IT Raid on BRS MLA : తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. తాజాగాగా భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది.
రంగంలోకి 70 బృందాలు..
ఉదయం 7 గంటలకే దాదాపు 70 బృందాలు ప్రత్యేక బృందాలు ఆయన ఇళ్లు, కార్యాలయాలకు చేరుకున్నాయి. ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. శేఖర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. లావాదేవీలకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనేక కంపెనీలలో బినామీగా ఉన్నాడని, 15 కంపెనీలలో పెట్టుబడి దారుడుగా ఉన్నారని సమాచారం.
కొన్నాళ్లుగా రియల్టర్లపై దాడులు..
ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొన్నాళ్లుగా తెలంగాణలోని రియల్టర్లు, నిర్మాణ సంస్థలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలను, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రియల్టర్ అయిన పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ దాడులు మూడు రోజులు సాగే అవకాశం ఉందని సమాచారం.
పలు కంపెనీలకు ఎమ్మెల్యే భార్య డైరెక్టర్
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కి సంబంధించి హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే భార్య వనిత ఈ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నట్లు సమాచారం. కొత్తపేటలోని కార్యాలయాలతో పాటుగా, భువనగిరిలోని ఆయన ఆస్తులపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి .
బీఆర్‌ఎస్‌లో మళ్లీ టెన్షన్..
బీజేపీ, బీఆర్‌ఎస్ కాంప్రమైజ్‌కు వచ్చినట్లు ఒకవైపు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా అటు బీఆర్‌ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం లేదు. దీంతో అంతా సర్దుకుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. మళ్లీ ఏ జరుగుతుందో అన్న టెన్షన్ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.