిప్పలు పెట్టారు ఇదే కాంగ్రెస్ అధినేత్రి సోనియా. ఇప్పుడు ఆమె మెడకు ‘నేషనల్ హెరాల్డ్’ కేసు చుట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మోడీని గోద్రా కేసుల్లో ఇరికించిన దానికి ఇదే బదులు అంటున్నారు.
శివసేన.. అంటే మరో బీజేపీ.. ఇది బాల్ థాకరే ఉన్నప్పటి మాట.. హిందుత్వ భావజాలంతో పుట్టిన ఈ పార్టీ కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకి. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో ఓసారి అధికారం పంచుకుంది.కానీ బాల్ థాకరే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మోసం చేసి తన బద్ద శత్రువైన కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన సిద్ధాంతాలను గంగలో కలిపి అలివికాని పొత్తు పెట్టుకొని ఇన్నాళ్లు సంసారం చేశారు.
ఈ అనైతిక పొత్తును గమనిస్తూ వచ్చిన కేంద్రంలోని మోడీషాలు అదును చూసి చావు దెబ్బ తీశారు. ఉద్దవ్ ఠాక్రే వైఖరితో విసుగు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత ఏకనాథ్ షిండేతో తిరుగుబావుటా ఎగురవేయించి ఉద్దవ్ సీటుకే ఎసరు పెట్టారు.తమతో పెట్టుకుంటే వదిలేది లేదని.. లేట్ అయినా దెబ్బకొడుతామని మోడీషాలు చేసి చూపించారు..
ఎంత పొత్తుల సంసారమైనా విడదీయడం ఈజీ.. కాంగ్రెస్, ఎన్సీపీలు ఈ విషయంలో బలంగా ఉన్నా.. తనకు మద్దతు ఇచ్చినా సొంత శివసేన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉద్దవ్ ఠాక్రే ఉండిపోయారు. సొంత పార్టీనే కాపాడుకోలేని వ్యక్తి ఇతర పార్టీలను, రాష్ట్రాన్ని ఎలా కాపాడుకుంటారని ఇప్పుడు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్దవ్ సీఎం సీటుకే ఎసరు తెస్తున్నాయి.
మోడీ షాలు శివసేన సర్కార్ ను కూల్చడం పెద్ద విషయం కాదు. కానీ ఉద్దవ్ ఠాక్రే పాలనపై వ్యతిరేకత వచ్చేలా చేసి.. ఆయనను ప్రజలు తిరస్కరించే వరకూవేచిచూశారు. పార్టీ నేతలు చీకొట్టే వరకూ వేచిచూసి అదును చూసి దెబ్బకొట్టారు. మళ్లీ ఎన్నికలు జరిగినా కూడా శివసేనకు ఓట్లు పడకుండా మోడీషాలు రాజకీయం చేశారు. కొడితే రాజకీయ భవిష్యత్ లేకుండా చేసిన ఈ నయా మోడీ మార్క్ రాజకీయం దేశంలో చర్చనీయాంశమవుతోంది.