
Preliminary Elections : రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ.. కొద్దిరోజుల్లోనే ఎన్నికలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత టిడిపి జోరు పెంచగా.. వైసీపీ అంతర్మధనం చెందుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకు అడుగులు వేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత టిడిపి ఇక విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటు కేబినెట్ విస్తరణ.. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలోనే పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు ఎమ్మెల్యేలకు తాజా పరిణామాలు నేపథ్యంలో సీఎం జగన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కీలక సమావేశానికి జగన్ సిద్ధం..
2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుమార్లు గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ ను సీఎం జగన్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉన్న గుర్తింపు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటయింపుపైన సంకేతాలు ఇస్తూ వచ్చారు. కొందరు ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావడం.. వారితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆ నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది. అనూహ్యంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి విజయం సాధించింది. ఈ సమయంలో పార్టీ నేతలతో సీఎం జగన్ ఎన్నికలు దిశగా కీలక నిర్ణయాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.

పార్టీ నేతల్లో జోష్ నింపేలా భవిష్యత్ కార్యాచరణ..
ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్.. పట్టభద్రుల నియోజకవర్గం టిడిపి గెలుపు తర్వాత పార్టీలో నైరాశ్యం అలుముకుంది. ఈ నైరాశ్యాన్ని తొలగించేలా ఈ సమావేశంలో నాయకులు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ నేతల్లో జోష్ నింపుతూ.. టిడిపి గెలుపు ఎలా సాధ్యమైంది, దీని ద్వారా వైసిపి పై ఎలాంటి ప్రభావం ఉంటుందని అంశాన్ని సీఎం వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 22 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనలు చేశారు. ఆయా నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పార్టీలో టికెట్లు ఎవరైనా కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావడంతో.. చెట్ల విషయంలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో గెలుపే ప్రామాణికంగా సీట్ల కేటాయింపు ఉంటుందనే అంశం మరోసారి ఆయన స్పష్టం చేస్తారని, పార్టీని నమ్ముకున్న వారికి సీట్లు రాకుండా వారి సేవలను మరో విధంగా ఉపయోగించుకుంటామని సీఎం జగన్ చెబుతారని తెలుస్తోంది.

ఆ ప్రచారంపైనా స్పష్టత ఇచ్చే అవకాశం..
ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం జోరుగా కొద్ది రోజుల నుంచి సాగుతోంది. ఈ సమావేశంలో దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసారం సాగుతున్నట్లుగా ప్రక్షాళన ఉంటుందా లేదా అనేది స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇక కొద్ది రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపైన ఈ సమావేశంలో స్పష్టత రానుంది. గతంలో ఇదే తరహా ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండించారు. దీనిపైన సీఎం జగన్ తేల్చి చెప్పే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపైనా ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ మంత్రులు, ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.
అత్యంత కీలకమైన భేటీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న తాజా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు ఇంచుమించుగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉండవచ్చు అనే ప్రచారం సాగుతోంది. వైసిపి తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే సాగుతున్న ప్రచారాలకు అనుగుణంగా ఈ భేటీ ఉంటుందా..? ఏమైనా కొత్త మార్పులు ఉంటాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.