Homeఆంధ్రప్రదేశ్‌1993 Bus Accident: 1993 బస్సు దహనం కేసు..23 మంది మృతి: ‘అభిలాష’ సినిమాలాగా...

1993 Bus Accident: 1993 బస్సు దహనం కేసు..23 మంది మృతి: ‘అభిలాష’ సినిమాలాగా ఉరిశిక్ష వాయిదా..: అసలేం జరిగింది..?

1993 Bus Accident:  28 సంవత్సరాల కిందట జరిగిన ఘోరం అది.. ఆ బస్సులో ప్రయాణిస్తున్నవారంతా కాసేపటికి గమ్యం చేరుతారన్న భావనతో ఉన్నారు. ఆ ప్రయాణికుల్లోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి లేచి తోటి ప్రయాణికులను బెదిరించడం ప్రారంభించారు. ‘మీ వద్ద ఉన్న నగలు, డబ్బు వెంటనే ఇవ్వండి.. లేకపోతే బస్సును తగలబెట్టేస్తాం’ అని బెదిరించారు. దీంతో వారంతా తమ దగ్గరున్న సొమ్మంతా వారికి ఇచ్చేశారు. అయితే డబ్బు, నగలు  ఇచ్చినా వారి ప్రాణాలు దక్కలేదు. ఆ కిరాతకుల మనసు కరగలేదు. ఇంతలో బస్సులో పెట్రోల్ వాసన వచ్చింది. బెదిరించిన వారిలో ఒకరు దూకేముందు బస్సుపై అగ్గిపుల్ల వేశాడు. దీంతో బస్సు తగలబడిపోయింది…!

1993 Bus Accident
bus accident

ఈ దుర్ఘటనలో 23 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఇద్దరు వ్యక్తులపై నేరారోపణ రుజువు కావడంతో వారికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆ తరువాత పలు కారణాల వల్ల ఇది జీవితకాల శిక్షగా మారింది. అయితే వారిలో ఒకరి భార్య తన భర్త ఉద్దేశపూర్వకంగా నేరం చేయలేదని మిగిలిన జీవితాన్ని గడిపేందుకు భర్తను విడిచిపెట్టాలని ఈ ఏడాది సెప్టెంబర్లో ఏపీ రాష్ట్రముఖ్యమంత్రి, గవర్నర్ ను కోరింది. దీంతో అసలు 28 సంవత్సరాల కిందట అంటే 1993లో ఏం జరిగింది..? వీరికి ఉరిశిక్ష నుంచి జీవితకాల శిక్షగా మారడానికి జరిగిన పరిణామాలేంటి..? అంతా సినిమా ట్రిక్ గా జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం..

కోర్టు ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం.. 1993 మార్చి 7న రాత్రి చిలుకలూరిపేట ఎక్స్ ప్రెస్ బస్సు హైదరాబాద్ కు బయలుదేరింది. మార్చి 8న నర్సారావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతి, విజయవర్దన్ అనే వ్యక్తులు బస్సు ఎక్కారు. మొత్తం ఆ బస్సులో డ్రైవర్, కండక్టర్ తో సహా 32 మంది ప్రయాణిస్తున్నారు. అయితే చలపతి, విజయవర్దన్ లు కొంచెం దూరం బస్సు వెళ్లగానే తోటి ప్రయాణికులను డబ్బు, నగలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే బస్సును తగలబెట్టేస్తామన్నారు. దీంతో ప్రయాణికులంతా తమ వద్ద ఉన్న సొమ్మంతా ఇచ్చారు. అయితే అప్పటికే పెట్రోల్ వాసన వచ్చిందని, వారు ముందే పెట్రోల్ పోసి ప్రయాణికులను బెదరించారని ప్రాసిక్యూషన్ తెలిపింది. బెదిరించిన వారిలో విజయవర్దన్ బస్సుపై అగ్గిపుల్ల పడేసి దూకారని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు మార్చి 18న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 1995 జూన్ 12 నుంచి గుంటూరు సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభించారు. సెప్టెంబర్ 7న నేరం రుజువు కావడంతో చలపతి, విజయవర్దన్ లకు ఉరిశిక్ష విధించారు. ఈ కేసు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్ 2న ఉరిశిక్షను ధ్రువీకరించింది.

అయితే మేం దోపిడీకి మాత్రమే ప్రయత్నించామని బస్సు దహనం సంఘటనలో మాకేం సంబంధం లేదని నిందితులు వాదించారు. బస్సును తగలబెట్టడం వీరి ఉద్దేశమైతే పారిపోతున్న ప్రయాణికులను వీరు అడ్డుకోలేదని నిందితుల తరుపున న్యాయవాది వాదించారు. దీంతో వారు సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అయితే ఇరు వాదనలు విన్న సుప్రీం కోర్టు సైతం ఉరిశిక్షకే మొగ్గు చూపింది. అయితే చివరి అవకాశంగా వీరికి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతికి అభ్యర్థన పెట్టుకున్నారు. అయినా అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ 1997 మార్చి 14న తిరస్కరించారు.

Also Read: వరద ప్రాంతాలకు జగన్ అందుకే పోలేదట?

నిందితులకు శిక్ష తగ్గించాలని మానవ హక్కుల సంస్థ అమ్మెస్టీ ఇంటర్నేషనల్ సంతకాలు సేకరించింది. సమాజాన్ని నేరరహితంగా తీర్చి దిద్దడమే కోర్టుల లక్ష్యమని, దీనికి ఉరిశిక్షే పరిష్కారం కాదని ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇక కేజి సత్యమూర్తి, బాల గోపాల్, బి. చంద్రశేఖర్ లాంటి వాళ్లు ఉరిశిక్షను రద్దు చేయాలని పోరాటాలు చేశారు. అంతేకాకుండా వీరంతా ‘చలపతి విజయవర్దనం’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. అయితే మార్చి 29న ఉరిశిక్ష తేదీ ఖరారు కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏర్పాట్లు చేశారు. కానీ మార్చి 28న రాష్ట్ర పతిని కలిసేందుకు ప్రముఖ రచయిత్రి శ్వేతాదేవి తదితరులు వెళ్లి అభ్యర్థించారు.

రాష్ట్రపతి నిర్ణయం వెలువడేదాకా ఉరిశిక్ష అమలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సమయంలో వారి ఉరిశిక్ష వాయిదా పడింది. ఇదే సమయంలో దేవేగౌడ్ ప్రధానమంత్రిగా వైదొలగడతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఈ కేసు మూడు నెలల వాయిదా పడింది. ఈ లోగా మరికొందరు రాష్ట్రపతిని కలుస్తూ ఉండడంతో చివరకు జీవితకాల శిక్షకు మార్చారు. ప్రస్తుతం చలపతిరావు, విజయవర్దన్ నెల్లూరు జైలులో ఉన్నారు. వీరి శిక్ష 28 ఏళ్లు పూర్తయింది. మిగిలిన జీవితాన్ని కుటుంబాలతో గడిపేందుకు అవకాశం ఇవ్వాలని చలపతిరావు భార్య ఇటీవల ముఖ్యమంత్రి, గవర్నర్ కు లేఖ రాసింది.

Also Read: బస్, రైలు, కారు ప్రయాణాల్లో తెలియకుండానే ఎందుకు నిద్రపోతామో తెలుసా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version