China vs Modi: అదును చూసి దెబ్బకొట్టడంతో ప్రధాని మోడీని మించిన వారు లేరని మరోసారి అర్థమైంది. సరిహద్దుల్లో కవ్విస్తూ భారత జవాన్ల మృతికి కారణమైన చైనా దేశంపై ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్ర ఆంక్షలు పెట్టారు. ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించి షాక్ ఇచ్చారు. భారత్, చైనా మధ్య గత కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం ఇప్పటికీ తేలడం లేదు. చైనా కవ్వింపు చర్యలపై భారత్ సమయానుకులంగా తిప్పికొడుతూనే ఉంది. అయితే ఎల్వోసీ వెంబడి అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన నేపథ్యంలో భారత్ వ్యవహరించిన తీరుపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. చాకచక్యంగా భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించడంలో ఇండియా సఫలీకృతమైంది. దీంతో భారత్ తో స్నేహపూర్వకంగా ఉండేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇన్నాళ్లు భారత్ పై కాలుదువ్విన చైనా కూడా భారత్ తో సన్నిహితంగా మెలిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదు.

భారత్ కు సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనాతో ప్రతిష్టభన ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో సామరస్యంగా చర్చలు జరిపి ప్రతిష్టంబన తొలగించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం పర్యటించారు. ఈయన న్యూ ఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చర్చలు జరిపారు. ఎల్వోసీ వెంబడి నెలకొన్న సమస్యలపై చర్చించారు. 2020 ఏప్రిల్ నుంచి ఈ ప్రాంతంలో చైనా బలగాలు అసాధారణ స్థితిలో ప్రవర్తించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. అయితే చైనా దళాలు అక్కడి నుంచి ఉపసంహరించాలని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. అప్పుడే ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు వస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ ఇరు దేశాలు దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. వివాదాల జోలికి పోకుండా సంబంధాలను సాధారణ స్థితికి వచ్చేలా మాట్లాడుకోవాలన్నారు. ఇరు దేశాలు సత్సంబంధాల కోసం తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ముందు ఎల్వోసీ వెంబడి నెలకొన్న పరిస్థితులు పరిష్కారమైన తరువాతే సత్సంబంధాల గురించి ఆలోచిస్తామన్నారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. అక్కడ యోగి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి ఆకస్మికంగా పర్యటించడం ఆసక్తిగా మారింది. గతంలో గాల్వానా లోయలో జరిగిన వివాదం తరువాత 22 మంది భారత సైనికులను చైనా సైన్యం పొట్టనపెట్టుకుంది. వారివైపు మరణాలు సంభవించాయి. ఈ ఘర్షణ తర్వాత కొన్ని సార్లు చర్చలు జరిగినా.. అవి సఫలీకృతం కాలేదు. ఎందుకంటే ఓ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు చైనా కుటిల నీతితో చర్యలంటోంది. ఈ నేపథ్యంలో చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారత్ నిర్ణయించింది.
ఇక చైనాకు చెందిన కొన్ని వస్తువులను ఇప్పటికే బహిష్కరించిన విషయం తెలిసిందే. అటు టెక్నికల్ గా కూడా చైనాను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తో సంబంధాల విషయంలో సామరస్యంపై చైనా సమావేశాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం ఎల్వోసీ ప్రాంతంలో ఉన్న బలగాలను వెనక్కి పంపించాలని పట్టుబడుతోంది. కానీ చైనా మాత్రం పైకి సామరస్యమంటూనే.. ఎల్వోసీ వెంబడి అక్రమంగా చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే చైనా విదేశాంగ మంత్రి భారత్ కు వచ్చినా.. కలవడానికి ప్రయత్నించినా తిరస్కరించి ప్రధాని మోడీ సంచలనం సృష్టించారు. చైనాకు గట్టి షాక్ ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.