Independence Day 2023 : అల్లూరి పోరాడిన నేల.. విప్లవాల ఖజానా

అల్లూరి విప్లవ సేన 1923 ఏప్రిల్ 15న అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది. దాడి అనంతరం అల్లూరి తో పాటు మిగతా విప్లవకారులు సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారంటే..

Written By: Dharma, Updated On : August 13, 2023 3:38 pm
Follow us on

Independence Day 2023 : ఎంతోమంది మహనీయుల పోరాటఫలం.. భారతదేశానికి స్వాతంత్రం. కానీ కొందరి పోరాటం ఆచంద్రార్కంగా నిలిచింది. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదింది. అటువంటి పోరాటాలు చేసిన వారిలో అగ్ర గన్యులు అల్లూరి సీతారామరాజు. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను నిద్ర పట్టనివ్వని గెరిల్లా పోరాటం ఆయన సొంతం. ఎన్నో సంచలనాల ఘట్టం. దేశం కోసం అమరుడై వందేళ్లు దాటుతున్నా ఆయన రగిలించిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవం. బ్రిటిష్ బానిస సంకెళ్లు నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు గెరిల్లా పోరాటమే శరణ్యమని నమ్మిన గొప్ప దేశభక్తుడు అల్లూరి. క్షత్రియ వంశంలో పుట్టినా.. గిరిజనుల ఇతి బాధలు తెలుసుకొని వారి పక్షాన నిలబడిన అపర బాహుబలి అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు పోరాటాలపై “ఓకే తెలుగు” ప్రత్యేక కథనం..

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించారు. చిన్ననాటి నుంచి అల్లూరికి దైవభక్తి ఎక్కువ. విద్యార్థి దశ నుంచే ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. గుర్రపు స్వారీ, చదరంగం, జ్యోతిష్యం వంటి వాటిలో విశేష ప్రావీణ్యం పొందారు. మల్ల యుద్ధం, కర్ర,కత్తి సాము ,తుపాకీ కాల్చడం వంటి యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. సీతారామరాజు 11వ ఏట తండ్రి వెంకటరాజు కలరా తో మృతి చెందారు. అయితే తండ్రి అల్లూరి సీతారామరాజు లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించగలిగారు. అప్పటి బ్రిటీష్ పాలకుల దురాగతాలను కుమారుడికి వివరించారు.

అల్లూరి 18వ ఏట దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. రిషికేశ్, ప్రయాగ, గంగోత్రి, బద్రీనాథ్, కాశీ వంటి ప్రాంతాలను పర్యటించారు. విదేశీ పాలకుల చేతిలో బాధించబడుతున్న ప్రజలను చూసి చలించిపోయారు. విశాఖ జిల్లాలోని మన్య ప్రాంతంలో అమాయక గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గొంతేత్తడం ప్రారంభించారు. బ్రిటిష్ అధికారుల దమన నీతిని, శ్రమ దోపిడి పై గట్టి పోరాటమే చేశారు. అక్కడి నుంచి అల్లూరిపై బ్రిటిష్ పాలకులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చాలాసార్లు అల్లూరిని గృహనిర్బంధం చేశారు. బ్రిటిష్ పాలకుల చర్యలకు విసిగిపోయిన అల్లూరి సాయుధ పోరాటమే శరణ్యమని భావించారు. 1922 ఆగస్టులో గెరిల్లా పోరాటానికి దిగారు. గిరిజన పెద్దలు గంటం దొర, మల్లు దొరల సాయంతో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్రోద్యమంపై ఆకర్షితులైన వారితో సైన్యాన్ని రూపొందించుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 1800 మంది వీరులతో గెరిల్లా సైన్యం ఏర్పాటయింది.

1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై తొలిసారిగా అల్లూరి సైన్యం దాడి చేసింది. ఏకంగా స్టేషన్ లో పోలీసులను తాళ్లతో బంధించి.. తుపాకులు, ఇతర సామాగ్రిని పట్టుకుపోయి బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరారు. ఆ మరుసటి రోజే కేడీపేట పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. విలువైన ఆయుధాలను అపహరించారు. ఈ రెండు ఘటనలతో అల్లూరి పేరు మార్మోగిపోయింది. స్వాతంత్రోద్యమంలో సాయుధ పోరాటానికి బీజం పడింది. బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు ప్రారంభమైంది. ప్రపంచ యుద్ధ వీరులైన బ్రిటిష్ సైనిక అధికారులను రంగంలోకి దింపింది. కానీ లాభం లేక పోయింది. ప్రపంచ యుద్ధాల్లో ఆరితేరిన స్కాట్కవర్ట్, హైపర్ అనే ఇద్దరు బ్రిటిష్ అధికారులను సైతం అల్లూరి మట్టుబెట్టారు. దీంతో అల్లూరి పరాక్రమం దేశస్థాయిలో తెలిసింది.

అల్లూరి విప్లవ సేన 1923 ఏప్రిల్ 15న అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది. దాడి అనంతరం అల్లూరి తో పాటు మిగతా విప్లవకారులు సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారంటే.. వారిలో ఉన్న తెగువ, ధైర్యం అర్థమవుతుంది. బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అల్లూరిని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కలెక్టర్ లూథర్ఫర్డ్ ను రంగంలోకి దించింది. అల్లూరిని బంధించి ఇచ్చిన వారికి పది వేలు నజరానా ప్రకటించారు. అల్లూరి విప్లవ సేన రాజవొమ్మంగి మండలం కొండపల్లి వద్ద ఉందని తెలుసుకొని బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టింది. దీంతో 1924 మే 1 నుంచి 6వ తేదీ వరకు బ్రిటిష్ సైన్యానికి, అల్లూరి విప్లవసేనకు బీకర యుద్ధం నడిచింది. వేలాది బ్రిటిష్ సైన్యాన్ని విప్లవసేన దీటుగా ఎదుర్కొంది. కానీ బ్రిటిష్ సైన్యం వద్ద ఉన్న ఆయుధ సంపత్తితో.. వారిదే పైచేయిగా నిలిచింది. మే 7న అల్లూరు ని బ్రిటిష్ సైన్యం బంధించగలిగింది. చెట్టుకు కట్టి అల్లూరిని కాల్చి చంపారు. అక్కడికి ఐదు రోజుల తర్వాత అల్లూరి మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. చనిపోయే నాటికి అల్లూరి వయసు 27 సంవత్సరాలు మాత్రమే. అత్యంత చిరుప్రాయంలోనే అల్లూరి దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టారు. స్వల్ప కాలమే పోరాటమే చేసినా.. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో అల్లూరి పాత్ర మరువరానిదిగా నిలిచింది. ఆ సేతు హిమాచలం వరకు వర్ధిల్లింది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడిని మరోసారి స్మరించుకుందాం.