Modi- KCR And Kejriwal: ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టుకొస్తావా నాగన్న.. అన్నట్టుగా ఉంది.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితి. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్.. ఎన్నో∙ఆశలతో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. తనతో కలిసి వస్తారన్న ఆశతో ఆహ్వానితుల కోసం ప్రత్యేక ఫ్లైట్‌లు బుక్‌చేశారు. కానీ.. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మినహా ఎవరూ కనిపించలేదు. మూడు రోజులు ఢిల్లీలో వేచిచూసినా.. ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ కూడా కేసీఆర్‌ను కలువలేదు. దీంతో మూడు రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు కేసీఆర్.

స్కాం కలుపుతుందా ఇద్దరినీ..
ఢిల్లీ లిక్కర్ స్కాం బీఆర్‌ఎస్‌ను, ఆప్‌ను దగ్గర చేస్తాయని కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌ను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మరీ మాట్లాడారు కేసీఆర్. రాజకీయాలపై చర్చించామని సీఎంవో నుంచి ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ పంజాబ్ వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ మాత్రం తాము రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. ‘నీది తెనాలే… నాది తెనాలే’ అన్నట్లుగా నీ పార్టీ లిక్కర్ స్కాంలో ఉంది.. నా పార్టీ లిక్కర్ స్కాంలో ఉంది. ఇద్దరం కలిసి మోదీని ఎదుర్కొదాం అన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పొత్తులకు ఆప్ దూరం..
వాస్తవంగా పొత్తులు ఆప్ సిద్ధాంతానికి విరుద్ధం. పార్టీ స్థాపించిన నాటి నుంచి కేజ్రీవాల్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఢిల్లీ, పంజాబ్, గోదా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఇలా అనేక రాష్ట్రాల్లో ఆప్ పోటీ చేసింది. కానీ ఎన్నడూ ఏ పార్టీతో కలిసి పనిచేయలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లిక్కర్ స్కాం కేసీఆర్‌ను కేజ్రీవాల్‌ను దగ్గర చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా జరుగుతోంది. రెండేళ్ల క్రితం తెలంగాణలో ఆప్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్.. రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించారు. కానీ.. తాజా రాజకీయ పరిణామాలతో ఆయన తెలంగాణపై ఫోకస్ పెట్టకపోవచ్చని తెలుస్తోంది.

ఇద్దరు కలిసినా కష్టమే..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇబ్బంది పడుతున్న కేసీఆర్, కేజ్రీవాల్ కేంద్రంలో మోదీని ఓడించేందుకు ఒకవేళ కలిసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయమే రాజకీయాల్లో వినిపిస్తోంది. అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారని ఇప్పటికే మోదీ ప్రకటించారు.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిచ సందర్భంగాను పునరుద్ఘాటించారు. ఆప్, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు కుదిరితే మోదీ చేసిన ప్రకటన నిజమే అవుతుంది. ఇది బీజేపీకి ఆయుధంగా మారుతోంది. దీంతో వారి పొత్తు లాభం చేకూర్చకపోగా.. నష్టం కలిగే అవకాశమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో పొత్తులకు వ్యతిరేకమైన కేజ్రీవాల్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌తో కలుస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.