
Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పార్టీ పెట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల. తెలంగాణలో కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టేశారని, అరాచక, కుటుంబ పాలన సాగిస్తున్నారని షర్మిల ఘాటుగా ఆరోపిస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3,500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ధూషించారు. కానీ, పార్టీకి ఆశించిన మేరకు ఫలితం కనిపించడం లేదు. పార్టీకి పెద్దగా క్రెడిట్, గుర్తింపు రావడం లేదు.. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల బీజేపీ వదిలిన బాణమని ఇప్పటికీ బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ బాణం గురి తప్పినట్లు కనిపిస్తోంది.

బండికి, రేవంత్‌కు ఫోన్..
కలిసి పోరాడుదాం రండి అంటూ వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ చేద్దామని చెప్పిన షర్మిల ప్రగతి భవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనివ్వడని షర్మిల అన్నారు. షర్మిల ఫోన్‌కాల్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ బదులిచ్చారు.
పేపర్ లీక్‌పై సీరియస్..
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశాన్ని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీరియస్‌గా తీసుకున్నారు. లీకేజ్‌లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు షర్మిల పోరాటం చేశారు. రెండుసార్లు షర్మిల పోరాటాన్ని పోలీసులు అడ్డుకోగా.. నిన్న మూడో సారి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిరుద్యోగుల విషయంలో పోరాడాలని షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ నేత బండిసంజయ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఫోన్లు చేసి.. కలిసి పోరాడుదామంటూ షర్మిల పిలుపునిచ్చారు.
ఎవరు వస్తారో మరి..
షర్మిల ఫోన్‌కు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ సానుకూలంగా స్పందించినప్పటికీ కలిసి పోరాటం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ బాణమని ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ షర్మిలతో కలిసి పోరాటం చేస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక రేవంత్‌రెడ్డిని అయితే షర్మిల తీవ్ర పదజాలంతో దూషించారు. రాజశేఖరరెడ్డి పేరు ఎత్తొద్దని హెచ్చరించారు. రేవంత్ యాత్ర దొంగయాత్ర అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అన్నారు. ఇలా వ్యక్తిగత ధూషణలు చేసిన షర్మిల ఇప్పుడు కలిసి పోరాడుదామని ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. షర్మిలతో కలిసి రేవంత్ పోరాడతారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తు అంశం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌టీపీ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఆలోచన కార్యరూపం దాల్చేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.