Chandrababu – BJP : టీడీపీతో బీజేపీ స్నేహం కుదిరిందా? వాటి మధ్య బంధానికి వైసీపీ అడ్డంగా నిలుస్తోందా? నిన్నటివరకూ అవకాశం కోసం ఎదురుచూసిన చంద్రబాబు స్ట్రాటజీ మార్చారా? కొన్నిరకాల షరతులు అమిత్ షా, నడ్డా ఎదుట పెట్టారా? వాటిని అధిగమిస్తే కానీ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరదని తేల్చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. సుదీర్ఘ విరామం తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కలిశారు. దాదాపు గంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది. కానీ వీటి వివరాలేవీ ఇప్పుడు బయటపడలేదు.
ఇది రాజకీయ పరమైన చర్చేనని ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. టీడీపీతో కలిసి పని చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. ఎన్టీఏలో చేరాలని టీడీపీని అమిత్ షా ఆహ్వానించినట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు బీజేపీ, టీడీపీ కలిస్తే అది మైనస్ గా మారుతుందని చెప్పినట్టు సమాచారం. జగన్ కు బీజేపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న భావన ప్రజల్లో పాతుకుపోయిందని.. వైసీపీపై ప్రతికూలత బీజేపీపై పడిన విషయాన్ని ఉదాహరణలతో చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.
గత నాలుగేళ్లుగా వైసీపీ చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు బీజేపీ సపోర్టు ఉన్నట్టు ఏపీలో అభిప్రాయం విస్తరించిందని చెప్పినట్టు సమాచారం. విచ్చలవిడిగా అప్పులు, ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటినా నియంత్రించకపోవడం, ఇతరత్రా ప్రయోజనాల విషయంలో జగన్ కు వెసులబాటు ఇవ్వడం వంటివి ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయని చంద్రబాబు అమిత్ షాకు గుర్తుచేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు టీడీపీతో బీజేపీ కలిసినా అది మైనస్సే అవుతుందని.. ముందు వైసీపీకి వ్యతిరేకం అనే భావన బీజేపీ తేవాలని.. చంద్రబాబు కోరినట్లుగా భావిస్తున్నారు.
బీజేపీ పిలవడమే తరువాయి చంద్రబాబు స్నేహహస్తం అందిస్తారని అంతా భావించారు. కానీ చంద్రబాబు తిరస్కరించకపోయినా.. అంత పనిచేశారు. మొన్నటివరకూ బీజేపీ స్నేహం కోసం చూసినా.. ఇక్కడ తన సీనియార్టీని చూపించుకున్నారు. వైసీపీకి సహకారం కొనసాగిస్తూ ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం .. లేకపోతే ఎన్డీఏలో చేరడం అనేది కరెక్ట్ కాదని టీడీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నాయి. పైగా కర్నాటక ఎన్నికల్లో ప్రతికూలత, కాంగ్రెస్ తో పాటు మోదీ వ్యతిరేక శిబిరానికి అనుకూతలు నడుమ చంద్రబాబు పాత్ర నిడివి పెరిగింది. ఈ తరుణంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి చంద్రబాబు నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అందుకే ముందుగా అమిత్ షాకు నిర్ణయాత్మక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.