Liz Truss: కొన్ని నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా ‘లిజ్ ట్రస్’ ఎన్నికయ్యారు. మన ప్రవాస భారతీయుడు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ఈ రేసులో గట్టి పోటీనిచ్చినప్పటికీ ఓడిపోయారు. ఒక భారతీయుడు మనల్ని పాలించిన బ్రిటన్ ను పాలించాలని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. శ్వేతజాతికే చెందిన లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత కొత్త ప్రధాని గా ఎన్నిక కోసం కన్జర్వేటివ్ పార్టీ పెద్ద ప్రక్రియనే చేపట్టింది. చాలా మంది నేతలు పోటీపడ్డారు. వివిధ దశల వడపోత తర్వాత మెజార్టీ సభ్యుల ఓటింగ్ లో రిషి సునక్ ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా .. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో లిజ్ ట్రస్ విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్ కు 81326 ఓట్లు రాగా.. రిషి సునక్ కు 60339 ఓట్లు వచ్చాయి. దాదాపు 21 వేల ఓట్ల తేడాతో రిషి సునాక్ పై లిజ్ ట్రస్ విజయం సాదించారు.
భారత సంతతికి చెందిన రిషి సునక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో లిజ్ ట్రస్ వైపే పార్టీ క్రియాశీల సభ్యులు మొగ్గుచూపారు.సర్వేలన్నీ కూడా ట్రస్ కే మెజార్టీ చూపాయి. అన్నట్టే ఆమె గెలిచారు. ఎన్నికైన అనంతరం తాను ప్రజల ప్రధానిగా ఉంటానని.. పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ది చేసేందుకు ధైర్యమైన ప్రణాళికను అందిస్తానన్నారు.
బ్రిటన్ మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్ మూడో వ్యక్తి. ఈమె కంటే ముందు మార్గరెట్ థాచర్, థెరిసా మే మహిళా ప్రధానులుగా చేశారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో లిజ్ ట్రస్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు.
-లిజ్ ట్రస్ ఎవరంటే?
లిజ్ ట్రస్ పూర్తి పేరు.. మేరీ ఎలిజబెత్ ట్రస్. ఈమె 1975 జూలై 26న జన్మించారు. లిజ్ ట్రస్ ఆక్స్‌ఫర్డ్‌లోని మెర్టన్ కాలేజీలో చదివారు. 1996లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ లిబరల్ డెమోక్రాట్‌లకు అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. ఆమె షెల్, కేబుల్ & వైర్‌లెస్ విభాగంలో కొద్దికాలం పనిచేసింది. థింక్ ట్యాంక్ రిఫార్మ్ కంపెనీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసింది. ట్రస్ 2010 సాధారణ ఎన్నికలలో సౌత్ వెస్ట్ నార్ఫోక్ నుంచి ఎన్నికయ్యారు. ఆమె పిల్లల సంరక్షణ, గణిత విద్య మరియు ఆర్థిక వ్యవస్థతో సహా అనేక విధాన రంగాలలో సంస్కరణలకు పిలుపునిచ్చారు. ఆఫ్టర్ ది కోయాలిషన్ (2011) , బ్రిటానియా అన్‌చెయిన్డ్ (2012)తో సహా అనేక పుస్తకాలను రాసింది. కొన్నింటికి రచన సహకారం కూడా అందించింది.
ట్రస్ 2012 నుండి 2014 వరకు పార్లమెంటరీ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌గా పనిచేశారు. 2014 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని కామెరూన్ ఈమెను పర్యావరణం, ఆహారం మరియు గ్రామీణ వ్యవహారాల కార్యదర్శిగా క్యాబినెట్‌లో నియమించబడ్డారు. 2016 ప్రజాభిప్రాయ సేకరణలో యూకే యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలనే ప్రచారానికి ఆమె మద్దతుదారు అయినప్పటికీ ఫలితం తర్వాత ఆమె బ్రెగ్జిట్‌కు మద్దతు ఇచ్చింది. జూలై 2016లో కామెరాన్ రాజీనామా చేసిన తర్వాత ట్రస్ మే నాటికి న్యాయ శాఖ కార్యదర్శిగా మరియు లార్డ్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. వెయ్యి సంవత్సరాల కార్యాలయ చరిత్రలో మొదటి మహిళా లార్డ్ ఛాన్సలర్‌గా అవతరించారు. 2017 సాధారణ ఎన్నికల తరువాత, ట్రస్ ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019లో మే రాజీనామా చేసిన తర్వాత కన్జర్వేటివ్ నాయకుడిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడానికి లిజ్ ట్రస్ మద్దతు ఇచ్చింది. అతను ట్రస్‌ను అంతర్జాతీయ వాణిజ్యానికి రాష్ట్ర కార్యదర్శిగా మరియు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అధ్యక్షురాలిగా నియమించాడు. సెప్టెంబరు 2019లో మహిళలు మరియు సమానత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2021 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆమె విదేశీ, కామన్వెల్త్ , అభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదోన్నతి పొంది అంతర్జాతీయ వాణిజ్య శాఖకు మారారు. ఆమె డిసెంబర్ 2021లో యూరోపియన్ యూనియన్‌తో ప్రభుత్వ ప్రధాన సంధానకర్తగా.. ఈయూ-యూకే భాగస్వామ్య మండలి యూకే అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
ఆమె ప్రస్తుతం 2021 నుండి విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శిగా బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. 2019 నుంచి మహిళలు.. సమానత్వ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యురాలుగా క్రియాశీలకంగా ఉన్నారు. 2010 నుండి సౌత్ వెస్ట్ నార్ఫోక్ పార్లమెంటు సభ్యురాలు (MP)గా ఉన్నారు. ఆమె ప్రధానమంత్రులు డేవిడ్ కామెరూన్, థెరిసా మే మరియు బోరిస్ జాన్సన్ హయాంలో వివిధ క్యాబినెట్ స్థానాల్లో పనిచేశారు. ట్రస్ 5 సెప్టెంబర్ 2022న కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో తన ప్రత్యర్థి రిషి సునక్‌ను ఓడించి గెలుపొందారు. సెప్టెంబరు 6న ప్రధానమంత్రిగా నియమితులు కానున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవిలో పనిచేసే మూడవ మహిళగా ఈమె రికార్డు సృష్టించనున్నారు. ప్రవాస భారతీయుడు రిషి సునాక్ ను ఓడించి ఈమె తదుపరి ప్రధానిగా నియమితులయ్యారు.
-రిషి సునాక్ ఎందుకు ఓడిపోయారు?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగల సమర్థత రిషికి ఉందని పార్టీ నమ్ముతోంది. అందరూ పన్ను రాయితీ ఇస్తామని ప్రకటిస్తే.. రిషి మాత్రం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని అంటున్నారు. లిజ్ ట్రస్ పన్నురాయితీ అనడంతో మెజార్టీ ఆమెకే ఓటు వేసి గెలిపించారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న రిషి సునక్ ఒక రకంగా ఇదే మైనస్ గా మారింది. కన్జర్వేటివ్ నుంచి పోటీకి సిద్ధమయ్యే వారు ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే పన్నుల రాయితీ తప్పనిసరి అని.. మా ప్రభుత్వం ఆ పనిచేస్తామని ప్రచారం చేస్తున్నారు.. కానీ రిషి మాత్రం అందుకు సిద్దంగా లేనట్లుగా వ్యతిరేక ప్రచారం జరిగింది.. అంటే ముందు దేశాన్ని ఎకానమీగా వృద్ధి చేయాలని, ఆ తరువాతే పన్నుల రాయితీ అనడంతో రిషి ఓటమి పాలయ్యారు.. అంతకంటే ముందు పన్నుల రాయితీ సాధ్యం కాదని, అలా చేస్తే మరింత ఆర్థిక లోటు ఏర్పుడుతుందని రిషి అంటున్నాడు. పన్నుల రాయితీ కోసం చూసే వారికి రిషి ప్రచారం మింగుడు పడక ఓడగొట్టారు.
విద్వేష రాజకీయాలు సాగుతున్న బ్రిటన్ లో వేరే దేశ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోరు. బ్రిటన్ వాసులనే ఎన్నుకుంటారు. ఆ దేశంలో ఎవరైనా సరే.. వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి గెలిపిస్తారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ‘ఇండియన్ బ్రిటన్ కు ప్రధానినా? సిగ్గుచేటు’ అంటూ ప్రశ్నలు సంధించారు. రిషి సునక్ కు ఎంపీల మద్దతు ఉంది. కానీ క్రియాశీల సభ్యుల ఓట్లు పడలేదు.. అయితే ప్రధానిగా ఎన్నిక కావడానికి పార్టీ క్రియాశీల సభ్యులే కీలకం. దీంతో చివరి నిమిషం వరకూ రిషి గెలుపు కష్టమైంది. ఎంపీల మద్దతుతో పాటు కన్జర్వేటివ్ లోని క్రీయాశీలక సభ్యుల మద్దతు ఇస్తేనే రిషి గెలుస్తాడు. కానీ ఇటీవల నిర్వహించిన ఓపినీయన్ పోల్ లో క్రీయాశీలక సభ్యుల మద్దతు రిషికి లేదన్నది తేలింది. దీంతో చివరి వరకు బ్రిటన్ ప్రధానిగా మన భారతీయుడు గెలవలేకపోయారు. లిజ్ ట్రస్ కే ఎక్కువ ఓట్లు పడడంతో ఆమె బ్రిటన్ ప్రధానిగా గెలుపొందారు.