Telangana CPM Crisis: ఒకప్పుడు ఆ పార్టీ జెండా రెపరెపలాడితే అసెంబ్లీ అదిరేది. ఖమ్మం, నల్గొండ గడ్డలపై ఎర్ర చొక్కా కనిపిస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. కానీ ఇప్పుడు? కంచుకోటలు కాస్తా ‘కంచు’ కరిగిపోయిన గిన్నెల్లా మారిపోయాయి. తెలంగాణ సీపీఎం పరిస్థితి చూస్తుంటే, “ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్” అన్న చందంగా తయారైంది. ఇన్నాళ్లూ పార్టీని తన భుజస్కంధాలపై మోస్తున్నానని భావించిన తమ్మినేని వీరభద్రంకి, ఇప్పుడు సొంత హైకమాండే ‘అభిశంసన’ అనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!
భద్రంగా ఉన్న ‘వీర’ భద్రం!
పార్టీ కేడర్ కరిగిపోతున్నా, ఓట్ల శాతం ఆవిరైపోతున్నా, చివరకు అసెంబ్లీలో అడుగు పెట్టే నాథుడే లేకపోయినా.. మన తమ్మినేని గారు మాత్రం స్టేట్ సెక్రటరీ సీటులో భద్రంగానే ఉంటూ వచ్చారు. దీనినే బహుశా “స్వ-భద్రం” అంటారేమో! 2014లో సున్నం రాజయ్య గెలిచినప్పుడు “ఇది ఆరంభం” అనుకుంటే, అది కాస్తా “ముగింపు” అని కేడర్‌కు అర్థం కావడానికి పదేళ్లు పట్టింది. 2018, 2023 ఎన్నికల్లో సీపీఎం స్కోరు బోర్డు చూస్తే.. సున్నా పక్కన మరో సున్నా చేరి “డబుల్ డిజిట్” సాధించినంత సంబరం కనిపిస్తోంది.
పొత్తుల ‘జిత్తులు’.. కేడర్ కు చిత్తులు!
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, సీపీఎం నేతలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఒకసారి బిఆర్ఎస్ కారు ఎక్కుదామంటారు, అది కుదరకపోతే కాంగ్రెస్ హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తారు. ఈ “పొత్తుల వెంపర్లాట”లో పార్టీ సొంత అస్తిత్వాన్ని గంగలో కలిపేశారన్నది సామాన్య కార్యకర్త వాదన. సిద్ధాంతాలు పక్కన పెట్టి, ముఠా రాజకీయాలకు పెద్దపీట వేయడంతో.. జనం కూడా “మీకెందుకు ఓటేయాలి నాయనా?” అని రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు. ఫలితంగా మున్సిపల్ వార్డుల్లో కూడా పట్టుమని పది సీట్లు గెలవలేని దైన్యం ఆ పార్టీని చుట్టుముట్టింది.
చేతులు కాలిన తర్వాత.. ఆకులు పట్టుకుని!
పార్టీ అంతా నిర్వీర్యమై, అడ్రస్ గల్లంతయ్యాక ఇప్పుడు హైకమాండ్‌కు జ్ఞానోదయం కలిగింది. తమ్మినేనిపై అభిశంసన అస్త్రం ప్రయోగించారు. ఇది ఎలా ఉందంటే.. ఇల్లు మొత్తం తగలబడి బూడిద అయ్యాక, వాచ్‌మెన్ నిద్రపోయినందుకు ఫైన్ వేసినట్టు ఉంది. కొత్త రక్తం ఎక్కించడంలో విఫలమై, సోషల్ మీడియా యుగంలో ఇంకా పాతకాలపు కరపత్రాల రాజకీయాలు చేస్తూ కూర్చుంటే, యువత ఎందుకు వస్తుంది?
తెలంగాణలో ఎర్రజెండా పరిస్థితి ఇప్పుడు “గతమంతా ఘనం.. ప్రస్తుతమంతా శూన్యం” అన్నట్టుగా మారింది. కేవలం గతాన్ని నెమరువేసుకుంటూ, పాత రికార్డులు వినే గ్రామఫోన్ లాగా సీపీఎం తయారైంది. తమ్మినేనిపై చర్యలు తీసుకుంటే మాత్రం పోయిన వైభవం తిరిగి వస్తుందా? లేక ఆ మిగిలిన కొద్దిపాటి “భద్రం” కూడా గాలిలో కలిసిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.