Homeఆంధ్రప్రదేశ్‌AP Govt Employees Salaries: మరో రెండు రోజుల తరువాతే..ఏపీలో ఉద్యోగులకు జీతాలు

AP Govt Employees Salaries: మరో రెండు రోజుల తరువాతే..ఏపీలో ఉద్యోగులకు జీతాలు

AP Govt Employees Salaries: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తారీఖు వచ్చిందంటే ముఖంలో చిన్న ఆనందం. ఎందుకంటే ఆ రోజు చేతిలోకి జీతం వస్తుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు..ఇలా అన్నీ జీతం కోసం ఎదురుచూస్తుంటాయి. అందుకే ఉద్యోగులు ‘ఒకటో తారీఖు’ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ జగన్ సర్కారు మాత్రం ఒకటో తారీఖును నమ్మకండి. నేను ఎప్పుడు జీతం ఇస్తే అప్పుడే ఒకటో తారీఖుగా భావించుకోండి అంటూ ఉద్యోగులకు సూచిస్తోంది. ఈ నెలలో ఇంతవరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతనాలు, పింఛనర్లకు పింఛను మొత్తం అందించలేదు. తెలుగు వారి తొలి పండుగ ‘ఉగాది’కి సైతం ఫ్రభుత్వం వేతనాలు అందించలేపోయింది. ఈ నెల జీతాలు 5వ తేదీ తర్వాతే అందవొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సాంకేతిక కారణాలను సమస్యగా చూపుతున్నాయి.

AP Govt Employees Salaries
AP Govt Employees Salaries

అయితే ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం కారణంగానే జీతాలు వేయలేదని అనుమానిస్తున్నారు.. సాధారణంగా ఏ నెల అయినా ఒకటి లేదా రెండో తారీఖుల్లో సెలవు లేదా పండుగ లాంటిది వస్తే అంతకు ఒకరోజు ముందే ఖాతాల్లో జీతాలు పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు ఉన్నాయి. మితిమీరిన సంక్షేమ పథకాల అమలుకు తోడు అప్పులకుప్పగా మారిన ఏపీలో వస్తున్న రాబడికి.. పెడుతున్న ఖర్చుకు మధ్య పొంతన కుదరడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. గతంలో వరుసగా ప్రతి నెలా జీతాలు లేటవ్వడంతో ఉద్యోగులు గగ్గోలుపెట్టారు. అయితే కొన్నినెలలుగా జీతాలు టైముకే ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ నెల మాత్రం మళ్లీ పాత పంథాకే వచ్చింది. ఈ నెల 5వ తారీఖు తర్వాతనే జీతాలు,పెన్షన్లు పడే అవకాశం ఉందంటున్నాయి ట్రెజరీ వర్గాలు.

Also Read: AP Online Ticketing: మెగా ఫ్యామిలీకి ‘ఏపీ ఆన్ లైన్ టికెట్’ టెండర్ ఎందుకు ఆపేశారు?

పండుగ సరదా లేకుండా
తెలుగువారి ప్రతీక అయిన ఉగాదిని వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తొంది, అయితే వేతనాలు పడక చిరుద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. పండుగను సాదాసీదాగా జరుపుకున్నారు. అయితే జీతాల ఆలస్యానికి సాంకేతికంగా ఏర్పడ్డ సమస్యలే కారణమని అధికార వర్గాలు అంటున్నాయి. ఎప్పుడూ జీతాలు ప్రాసెస్ చేసే ఎస్ఏపీ ప్లాట్‌ఫామ్‌ను మార్చి వేరే ప్రోగ్రామింగ్ ద్వారా బిల్లులు అప్‌లోడ్ చేయడంతో అవి రిటర్న్ అయ్యాయని వారు చెప్పుకొస్తున్నారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆర్బీఐకు అనుసంధానం కాకపోవడంతోనే జీతాలు,పెన్షన్లకు చెందిన బిల్లులు వెనక్కు వచ్చేశాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. .

అందుకే మరోసారి ఆ బిల్లులన్నింటినీ సబ్మిట్ చేయాలని ట్రెజరీని కోరడంతో ఆలస్యం అయిందనీ మరో ఒకటి రెండు రోజుల్లో జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు ఉగాది, ఆదివారం అంటూ సెలవులు రావడాన్ని కూడా ఒక కారణంగా ప్రభుత్వం చూపుతోంది.మార్చి నెల ముగింపు సందర్భంగా ప్రభుత్వంపై బిల్లుల చెల్లింపు కోసం ఒత్తిడి ఉంటుంది. ఖజానాలో ఉన్న కొన్ని నిధులనూ వాటికోసం చెల్లించారని తెలుస్తోంది.

AP Govt Employees Salaries
AP Govt Employees Salaries

కొత్త అప్పులు పుడితేనే..
అయితే జీతాలు చెల్లించకపోవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సర్పంచుల ఖాతాల్లోని పంచాయతీల నిధులూ వాడేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆర్బీఐ ఇచ్చే వేస్ అండ్ మీన్స్ వెసులుబాటు నిధులు రెండువేల కోట్లనూ ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అంటున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం జీతాలు ఇవ్వాలంటే అప్పు కోసం వెళ్లాల్సిందేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నూతన ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ కొత్త అప్పులకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది.

దానిని ఉపయోగించుకొని కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందని, అవి వస్తే జీతాలు చెల్లించాలని చూస్తుందనే కథనాలు వెలువడుతున్నాయి. లేదా బాండ్లను తాకట్టు పెట్టాలంటే మాత్రం మంగళవారం వరకూ ఆగాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే జీతాలు అందాలంటే 5వ తేదీ దాటిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు జీతాలు ఎప్పుడు పడతాయో అన్న సందేహం ఉద్యోగులను వెంటాడుతోంది. ప్రభుత్వం తీరును ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా అక్షేపిస్తున్నారు. ఆయా వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read: Online Ticket Portal Tender Issue: ఆ కాంట్రాక్ట్ మెగా ఫ్యామిలీకి వస్తుందా ? రాదా ?

RELATED ARTICLES

Most Popular