Amanchi Krishna Mohan: రాజకీయాల్లో దూకుడు ఎంత గుర్తింపు తెచ్చిపెడుతుందో… అంతే చేటు తెస్తుంది. చాలా మంది విషయంలో ఇది రుజువు అయ్యింది. పొలిటికల్ గా దూకుడు పెంచి పదవులు సొంతం చేసుకున్న వారూ ఉన్నారు. రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన వారిని చూస్తున్నాం. అదే దూకుడుతో పొలిటికల్ గా భారీ మూల్యం చెల్లించుకున్న వారూ ఉన్నారు. అయితే ఇటువంటి దూకుడున్న నాయకుడిగా గుర్తింపు పడ్డారు చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్. నియోజకవర్గంలో మంచి పట్టున్ననేత. మాస్ లీడర్ గా ఎదిగారు. చీరాల అంటే ఆమంచి.. ఆమంచి అంటే చీరాల అన్నట్టు నియోజకవర్గంతో ఆయన బంధం పెనవేసుకోబోయింది. అటువంటి నాయకుడితో వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. నియోజకవర్గాన్నిదాటించి చీరాలతో సంబంధాలు కట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో వైసీపీలోకి ఎందుకొచ్చానా అని ఆమంచి తెగ బాధపడుతున్నారు. పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు.

గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా కరణం బలరామ్ పోటీచేశారు. వైసీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ బరిలో దిగారు. కానీ అనూహ్యంగా బలరాం విజయం సాధించారు. కానీ వైసీపీ ఒత్తిడితో బలరాం వైసీపీలోకి జంప్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. వైసీపీలో చేరిన సమయంలోనే ఆయన రాజకీయ భవిష్యత్ కు గట్టి హామీ ఇచ్చి తీసుకొచ్చారు. పైగా అమంచితో పోల్చితే బలరామే బెటర్ అన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. 2914 ఎన్నికల్లో కూడా టిక్కెట్ దక్కకపోయే సరికి అమంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలుపొందారు. జగన్ కు సవాల్ చేస్తూ టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్న జగన్ అమంచిని చీరాల నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. అందుకే పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు.
అయితే తనను పర్చూరు వెళ్లగొట్టడం వెనుక కుట్ర జరిగిందని.. రాజకీయంగా తనను దెబ్బకొట్టే ప్లాన్ చేస్తున్నారని ఆమంచి ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ను కలిసినా ఆయన పర్చూరులో పనిచేసుకోవాలని సూచించారు. పరోక్షంగా చీరాలను బలరాం కు వదిలేయ్యాలని సూచించారు. పర్చూరులో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా గెలుపొందారు. పైగా పర్చూరులో సామాజికవర్గంగా తనకు మైనస్ అని ఆమంచి భావిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పర్చూరు వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు. తన మనసులో ఉన్న మాటను జగన్ కు చెప్పాలని భావిస్తున్నారు. అప్పటికీ వినకుంటే తన నిర్ణయం ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.
అయితే తాజాగా ఆమంచి జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చీరాలలో అమంచికి మంచి పట్టుంది. పద్మశాలి, బలిజ సామాజికవర్గం వారు అధికంగా ఉండడంతో..ఆ రెండు వర్గాల్లో కూడా అమంచికి సపోర్టర్స్ ఎక్కువ. 2014 ఎన్నికల్లో వారి సపోర్టుతోనే గెలిచారు. ఇప్పుడు వైసీపీ పొమ్మన లేక పొగపెడుతుండడం, టీడీపీలోకి చాన్స్ లేకపోవడంతో ఆమంచి ముందున్న ఏకైక ఆప్షన్ జనసేన. పవన్ ప్రభావానికి తన వ్యక్తిగత బలం తోడైతే ఈజీగా గెలుపు సాధించవచ్చని ఆమంచి భావిస్తున్నారు. అందుకే సీఎం జగన్ తో తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే సవాల్ విసురుతారని ఆమంచి అనుచరులు చెబుతున్నారు.