Kumari Srimathi Review : కాలుష్యపు మోతల్లేవ్‌.. వికారపు వాతల్లేవ్‌.. నిండుదనంతో కూడిన ఓ కుమారి లాంటి శ్రీమతి

అనగనగనా గోదారొడ్డున పచ్చటిపొలాల మధ్య పర్ణశాల లాంటి ఓ మండువాలోగిలి.. ఆ ఇంట్లో యే మూలకెళ్ళినా మహాలక్ష్మి అక్కడే తిష్ట వేసుక్కూర్చుందేమో అనిపించేట్టు పరవళ్ళు తొక్కే సందళ్ళు ఆ ఇంటిసొంతం.

Written By: Bhaskar, Updated On : October 2, 2023 6:47 pm
Follow us on

Kumari Srimathi Review: పండు వెన్నెల, పైర గాలి, ఆకుపచ్చని పొలం, చిటారు కొమ్మన తేనె తుట్టె, బెల్లం వేసి చేసిన జున్ను, అమ్మకాచిన నెయ్యి, వేడి వేడి అన్నంలో మాగాయి.. ఇవి ఎప్పుడు మనసులో స్ఫురణకు వచ్చినా గుండె ఝల్లుమంటుంది. ఉద్యోగం వేటలో, బతుకు తాలూకూ సంపాదనలో ఎక్కడికి వెళ్లినా కంటనీరు చెమ్మగిల్లుతుంటుంది. సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే కుమారి శ్రీమతి. నిత్యమీనన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వెబ్‌ సీరిస్‌ అమెజాన్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

అనగనగనా గోదారొడ్డున పచ్చటిపొలాల మధ్య పర్ణశాల లాంటి ఓ మండువాలోగిలి.. ఆ ఇంట్లో యే మూలకెళ్ళినా మహాలక్ష్మి అక్కడే తిష్ట వేసుక్కూర్చుందేమో అనిపించేట్టు పరవళ్ళు తొక్కే సందళ్ళు ఆ ఇంటిసొంతం. ఇద్దరు కొడుకులు, వాళ్ళ పిల్లలతో సహా అందరూ ఒకే చూరు కింద హాయిగా బతికేస్తోన్న ఆ ఉమ్మడి లోగిట్లో అల్లరి చేసే మనవల్ని, వారి ఆనందాల ఆటపాటల్ని అనుభవిస్తూ ఇంటిపెద్ద ప్రభాకరరావుగారు తెగ మురిసిపోతుంటాడు..

కట్‌ చేస్తే..

టైటిల్సవ్వగానే ఇరవైయేళ్ళ తర్వాత.. ఉన్నట్టుండి యే విషాదం కుండపోత వర్షంగా కురిసిందో మరి.. ప్రభాకరరావుగారు కాలం చేసాడు.. రకరకాల వ్యాపారాల పేరుతో దివాలాతీసి భార్యని, పిల్లల్ని వదిలేసి పెద్దకొడుకు ఎక్కడికో పారిపోయాడు. వీళ్ళందర్నీ పోషించడం జరగని పనని చిన్నకొడుకు తన దారేదో తను చూసుకున్నాడు.. దాంతో ఇల్లేమో వెలిసిపోయిన జెండాలాగా పాడుబడిపోయింది.. మనుషులేమో వాడిపోయిన దండలోంచి రాలిపడ్డ పువ్వుల్లాగా చెల్లాచెదురైపోయారు.. అక్కడితో ఆగక తరాలుగా వస్తోన్న ప్రభాకర్రావుగారి ఇల్లు ఎవరికి చెందుతుందనే గొడవ మొదలైంది.. ఆ పాత కొంపని కూల్చేసి డబ్బులు జేసుకుందామని మంకుపట్టు పట్టిన ప్రభాకర్రావుగారి చిన్నకొడుకు ఒకవైపు.. తాతగారి జ్ఞాపకాల్ని కాపాడుకుందామని ప్రభాకర్రావు మనవరాలు మరోవైపూ కోర్టులకెక్కారు, శక్తికొద్దీ వాదులాడు కున్నారు.. నెలకి పదమూడువేల జీతంరాళ్ళ మీద నెట్టుకొస్తూ, ఇల్లో రామచంద్రా అని లాయర్లచుట్టూ పొర్లుదండాలు పెడుతోన్న హీరోయినుకి శ్రీమాన్‌ కోర్టువారు తమ తీర్పును వెలువరిస్తారు. ఆరునెలల్లోగా మీ బాబాయికి ముపైఁఎనిమిది లక్షలిచ్చేసి నీ పేర్న రాయించేస్కో అని.. కాలే కడుపునకు మండే బూడిదిచ్చినట్టు ఒక్కో సారి అలాగే ఉంటాయ్‌ కోర్టు తీర్పులు.. చూస్తే ఈతబెత్తం దెబ్బ, చెప్తే కొరడా దెబ్బా.. ఏం జెయ్యలేం మరి.. ఆ తర్వాత ఏం జరిగింది..?? అది మీరే చూడండి పైమ్ర్లో..

ఇందులో ఏముంది అంత విశేషం, ఇలాంటివి చాలా చూశాం కదా అని మీకనిపించొచ్చు.. ఒక్కో ఎపిసోడుకి కనీసం డజను బూతులు, అరడజను తుపాకీ మోతలు, మూడు బుచుకులు, ఒకట్రెండు బంచిక్కులూ లేకపోతే అది వెబ్‌ సిరీసే కాదేమోన్న అభిప్రాయాలు బలపడుతోన్న నేటి ఓటీటీకాలంలో.. ఈ కుమారి శ్రీమతిలో పాత్రల న్నీ ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు కాకుండా నేల మీద నడిచే మను షుల్లానే మామూలుగా ప్రవర్తిస్తారు.. వాళ్ళు మాట్లాడుకునే భాష కూడా అచ్చతెలుగు నుడికారాలతో పట్టుతేనెలా ఉంటుంది.. జీ వితం విసిరే సవాళ్ళకి మనం ఎలా స్పందిస్తామో అచ్చం అలాంటి భావోద్వేగాలు పండిస్తారు.. వీటన్నింటికీ మించి.. ఇందులో మహిళా పాత్రల్ని మలిచిన తీరుకి తప్పక అభినందించాలి.. సాధికారత అనే పదానికి నిలువెత్తు రూపంలా నిలబెట్టిన సంస్కా రానికి సలాం చెయ్యాలి.. చాలా మామూలుగా కనబడే ఒక్కో ఆడపాత్రా కత్తి పట్టుకోని ఒక్కో రాణీ రుద్రమదేవి. శత్రువులతో కాకుండా సమస్యలతో పోరాడే వీరనారీమణి. ఆ పనీ ఈ పనీ చేసుకుంటూనే కథని ముందుకి నడిపించేస్తారు.

దొంగమొహంవాడైన మొగుడొదిలేసి పారిపోతే ఇద్దరు ఆడపిల్లల్నే సుకుని అవమానాల్ని, ఆటుపోట్లని దైర్యంగా ఎదుర్కొని నిలిచి, గెలిచిన తల్లి పాత్రకంటే బలమైంది ఏది? ఒంటరిగా మిగిలిన పెద్దకొడుకు భార్య కోసం ుఆడపిల్లలతో ఉందిరా.. నేను తనతోనే ఉంటాునని వాళ్ళవైపే నుంచున్న అత్తగారి పాత్రకి ఏదీ సాటి ? స్త్రీలకి చీరలూ, బంగారాలే కాదు తాతలనాటి ఇల్లన్నా కూడా ఒక ఎమోషనేనని నిరూపించడానికి నడుంకట్టి, అడుగడుగునా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన నిత్యామీనన్‌ పాత్రకి ఏదీ పోటీ..? తన మీదకి దండెత్తే సమస్యలా లేక పోటీకొచ్చే బంధువులా..?? నెవర్‌..!ఈ ప్రయత్నంలో హీరోయిన్‌ ని గెలుపుతీరానికి చేర్చే వరకూ వివిధదశల్లో సాయమొచ్చిన స్నేహాలు, అందించిన అండదండలు.. ప్యూర్‌ బిస్డ్‌ అంతే..!! ఇక మనందరం శత్రువులా చూసే కేశవరావు పాత్ర ఏమన్నా తక్కువా ? పరిస్థితులు అలా నడిపించాయేమో తప్ప.. రాళ్లలో కూడా నీరు ఉంటుందన్నట్టు మూతివిరుపులో కూడా ముద్దూముచ్చటా పంచిన అతగాడి కేమీ..?? అన్న కూతురు బాధపడటం చూళ్ళేక తన జేబులోంచే రెండొందల్ని ఆనందంగా తీసి, నాన్న ఇచ్చాడనే అందమైన అబద్ధంతో కప్పి పుచ్చి, బంగారు తల్లంటూ బుగ్గలు పుణికింది ఆ కేశవరావే. తప్పులు చేసి పారిపోయిన అన్నగారి అపుఁల తాలూకూ బరువుని, ఇంటి పరువుని నిలబెట్టింది కూడా ఆ కేశవరావే.. అయితే అసలు శత్రువు ఎవరో ఆఖర్లో తెల్సి ఉసూరుమంటా మనుకోండి అది వేరే విషయం..!!

నటీనటుల విషయానికొస్తే..

నిత్యామీనన్‌ నటించిందో లేక జీవించిందో.. తన పాత్రని ఉతికి, ఆరేసి, ఇస్త్రీ చేసి మన ముందు పరిచింది.. స్ర్కీనంతా నిండైన వెలుగుని పంచింది.. మొదట్లో నీరసంగా కనిపించిన గౌతమి ఆరో ఎపిసోడ్లో పదో నిమిషం దగ్గర విజృంభించి, ఆ పాత్ర ఎందుకలా ఉండాల్సొచ్చిందో చాటి చెప్పింది. తాళ్ళూరి రామేశ్వరి సహజమైన నటన గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తాం..?? తెర మీద నలుమూలలా గోదారి అందాలు అడపాదడపా కనబడి కనువిందు చేశాయి.. వాటితో పోటీపడుతూ బార్‌ సన్నివేశాలు కూడా పదేపదే రిపీటవుతూ పంటికింద రాళ్ళల్లా తగిలాయ్‌.. అయినా గానీ, కా లుష్యపు మోతలు, వికారపు వాతలు లేని శ్రీమతి కాబట్టి హ్యాపీగా చూసొయ్యొచ్చు.