MLA Anil Kumar Yadav: ఏపీ సీఎం జగన్ పై ఈగ వాలనివ్వని నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందుంటారు. వైసీపీ ఆవిర్భావం నుంచే జగన్ వెంట నడుస్తున్న యువనేత దూకుడు కనబరుస్తూ వస్తున్నారు. ఆ దూకుడే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మార్చింది. మంత్రి పదవి తెచ్చిపెట్టింది. కానీ మూడేళ్లలో మంత్రి పదవి పోయే సరికి యువనేతకు కష్టాలు చుట్టుముట్టాయి. అయిన వారే దూరంగా జరిగిపోయారు. కత్తికడుతున్నారు. అధినేత సైతం అనుమానపు చూపులు చూస్తున్నారు. ఇప్పుడు పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
ఇటీవల సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాపు నిర్వహించిన సంగతి తెలిసిందే. వెనుకబడిన 18 మంది ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.వారి పేర్లు చదవకుండానే పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే మార్చేస్తానని సంకేతాలు పంపారు. ఆ 18 మందిని విడివిడిగా కలిసి లాస్ట్ వార్నింగ్ ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ సీఎం జగన్ ను తాడేపల్లిలో ప్రత్యేకంగా కలిశారు. దీంతో వెనుకబడిన వారి జాబితాలో అనిల్ కూడా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కూడా దక్కదన్న ప్రచారం ఊపందుకుంది. ఒకానొక దశలో అనిల్ పార్టీని వీడుతున్నట్టు టాక్ నడిచింది.
నెల్లూరులో అనిల్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో అప్పటి తాజా మాజీ మంత్రిపై అత్తెసరు మెజార్టీతో అనిల్ గెలిచారు. అప్పట్లో అనిల్ గెలుపునకు బాబాయ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయి. అయితే మంత్రి అయిన తరువాత అనిల్ తన దూకుడుతో అందర్నీ దూరం చేసుకున్నారు. వైసీపీ జిల్లా నేతలతో వైరం పెంచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు తూలనాడుతూ వచ్చారు.అది మైనస్ గా మారింది. ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్ వేరే కుంపటి పెట్టుకున్నారు. మెజార్టీ కేడర్ ఆయన వెంటే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో రూప్ కుమార్ అభ్యర్థి అవుతారని ప్రచారం నడుస్తోంది.
అటు టీడీపీ సైతం వ్యూహాత్మకంగా మాజీ మంత్రి నారాయణను లైన్ లోకి తెచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం చేస్తోంది. నెల్లూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారని నారాయణపై జనాలకు సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఆయన గెలుపు నల్లేరు మీద నడక అన్న ధీమా టీడీపీలో కనిపిస్తోంది. వైసీపీలో చూస్తే అనిల్ లో అన్నీ మైనస్ లే కనిపిస్తున్నాయి. అక్కడ అభ్యర్థిని మార్చితే కానీ గట్టెక్కలేమని హైకమాండ్ భావిస్తోంది. అందుకే సీఎం జగన్ సైతం తన సన్నిహితుడికి షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక అనిల్ మల్లగుల్లాలు పడుతున్నారు. సొంత పార్టీలో ప్రత్యర్థులపై కారాలు మిరియాలు నూరుతున్నారు.