Homeక్రీడలుIPL 2023 Playoffs Chances: ఐపీఎల్‌లో హాఫ్‌ సీజన్‌ పూర్తి.. ఆ టీంలకే ప్లేఆఫ్‌ చాన్స్‌.....

IPL 2023 Playoffs Chances: ఐపీఎల్‌లో హాఫ్‌ సీజన్‌ పూర్తి.. ఆ టీంలకే ప్లేఆఫ్‌ చాన్స్‌.. ఢిల్లీ, హైదరాబాద్‌ పరిస్థితి ఏంటో!?

IPL 2023 Playoffs Chances: ఐపీఎల్‌ సీజన్‌–16 మ్యాచ్‌లన్నీ ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. క్రికెట్‌ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. బౌలర్‌ వేసే ప్రతీ బంతిని, బ్యాట్స్‌మెన్‌ కొట్టే ప్రతీ పరుగును క్రికెట్‌ లవర్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అప్పుడే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రతీ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడేసింది. పది జట్లలో రెండు టీంలు పది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. మరో నాలుగు జట్లు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ ఆరు జట్లతోపాటు ముంబై ఇండియన్స్‌ టీం కూడా ఫ్లే ఆఫ్‌ చేరేందుకు పోటీ పడుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టీంలు ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ గెలవాలి. లీగ్‌ దశ చివరకు వచ్చే సరికి నెట్‌ రన్‌రేట్‌ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఫ్రాంచైజీలు మెరుగైన రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టాయి.

ప్లే ఆఫ్‌పై అందరి దృష్టి..
ఐపీఎల్‌ 16వ సీజన్‌ టోర్నీలో లీగ్‌ మ్యాచ్‌లు ఇప్పటికే సగం పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆఫ్‌ చేరే జట్లపై పడింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు, తమ అంచనాలకు అనుగుణంగా ఏయే జట్లు ప్లే ఆఫ్‌ వెళ్తాయో క్రీడా అభిమానులు అంచనాలు వేస్తున్నారు. చెన్నై, గుజరాత్‌ జట్లు పది పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, లక్నో, బెంగళూరు, పంజాబ్‌ జట్లు.. 8 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నాలుగు జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌ రన్‌రేట్‌లో తేడా ఉంది. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల పరిస్థితి మెరుగవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఆయా జట్లకు ఉన్న అవకాశాలు తెలుసుకుందాం.

చెన్నై సూపర్‌ కింగ్స్‌..
నాలుగు సార్లు చాంపియన్‌ అయిన చెన్నై పూపర్‌ కింగ్స్‌ జట్టు ఈ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌తో అదరగొడుతోంది. ఓటమితో ఈ సీజన్‌ను ప్రారంభించిన సీఎస్‌కే.. విజయాల పరంపరతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఆటగాళ్లందరూ రాణిస్తుండటం జట్టుకు కలిసి వస్తోంది. ఈ సీజన్‌లో 7 మ్యాచులు ఆడిన ధోనీ సేన ఐదింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇదే ఫామ్‌ కొనసాగిస్తే నంబర్‌ వన్‌ స్థానంలో లీగ్‌ దశను ముగించే అవకాశం ఉంది. మరో 4–5 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. చెన్నై ప్లేఆఫ్స్‌కి చేరడం ఖాయం.

గుజరాత్‌ టైటాన్స్‌..
ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాది విజేతగా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ సీజన్‌ 16లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగింది. అంచనాలకు తగినట్లుగానే ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో హేమాహేమీ జట్లకు సైతం ఓటమి రుచి చూపిస్తోంది. భారీ స్కోర్లు చేయడం, తక్కువ స్కోర్లను కాపాడుకోవడం ఈ జట్టుకు అలవాటుగా మారింది. చెన్నైతో సమానంగా 5 మ్యాచులలో గెలిచిన హార్ధిక్‌ సేన.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడున్న ఫామ్‌ను చూస్తే వరుసగా రెండో ఏడాది గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజస్థాన్‌ రాయల్స్‌..
ఐపీఎల్‌ లీగ్‌ దశలో కొన్నేళ్లుగా నిలకడగా ప్రదర్శన చేస్తున్న జట్టు రాజస్థాన్‌. గతేడాది రన్నరప్‌గా నిలిచిన సంజూ శాంసన్‌ టీం.. ఈ ఏడాది అదే ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో తొలుత ఆడిన 5 మ్యాచుల్లో 4 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. అయితే.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది ఆడిన 7 మ్యాచులలో నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. బ్యాట్స్‌మెన్స్‌ జోరు పెంచి.. బౌలర్లు నిలకడగా రాణిస్తే ఈ జట్టు ప్లే ఆఫ్‌ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌..
ఆల్‌రౌండర్లతో నిండిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు.. లీగ్‌లో తొలి అర్ధభాగం పూర్తయ్యే సరికి నాలుగో స్థానంలో నిలిచింది. అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుంటే ఈ టీం.. పాయింట్ల పట్టికలో ఇంకా మెరుగైన స్థితిలో ఉండేది. గుజరాత్‌ టైటాన్స్‌తో పోరులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. సీజన్‌లో 7 మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సామర్థ్యం మేరకు రాణిస్తే.. లక్నో జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..
ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ఆర్సీబీ.. ఈ ఏడాది అదే ఆటతీరు కనబరుస్తోంది. స్టార్‌ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. తొలి మ్యాచ్‌ గెలిచి రెండో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలైన బెంగళూరు.. తిరిగి బలం పుంజుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. లీగ్‌లో తొలి అర్ధభాగానికి గాయంతో అందుబాటులో లేకుండా పోయిన ఆ జట్టు స్టార్‌ బౌలర్‌.. జోష్‌ హేజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం జట్టుకు బలం. మహ్మద్‌ సిరాజ్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. నెట్‌ రన్‌రేట్‌ పెంచుకుంటే ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు వెళ్లొచ్చు.

పంజాబ్‌ కింగ్స్‌..
సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఘనంగా ఆరంభించిన పంజాబ్‌ కింగ్స్‌.. తర్వాత ఆశించిన మేర రాణించలేకపోయింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ధావన్‌ గాయంతో దూరమవడం జట్టుకు ఇబ్బందిగా మారింది. అయితే స్టార్‌ ఆటగాడు లివింగ్‌ స్టోన్‌ అందుబాటులోకి రావడంతో జట్టు బలంగా మారింది. సీజన్‌లో 7 మ్యాచుల్లో 4 గెలిచిన పంజాబ్‌ కింగ్స్, 8 పాయింట్లతో టేబుల్‌లో 6వ స్థానంలో ఉంది. సమష్టిగా రాణిస్తూ.. నెట్‌ రన్‌రేట్‌ మెరుగుపర్చుకుంటే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మెరుగవుతాయి.

ముంబయి ఇండియన్స్‌..
నాలుగు సార్లు చాంపియన్‌ అయిన ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. బ్యాటింగ్‌ వైఫల్యం, డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం రోహిత్‌ టీంకు ఇబ్బందిగా మారింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి.. తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించి రేసులోకి వచ్చింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడి విజయాలకన్నా.. ఓటములే ఎక్కువగా ఖాతాలో వేసుకుని తొలి అర్ధ భాగాన్ని ముగించింది. ప్రస్తుతం టేబుల్‌లో 7వ ప్లేస్‌లో ఉంది. ఓడినా పుంజుకుని సత్తాచాటే జట్లలో ఒకటిగా పేరున్న ముంబయి.. ఈసారి నాకౌట్‌ చేరాలంటే అదే పునరావృతం చేయాల్సిందే.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌..
కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయంతో లీగ్‌కు దూరమవడంతో కొత్త కెప్టెన్‌ నితీశ్‌ రానా సారథ్యంలో కేకేఆర్‌ బరిలోకి దిగింది. తొలి మూడు మ్యాచుల్లో 2 విజయాలు సాధించిన జట్టు బలంగా కనిపించింది. అయితే.. వరుసగా 4 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది. కీలక సమయాల్లో చేతులెత్తేయడం జట్టు విజయాలపై ప్రభావం చూపుతోంది. బ్యాటింగ్‌ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచిన కేకేఆర్‌.. ఇకనుంచి ప్రతీ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ ప్రస్తుత 8వ స్థానంలో ఉంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..
పేపర్‌పై బలంగా కనిపిస్తున్న హైదరాబాద్‌ జట్టు.. మైదానంలో మాత్రం ఆశించిన మేరకు రాణించడం లేదు. కొత్త కెప్టెన్‌ మార్‌క్రమ్‌ నేతృత్వంలో జట్టు పాత ఫామ్‌నే కొనసాగిస్తోంది. రెండు ఓటములు, రెండు విజయాలతో సీజన్‌ ప్రారంభించిన హైదరాబాద్‌.. హ్యాట్రిక్‌ ఓటములతో వెనకబడి పోయింది. అన్ని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతుంటే హైదరాబాద్‌ మాత్రమే సమష్టిగా రాణించలేక చతికిలపడుతోంది. ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ఒక్క మ్యాచ్‌లోనే సత్తా చాటగలిగాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 2 విజయాలతో టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. మరో రెండు పరాజయాలు చవిచూస్తే మాత్రం ప్లే ఆఫ్‌ ఆశలు వదులు కోవాల్సిందే.

ఢిల్లీ క్యాపిటల్స్‌..
రోడ్డు ప్రమాదం కారణంగా కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ దూరమవడంతో డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా శ్రమించింది. తొలి 5 మ్యాచుల్లోనూ వరుసగా ఓటమిపాలైన జట్టు.. 6వ మ్యాచ్‌తో పాయింట్ల ఖాతాను తెరిచింది. బ్యాటర్ల వైఫల్యం జట్టు ఆటతీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే.. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన డీసీ.. అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు.. దాదాపు అన్ని మ్యూచుల్లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్‌కు చాన్స్‌ ఉంటుంది. ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ ఢిల్లీ జట్టుకు డూ ఆర్‌ డై లాంటిందే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version