Homeజాతీయ వార్తలుTelangana Revenge Politics: పాలన మరిచి.. ప్రతీకారంపై దృష్టి.. తెలంగాణలో ఏం జరుగబోతోంది!!

Telangana Revenge Politics: పాలన మరిచి.. ప్రతీకారంపై దృష్టి.. తెలంగాణలో ఏం జరుగబోతోంది!!

Telangana Revenge Politics: తెలంగాణ… ఉద్యమాల గడ్డ.. పోరాటటాల ఖిల్లా.. ప్రేమిస్తే అక్కున చేర్చుకుంటారు ఇక్కడి జనం.. ద్వేషిస్తే తరిమి కొడతారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. స్థానికులతో మమేకమై జీవనం సాగిస్తారు. ప్రేమ, ఆప్యాయతలకు కొదువలేని రాష్ట్రం ప్రస్తుతం ప్రతీకార రాజకీయంతో రగిలిపోతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణపై విరుచుకు పడుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాత్రం.. అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా ప్రశ్నించేందుకు మీరెవరు అన్నట్లుగా ప్రతీకార దాడి మొదలు పెట్టింది. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పింది.

Telangana Revenge Politics
KCR, MODI

అటు ఈడీ, ఐటీ.. ఇటు సిట్‌..
కేంద్రం ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దర్యాప్తులో తెలంగాణ లింకులు బయటపడడంతో దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముద్దుల కూతురు ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆరోపణలకు బలం చేకూరేలా.. దర్యాప్తులో కవిత అనుచరులు, కవితతో వ్యాపార సంబంధాలు ఉన్నవారు వెలుగులోకి వచ్చారు. అరెస్టులు కూడా జరిగాయి. నెక్ట్స్‌ టార్గెట కవితే అని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

కూతురును కాపాడుకునేందుకు..
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కవితను చుట్టుముట్టే అవకాశం ఉండడంతో కేసీఆర్‌ తన కూతురును కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈమేరకు ములాయన్‌ సింగ్‌ చనిపోయినప్పుడు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్‌ తన కూతురును కూడా వెంట తీసుకెళ్లారు. అటునుంచి అటే ఢిల్లీ వెళ్లి.. కేంద్రంతో సంబంధాలు ఉన్నవారితో లాబీయింగ్‌ చేయించారు. ఇందుకోసం పది రోజులు అక్కడే ఉన్నారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా హైదరాబాద్‌కు వచ్చారు.

ప్రతీకారానికి అక్కడే బీజం…
లిక్కర్‌ స్కాం నుంచి తన కూతురును తప్పించేందుకు అంగీకరించని ఢిల్లీ పెద్దలనే దెబ్బకొట్టాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నాని తెలిసింది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లు మునుగోడు ఎన్నికల వేళ బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్‌ సంభాషణ విన్న కేసీఆర్‌కు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయిందని సమాచారం. పైలట్‌ రోహిత్‌రెడ్డితో మాట్లాడేందుకు వచ్చిన ముగ్గురిని పక్కా ప్లాన్‌ ప్రకారం పట్టించి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సిట్‌ పేరుతో దూకుడు..
ఎమ్మెల్యేలకు ఎర వేయాలని చూశారని దీనిపై దర్యాప్తు జరుపాలని కేసీఆర్‌ సిట్‌ వేశారు. దీని ద్వారా తన స్క్రిప్టెడ్‌ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాను కావాలనుకున్నట్లుగా బీజేపీ పెద్దలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికే నోటీసులు ఇప్పించారు. మీడియాకు బీజేపీకి వ్యతిరేకంగా లీకులు ఇస్తూ వస్తున్నారు. మరోవైపు తెలంగాణలో దాదాపు రెండు నెలలుగా పాలన స్తంభించింది. పాలనాపరమైన నిర్ణయాలేవీ జరుగడం లేదు. కేవలం కేంద్రాన్ని ఎలా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే కేసీఆర్‌ పాలనను గాలికి వదిలేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈడీ, ఐటీకి పనిచెప్పిన కేంద్రం..
కేసీఆర్‌ దూకుడు, జాతీయ స్థాయిలో బీజేపీని డ్యామేజ్‌ చేయడానికి యత్నిస్తున్న కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఈడీ, ఐటీని రంగంలోకి దించింది. లిక్కర్‌ స్కాం దర్యాప్తును వేగవంతం చేసింది. నేడో రేపో కేసీఆర్‌ కూతురుకు నోటీసులు వస్తాయని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐటీ ద్వారా ఆర్థికంగా బలవంతులైన మంత్రులపై దాడులు చేయిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గంగుల కమలాకర్‌ ఇల్లు, వ్యాపార సంస్థలపై దాడి చేయించింది. తాజాగా మంంత్రి మల్లారెడ్డి ఇళ్లు, వ్యాపారాలు, కళాశాలల్లో ఐటీ తనిఖీలు చేయిస్తోంది.

Telangana Revenge Politics
MODI, KCR

బెంగాల్‌ తరహా అల్లర్లకు ప్లాన్‌..?
రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో బీజేపీ, అక్కడి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఒక యుద్ధమే జరిగింది. తృణమూల్‌ను చీల్చేందుకు బీజేపీ యత్నించగా, అధికారం ఉందనని తృణమూల్‌ దాడులు చేయించింది. అల్లర్లు సృష్టించింది. మతకలహాలు రేపింది. తాజాగా తెలంగాణకు మరో పది నెలలే సమయం ఉంది. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది అధికార టీఆర్‌ఎస్‌కు నచ్చడం లేదు. దీంతో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్‌ కిశోర్‌ సూచనల మేరకు తెలంగాణలో కూడా అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బెంగాల్‌ తరహా రాజకీయాలకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని పేర్కొంటున్నారు. దర్యాప్తు సంస్థలతో ప్రతీకార రాజకీయాలు చేసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే.. ఇటు కవిత అరెస్టు జరిగినా.. అటు బీఎల్‌.సంతోష్‌ అరెస్టు జరిగినా అల్లర్లు జరగడం ఖాయమని పరిస్థితిని గమనిస్తున్న విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version