CM KCR: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఓటమిపై బీఆర్‌ఎస్ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చాలా మంది మాటల్లో దక్షిణాది అనే మాట వినిపించింది. దక్షిణాదిలో బీజేపీకి చోటు లేదని ప్రజలు నిరూపించారని వారు చెప్పుకొచ్చారు. ఓ వరుస ప్రకారం దక్షిణాదిని హైలెట్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు చేసిన ప్రకటనలతో .. భారత్ రాష్ట్ర సమితి రాజకీయంలో కేసీఆర్ తరచూ చెప్పే గుణాత్మక మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. ఆ గుణాత్మక మార్పు దక్షిణాది ఉద్యమమే. ప్రాంతీయ ఉద్యమాల్లో కేసీఆర్ అపరచాణక్యుడు కేసీఆర్ ప్రాంతీయ ఉద్యమాల్లో దిట్ట. ఆయన ఉమ్మడి రాష్ట్రం విడగొట్టడం సాధ్యం కాదని వంద కు వందశాతం అనుకుంటున్న దశలో తెలంగాణ రాష్ట్ర సమితిపెట్టి చివరికి అనేక రకాల వ్యూహాలతో తెలంగాణ సాధించారు. ఇప్పుడు దేశ రాజకీయాలకు వెళ్లాలనుకుంటున్న ఆయన దక్షిణాది ఉద్యమం చేపట్టే అవకాశాలపై పరిశీలన చేస్తున్నారని అందుకే.. కొత్తగా దక్షిణాది అంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రకటులు చేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి కనీస అవగాహన ఉన్న ఎవరైనా ఈ అంశాలను కొట్టి పారేయలేరు.
CM KCR: కేసీఆర్.. ‘‘ప్రత్యేక దక్షిణాది’’ ఉద్యమం !?
ప్రత్యేక ఉద్యమానికి ప్లాన్..
వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట ఏదైనా ఓ రాజకీయ పరిణామం జరిగినప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ సిద్దహస్తులు. వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని తెలిసిన తర్వాత ఆయన రకరకాలుగా తొక్కిపెట్టిన తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క ఆమరణ దీక్షతో రోజుల్లోనే ఉద్యమ స్థాయికి చేర్చిన ప్లాన్లు ఆయన సొంత. అంత వేగంగా అవకాశాలను అంది పుచ్చుకునే కేసీఆర్ ఇప్పుడు కర్ణాటక ఫలితాల తర్వాత తన బీఆర్‌ఎస్ పార్టీని దక్షిణాది ఉద్యమంవైపు మళ్లించే అవకాశాలున్నాయన్న సంకేతాలు అందేలా చేశారు. ప్రత్యేక దక్షిణాది ఉద్యమాన్ని అందుకుంటారా ? దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కేసీఆర్ చాలా సార్లు ఆరోపించారు. అనేక లెక్కలు వెల్లడించారు. దక్షిణాది విషయంలో కేంద్రం తీసుకునే కొన్ని నిర్ణయాలు వచ్చే కొద్ది రోజుల్లో వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, జనాభాను బట్టి పార్లమెంట్ సీట్ల నిర్ణయం వల్ల దక్షిణాది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇది దక్షిణాది మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి అవకాశం ఉంది. కేసీఆర్ వీటిపై ముందు ముందు వర్కవుట్ చేసే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్ నేతల చెబుతున్నారు.
సౌత్‌గ్రూప్‌పై సుప్రీంలో పిటిషన్..
ప్రత్యేక దక్షిణాది ఉద్యమానికి ప్లాన్ చేస్తున్న బీఆర్‌ఎస్.. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాంలో పదే పదే సౌత్ గ్రూప్ అని ఈడీ, సీబీఐ ప్రస్తావించడాన్ని ఓ న్యావాది ద్వారా సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సౌత్, నార్త్ అని పేర్కొనడం ద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని దర్యాప్తు సంస్థలు దెబ్బతీస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో సుప్రీం ధర్మాసనం దర్యాప్తు సంస్థలకు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సౌత్, నార్త్ అన్న ప్రస్తావన తేవొద్దని సూచించింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ప్రత్యేక దక్షిణాది ఉద్యమానికి ప్లాన్ చేయడం చర్చనీయాంశమైంది. మరి ఇది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.