
KCR – ABN RK : పొద్దున్నే పేపర్ తిరగేస్తుంటే.. ఆంధ్రజ్యోతి లో మాస్టర్ హెడ్ కింద బ్యానర్ ఐటమ్ కనిపించింది. ఎప్పటిలాగే వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు రాసుకొచ్చాడు. ఈసారి మరింత మసాలా యాడ్ చేశాడు. అప్పట్లో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తాపత్రికల్లో ఇలాంటి పొలిటికల్ కాలమ్స్ కనిపించేవి. తెలుగు నాట నండూరి రామ్మోహన్ రావు, గజ్జల మల్లారెడ్డి వంటి వారు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ అవి చాలా కాలం వరకు మన లేకపోయాయి. పైగా ఆంధ్రజ్యోతి అనేది వేమూరి రాధాకృష్ణ సొంత పత్రిక కాబట్టి, ఆయనకు పొలిటికల్ సర్కిల్లో విపరీతమైన స్పేస్ ఉంది కాబట్టి, గతంలో ఆయన పచ్చ పార్టీ బీట్ చూశాడు కాబట్టి.. రాజకీయ వార్తలు ఎక్కువ రాస్తుంటాడు. తనకుండే సమాచారం తనకు ఉంటుంది.. కొన్నిసార్లు ఇది భూమారాంగ్ అవుతూ ఉంటుంది.
ఇక ఇవాళ ఏం రాసాడయ్యా అంటే.. తెలంగాణను దోచుకుని కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అనుకుంటున్నాడు. వేల కోట్లు సంపాదించి దేశంలోని ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేద్దామనుకుంటున్నాడు. మొన్న ఇండియా టుడే సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ ఇవే మాటలను చెప్పాడు.. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నరేంద్ర మోదీ కూడా దీనిపై ఆరా తీశారు అని ఆంధ్రజ్యోతి లో వచ్చింది.. సరే ఇందులో కొన్ని విషయాలు మాట్లాడుకుంటే.. రాధా కృష్ణ చెప్పిన దాంట్లో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ..రాసిన విధానం మాత్రం నమ్మబుల్ గా అనిపించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కేసీఆర్ 400 కోట్లు ఇచ్చాడని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అంతే కాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి కోట్ల దాకా కుమారస్వామికి ఫైనాన్స్ చేస్తానని హామీ ఇచ్చాడని బాంబు పేల్చాడు. తెలంగాణలో పథకాల్లో అపరిమితమైన అవినీతి జరుగుతోందని, వాటి ద్వారా వచ్చిన డబ్బునే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు పెట్టుబడిగా పెడుతున్నాడని రాధాకృష్ణ ఆరోపించాడు.
కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే తెలుగునాట చాలా వరకు మీడియా గులాబీ రంగు పూసుకుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్త రాయడమే మహా పాపంగా భావిస్తోంది. నమస్తే తెలంగాణ ఎలాగూ భజన చేస్తుంది. సాక్షి అది నమస్తే తెలంగాణ పార్ట్ 2, ఇక ఈనాడు అయితే దాని ఆస్తిత్వాన్ని కోల్పోయి, కెసిఆర్ ముందు సాగిలపడుతోంది.. అఫ్కోర్స్ ఇక్కడ జ్యోతి కూడా ఒకప్పుడు సాగిల పడిందే.. కానీ ఈమధ్య ఎందుకో తన టెంపర్ మెంట్ చూపిస్తోంది. అయితే రాధాకృష్ణ కేసీఆర్ మీద తగ్గేదే లే అనుకుంటూ వార్తలు రాస్తున్నాడు.. కొన్ని కొన్ని విషయాలు ఓపెన్ గానే బయటపడుతున్నాడు..
ఒక మిత్రుడి రహస్యం మరో మిత్రుడికి తెలిసినట్టు.. ఇప్పుడు కెసిఆర్ కు సంబంధించిన విషయాలు మొత్తం ఆర్కే బయట పెడుతున్నాడు. ఆమధ్య ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఏ విధంగా కేసీఆర్ తిట్టింది.. కవిత సమక్షంలోనే ఆర్కే చెప్పేశాడు. దీనికి కవిత మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక కెసిఆర్ 400 కోట్ల రూపాయలను కుమార్ స్వామికి ఏ విధంగా ఇచ్చింది కూడా ఇవాళ చెప్పేశాడు. ఇప్పటినుంచి తెలంగాణ రాజకీయాల్లో ఇది విస్తృతమైన చర్చలో ఉంది. అంతేకాదు సుఖేష్ చంద్రశేఖర్ ద్వారా డబ్బులు తీసుకున్న ఎమ్మెల్సీ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఎన్ని దఫాలుగా డబ్బులు పంపించాడు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత? ఇలా తన కొత్త పలుకులో ఈరోజు దర్జాగా రాసుకుంటూ పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే కెసిఆర్ ను తూర్పారపట్టాడు. ఆర్కే రాసిన కొత్త పలుకు చూసేందుకు మాంచి మసాలా ఐటెం లాగా ఉంది.. స్థూలంగా దీని ద్వారా ఆర్కే తేల్చింది ఏంటయ్యా అంటే.. కెసిఆర్ తెలంగాణను దోచుకుంటున్నాడు అని.. మరి దీనిపై రేపు నమస్తే తెలంగాణలో ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.