Michaung Cyclone: పడవల్లా కార్లు, ఇళ్లు.. తమిళనాడులో ఐదు దశాబ్దాలుగా చూడని జల ప్రళయం..

భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 160 విమాన సేవలు రద్దు అయ్యాయి.

Written By: Dharma, Updated On : December 5, 2023 11:45 am

Michaung Cyclone

Follow us on

Michaung Cyclone: తమిళనాడు జలప్రళయంలో చిక్కుకుంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుఫానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడు అంత విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నైలో ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. దీంతో ఎటు చూసినా జలమే కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం చెన్నై తో పాటు శివారు జిల్లాల్లో వర్షపాతం నమోదయింది. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు,పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదలకు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 160 విమాన సేవలు రద్దు అయ్యాయి. మరో 33 సర్వీసులను బెంగళూరుకు దారి మళ్ళించారు. కాంచీపురం, తిరువల్లూరు, చంగల్పట్ట జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంది. చెన్నైలోని దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి ప్రముఖులు ఉండే పోయిస్ గార్డెన్ హైవే ఏడు అడుగులు మేర కుంగిపోయింది.

గత ఐదు దశాబ్దాలుగా ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని తమిళనాడు వాసులు చెబుతున్నారు. 2017లో చెన్నైలో కుంభవృష్టి కురిసింది. అప్పట్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. కానీ అంతకుమించి మిచాంగ్ బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 500 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.