IT Notice To Chandrababu : చంద్రబాబు కూడా సుద్ధపూసేం కాదని తేలిందే!

సీఎం హోదాలో ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి సైతం ముడుపులు అందుకున్నారని బయటపడడం మాత్రం చంద్రబాబుకు బిగ్ షాకే. జగన్ చంద్రబాబు దొందుకు దొందే అన్నట్టు ప్రజలు ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తున్నారు.

Written By: Dharma, Updated On : September 1, 2023 11:24 am

Naidu-residence_750

Follow us on

IT Notice To Chandrababu : “నేను మంచివాడిని.. నేను నిజాయితీపరుడ్ని”.. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పుకొచ్చే మాట ఇది. వారి నిజాయితీ ప్రజలు చెప్పుకోవాలి.. ప్రజలు గుర్తు ఎరగాలి. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం నా అంత నిజాయితీపరుడు లేరంటారు. తనకు తానే భుజం తట్టుకుంటారు. కానీ అవినీతి ఆరోపణలు ఎదురైన ప్రతిసారి న్యాయస్థానాలకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటారు. ఫార్టీ ఇయర్స్ లో జరిగింది ఇదే. అందుకే వ్యవస్థలను మేనేజ్ చేయగల నేర్పరి అని చంద్రబాబుపై ఒక ఆరోపణ ఉంది.

తాజాగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంస్థల నుంచి 118 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని చంద్రబాబుపై అభియోగం వచ్చింది. దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఓ కేసు విచారణలో చంద్రబాబు పేరు బయటపడడంతో ఐటి శాఖ చంద్రబాబును ప్రశ్నించింది. కానీ ఆయన నుంచి సానుకూలమైన సమాధానం రాకపోవడంతో.. తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి చంద్రబాబు కావడంతో.. ఈ నోటీసు నుంచి సైతం ఇట్టే బయట పడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు సాయం కోసం కేంద్ర పెద్దలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది నీరుగారినట్టేనన్న అభిప్రాయం సర్వత్ర వినిపిస్తోంది.

అయితే కేసు నుంచి తప్పించుకోవచ్చు కానీ.. విపక్షాల నుంచి మాత్రం చంద్రబాబు తప్పించుకోలేరు. చంద్రబాబు తెల్లవారి లేచింది మొదలు జగన్ అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆర్థిక ఉగ్రవాదిగా పేర్కొంటారు. అయితే సీఎం హోదాలో ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి సైతం ముడుపులు అందుకున్నారని బయటపడడం మాత్రం చంద్రబాబుకు బిగ్ షాకే. జగన్ చంద్రబాబు దొందుకు దొందే అన్నట్టు ప్రజలు ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తున్నారు. చంద్రబాబు సైతం సుద్ధ పూస కాదని తేలినట్లయింది. ఇప్పుడు చంద్రబాబు చుట్టూ వివాదాల ముసురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.