Telangana Elections 2023: కీలక ఘట్టం ప్రారంభం.. తేలనున్న నేతల భవితవ్యం

119 స్థానాల్లో అధికార బీఆర్ఎస్, 118 స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా ఒకచోట సిపిఐ, 111 చోట్ల బీజేపీ, పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో జనసేన, 19 నియోజకవర్గాల్లో సిపిఎం, 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : November 30, 2023 8:24 am

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత… తొలిసారిగా హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రసవత్తరమైన పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు, 104 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు పోటీ చేస్తుండడం విశేషం. అతిరథ మహారధులు, కీలక నాయకులు, తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్న వారు తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

119 స్థానాల్లో అధికార బీఆర్ఎస్, 118 స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా ఒకచోట సిపిఐ, 111 చోట్ల బీజేపీ, పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో జనసేన, 19 నియోజకవర్గాల్లో సిపిఎం, 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడం విశేషం.ఎంపీలకు సంబంధించి రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. బిజెపి ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ లు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేస్తుండడం విశేషం.

ఎమ్మెల్సీలకు సంబంధించి టిఆర్ఎస్ తరఫున కౌశిక్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో ఉన్నారు. ఇక కీలక నేతలు 30 మంది వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థి నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు. కామారెడ్డి లో సైతం సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలో నిలవడం విశేషం. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, బిజెపి తరఫున బండి సంజయ్, హుజురాబాద్ లో ఈటెల వంటి హేమాహేమీలు బరిలో దిగడం విశేషం. వీరిలో విజేతలు ఎవరన్నది డిసెంబర్ 3న తేలనుంది.