
AP Politics : ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే జంపింగ్ జపాంగులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు చేరికల సంఖ్య ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం కాస్తా ముందుగానే ఈ పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి నలుగురు నేతలు బహిష్కరణకు గురయ్యారు. అందులో ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయమైంది. మరో ఇద్దరు పొలిటికల్ రోడ్డుపై నిలబడ్డారు. ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమైంది. అయితే అధికార పార్టీ నుంచి చేరికలకు వారు మార్గం చూపించారు. మున్ముందు అధికార పార్టీ నుంచి టీడీపీ, జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాడు అన్నివర్గాలు క్యూ…
గత ఎన్నికలకు ముందు వర్గాలతో సంబంధం లేకుండా అందరు నాయకులు వైసీపీకి క్యూకట్టారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ నేతలు ఆ పార్టీలో చేరిపోయారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చేరికలను వైసీపీ హైకమాండ్ ప్రోత్సహించింది. అటు ఎన్నికల అనంతరం టీడీపీని మరింత దెబ్బకొట్టేందుకు చిన్నాచితకా నాయకులను సైతం ఆ పార్టీలో చేర్చుకోంది. గ్రామంలో మూడు వర్గాలు ఉంటే.. రాజకీయ అవసరాల కోసం మూడు వర్గాల నాయకులు చేరిపోయారు. ఇప్పుడు వారు యూటర్న్ తీసుకుంటున్నారు. తిరిగి మాతృ పార్టీల్లో చేరేందుకు సిద్ధపడిపోతున్నారు. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులు అదును కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు యూటర్న్…
అయితే ఎన్నికల సమయంలో అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీల్లోనే ఎక్కువ మంది చేరుతారు. అప్పటి వరకూ రాజకీయ అవసరాల కోసం చాలా మంది అధికార పార్టీలో ఉంటారు. అంటీముట్టనట్టుగా ఉంటూ వస్తారు. గత నాలుగేళ్లుగా వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు అసంతృప్తిగానే గడిపారు.వారంతా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా టీడీపీ, జనసేనలోనే చేరికలు అధికంగా ఉండే చాన్స్ ఉంది. ఆ రెండు పార్టీలు కూటమి కడతాయన్న ప్రచారం నేపథ్యంలో వాటిలో చేరేందుకు ఇప్పటికే చాలా మంది సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరువాత ఈ చేరికల టాక్ , ఊహాగానాలు అధికమయ్యాయి.
అధికార పక్షంతో మైండ్ గేమ్..
పార్టీలో చేరికల విషయంలో ఇప్పటికే టీడీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. అధికార పార్టీకి ధీటుగా సవాల్ విసురుతోంది. తమకు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. అయితే పార్టీలో చేరికల విషయంలో నవంబరు నెల క్రియాశీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది. ఇప్పటికే లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతోంది. అటు పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. నవంబరు కు ఎన్నికలకు ఆరు నెలల గడువు ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కానీ చేరికలకు గేట్లు తెరిస్తే.. అధికార పార్టీకి దెబ్బపడడం ఖాయమని టీడీపీ, జనసేనలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో నవంబరు వస్తే వల‘సలసల’ ప్రారంభమవుతుందన్న మాట.