Delhi Liquer Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఇందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. అనేకమంది మద్యం వ్యాపారులుతోపాటు ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ పై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ దందాలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రెండు రోజుల క్రితం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో లిక్కర్ దందాలో కవిత పాత్ర పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టి అణిచివేస్తోంది. దీనికి వ్యతిరేకంగా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు నిరసన దీక్షలతో తెలంగాణ అంతటా హోరెత్తిస్తున్నారు. అయితే ఇందులో కవిత ప్రమేయం ఉందా? బీజేపీ ఆరోపణల్లో నిజం ఎంత? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటసలు?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి లిక్కర్ విధానం అమలు చేస్తున్నారని దాన్నే ఢిల్లీలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీని పూర్తి బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీసుకున్నారు. ఈ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రమేయం ఉందని సీబీఐ తేల్చింది. మరికొందరు ఆప్ నేతలపై కేసులు నమోదు చేసింది. ఈ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్య పాత్ర అని బీజేపీ ఆరోపిస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీతోపాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ.150 కోట్లు అందాయని ఆరోపిస్తోంది. ఢిల్లీ ఓబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అయిన తెలంగాణ ఐఏఎస్, ఇతర ఎక్సైజ్ అధికారులతోపాటు కవిత కూడా ఈ ఓబెరాయ్ హోటల్ లో ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కవిత ప్రైవేట్ విమానంలో ఢిల్లీ వచ్చారని.. దీనికి తెలంగాణకు చెందిన లిక్కర్ మాఫియా సహకరించేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలోని పలువురు ఈ లిక్కర్ మాఫియాలో భాగస్వాములని బీజేపీ ఆరోపిస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులో ఢిల్లీలో ఎల్1 లైసెన్స్ హోల్డర్లని ఆరోపించారు. మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి వచ్చి డీల్ సెట్ చేసింది కేసీఆర్కూతురు అని బీజేపీ ఆరోపిస్తోంది. కవిత ఢిల్లికి వచ్చి రూ.4.5 కోట్లతో డీల్ కుదిర్చారని అంటున్నారు. పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా 4.5 కోట్లు ముట్టాయని ఆరోపిస్తున్నారు.ఇ దంతా కూడా కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగిందని అంటున్నారు.
-తెలంగాణలో బీజేపీకి రాజకీయ అస్త్రంగా స్కాం
తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం బీజేపీకి ఆయువు పట్టుగా మారింది. దీనిపై బీజేపీ శ్రేణులు డైరెక్టుగా కవితను టార్గెట్ చేశాయి. ఆమె ఇంటి ముందర ధర్నాలు, ఆందోళనలు చేశాయి. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యి వారిపై హత్య కేసులు పెట్టింది. దీనికి నిరసనగా పాదయాత్ర లో ఉన్న బండి సంజయ్ కదం తొక్కడంతో ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించింది. ఇప్పుడక్కడ నిరసన దీక్షను బండి సంజయ్ చేపట్టారు. దీంతో కవిత అవినీతిపై బీజేపీ మరింతగా ఫోకస్ చేసింది. ఇది మరుగున పడాలనే కేసీఆర్ తనను అరెస్ట్ చేశాడని బండి సంజయ్ అంటున్నారు. ఇక బీజేపీ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని కూడా కవిత కోర్టును ఆశ్రయించారు. కోటి రూపాయల పరిహారం చెల్లించాలని పరువునష్టం దావా వేశారు. దీంతో ఇది బీజేపీకి రాజకీయ అస్త్రంగా మారింది.

-కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ రాజకీయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా కేంద్రంతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసినా.. సభలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణపై కేంద్రం చెబుతున్న వివక్షతను ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ‘ మోడీ నువ్వు గొకకున్నా.. నిన్ను గోకుతా ‘ అని వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు వాడుతున్న పద ప్రయోగం.. భాషను గమనిస్తూ వస్తున్న మోడీ.. ఏమి చేయడం లేదన్నట్లు ఉంటూనే.. టిఆర్ఎస్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా కెసిఆర్ కుటుంబం అవినీతిని ఢిల్లీ పెద్దలు తవ్వి తీస్తున్నారని తెలుస్తోంది.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పాత్రను తెరమీదికి రావడానికి ఇదే కారణం అంటున్నారు. తనతో పెట్టుకుంటే ఇంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అన్న సంకేతాన్ని మోడీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
-కేసీఆర్, కవితకు ఇది నైతికంగా పెద్ద ఎదురుదెబ్బ
ఢిల్లీ స్కాంలో కవిత ఉన్నా లేకున్నా కానీ బీజేపీ ఆరోపణలు మాత్రం టీఆర్ఎస్ ను బాగా డ్యామేజ్ చేశాయి. రాజకీయ శతృత్వం ఉండడంతో బీజేపీ ఆరోపణలను ఇక్కడి వారు నమ్మడం లేదు. మనీష్ సిసోడియా, కవిత ఖండించినా కూడా నిప్పు లేనిదే పొగ రాదు. మరి ఈ ఆరోపణలు కనుక నిజమైతే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీకి పెద్ద మాయని మచ్చగా మారడం ఖాయం. మోడీతో పెట్టుకున్న అందరికీ రాజకీయంగా ఏదో ఒక దెబ్బ తగులుతుంది. అది అవినీతిపైనే కావడం ప్రస్తావనాంశం. ఇప్పటికే తనను ఎదురించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితుడు, అఖిలేష్ యాదవ్ సన్నిహితులు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను మోడీ టార్గెట్ చేశారు. ఇలా చేయడం ద్వారా ఆ పార్టీలోని మిగతావారు కూడా భయపడతారని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు తోకజాడిస్తున్న కేసీఆర్ ను ఆయన కూతురు కవితను టార్గెట్ చేసి నోరు మూయించేలా చేస్తున్నారు. ఇది నిజంగా అవినీతిపై యుద్ధమే అయితే అందరూ బీజేపీకి సపోర్టుగా నిలుస్తారు. తప్పు అయినా ఈ అవమానం టీఆర్ఎస్ కు మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఎటూ చూసినా బీజేపీకి ఇది రాజకీయంగా మైలేజ్ ఇచ్చే అంశం. కేసీఆర్ ఫ్యామిలీకి, కవితకు ఇది పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.
[…] […]