Chandrababu Pawan : ఏపీలో ఇప్పుడు సంకుల సమరం నడుస్తోంది. అధికార వైసీపీ పట్టాపగ్గాల్లేకుండా పాలిస్తోంది. ‘భయం’ అంటూ లేకుండా అందరినీ భయపెడుతోంది. కానీ ఆ భయాన్ని తిరిగి ఇచ్చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. విశాఖలో తనను నిర్బంధించిన దానికి గట్టిగా ఎదురు తిరిగారు. మంగళగిరి నుంచి హెచ్చరికలు పంపారు. పవన్ కళ్యాణ్ ఒంటరి కాదని బీజేపీ, టీడీపీ మద్దతునిచ్చాయి. ఈ మూడు పార్టీల కలయిక ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.
అధికార వైసీపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడించడం ఒక్క టీడీపీ వల్ల.. ఒక్క జనసేన వల్ల కాదు. అయితే ఈ రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా జగన్ చిత్తు అవుతాడు. వైసీపీ ఓటమి ఖాయం. అందుకే తమ పంతాలను పక్కనపెట్టి మరీ చంద్రబాబు కదిలివచ్చాడు. బాధతో విలవిలలాడుతున్న పవన్ కళ్యాణ్ ను కలిసి నైతిక మద్దతు తెలిపారు. చంద్రబాబు,పవన్ ల కలయిక ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. అధికార వైసీపీని ఉలికిపాటుకు గురిచేసింది.
ఏ ఇద్దరు అయితే కలవకూడదని జగన్ భావించారో ఆ ఇద్దరూ (చంద్రబాబు, పవన్ ) కలిశారు. దీంతో ఇది వైసీపీకి మూడినట్టేనని మెజార్టీ ప్రజలు, విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఇప్పుడు వీరికే పడుతుంది. జనసేనకు తోడుగా బీజేపీ కూడా ఉండడంతో ప్రధాన ఈ మూడు పార్టీలు కలిసి సాగితే ఏపీలో వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరు.
అధికారంలో ఉన్నాం కదా? అని జగన్ రెచ్చిపోవడమే ఈ దుస్థితికి కారణంగా చెప్పొచ్చు. ప్రతిపక్ష చంద్రబాబును మీడియా ముందు ఏడిపించాడు. ప్రతిపక్ష నేతలను కనీసం గ్రామాల్లో పర్యటించకుండా దాడులు, కేసులతో బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పుడు జనవాణి కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను అడ్డుకొని తన గొయ్యిని తానే జగన్ తవ్వుకున్నట్టైంది.

పవన్ ఒక బంతి లాంటివాడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు. అలాంటి పవన్ తో పెట్టుకొని ఇప్పుడు జగన్ తప్పు చేశాడని చెప్పొచ్చు. ఏదైతే ఏపీలో జరగాలని టీడీపీ, దాని అనుకూల మీడియా, జనసైనికులు కోరుకున్నారో అదే జరిగింది. చంద్రబాబు, పవన్ లు ప్రత్యర్థి జగన్ అరాచకాలను ఎదిరించేందుకు కలిశారు. పవన్ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు వేసిన ఈ అడుగులు ఖచ్చితంగా ఏపీ రాజకీయాలను షేక్ చేసేవే. భవిష్యత్తులో ఏపీలో జనసేన+టీడీపీ పొత్తుకు నాందిపలికేవే. ఈ రెండూ పార్టీలు కలిస్తే జగన్ కొట్టుకుపోవడం గ్యారెంటీ.
ఇప్పటికే బోలెడంత వ్యతిరేకత.. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు, కృష్ణ వరకూ టీడీపీ హవా.. సీమ, ప్రకాశం, నెల్లూరులో మాత్రమే వైసీపీకి కొంత బలం ఉండొచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా వైసీపీ కోరి మరీ కొనితెచ్చుకున్న కష్టాలే. అందుకే చంద్రబాబు, పవన్ ల కలయిక జగన్ పుట్టిముంచేలా కనిపిస్తోంది. వైసీపీ ఓటమికి బాటలు వేస్తోంది.