
నాగరికత వేగంగా మారుతోంది. మనుషుల్లో సాంకేతికతపై పెరుగుతున్న మోజుతో ఆచారాలు సైతం మారిపోతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో సనాతన ఆచారాలను పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదాహరణ జల్లికట్టు. సమాజంలో మహిళలకు ఉన్న గౌరవం ఎలాంటిదో అందరికి తెలుసు. మన దేశంలోనైతే మహిళలకు సముచిత స్థానమే ఇస్తాం. కానీ కొన్ని సమాజాలు వారిని అంగడి సరుకులుగా మారుస్తున్నాయి. సాంకేతికతపెరిగిన కాలంలో కూడా వారిని పుత్తడి బొమ్మలను చేస్తున్నారు. కాలంతోపాటు పోటీ పడి మారాల్సిన మనం మనుషుల్లా కాకుండా రాతి విగ్రహాల్లా ఉండిపోతున్నామని తెలుసుకోవాలి.
రాజస్థాన్ లోని నాగౌర్ గ్రామంలో ఓ ఆచారం ఇప్పటికీ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆటా సాటా అనే సంప్రదాయం మహిళలను వేదనకు గురిచేస్తోంది. వారి మనోభావాలను దెబ్బతీస్తోంది. ఏ అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటుంటే తమ ఇంట్లోని అమ్మాయిని వధువు కుటుంబంలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. అంటే పెళ్లి కొడుకు అక్కకో, చెల్లికో పెళ్లి కూతురి కుటుంబంలో పెళ్లి చేయాలి. అలాచేయకపోతే అతని పెళ్లి కూడ జరగదు. అలా పెళ్లి చేసే సమయంలో వయసుతో ఎక్కువ తక్కువలను పట్టించుకోరు. తనకు పెళ్లి చేయకపోతే అది ఇష్టం లేని ఒక 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆటా సాటా చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్ లో మరో భయానక ఆచారం వెలుగులోకి వచ్చింది. అదే ఝగడా అనే ఆచారం సైతం వెలుగులోకి వచ్చింది. దీని మూలాలు బాల్యవివాహాల్లో ఉన్నాయి. చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తారు. అలా చేసే సమయంలో అబ్బాయిల వయసును పెద్దగా పట్టించుకోరు. ఆ అమ్మాయి వయసుకు వచ్చిన తరువాత ఆమెను అత్తారింటికి పంపుతారు. ఒక వేళ అమ్మాయి వెళ్లనన్నా లేక అబ్బాయి కుటుంబం అమ్మాయిని వద్దన్నా ఆ భారం అమ్మాయి కుటుంబం మీదే పడుతుంది. ఊర్లో పరువు పోవడమే కాకుండా అబ్బాయి కుటుంబానికి అమ్మాయి కుటుంబం భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం అమ్మాయి కుటుంబం ఆ సొమ్ము ఇవ్వడంలో విఫలమైతే అబ్బాయి కుటుబం తెగిస్తారు.
ఝగడా వల్ల తమపై వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక అమ్మాయి కుటుంబం దారుణమైన పద్దతిని అమలు చేస్తుంది. ఊరు మొత్తం తమను శత్రువులా చూస్తూ ఒత్తిడి చేయడతో దానికి తలొగ్గిన అమ్మాయి కుటుంబం నాత్రా ఆచారాన్ని అమలు చేస్తుంది. దీని ప్రకారం అత్తారింటికి వెళ్లని అమ్మాయిని మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మొదటి భర్త కుటుంబానికి ఆమె ఇవ్వాల్సిన పరిహారాన్ని కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ సొమ్ము ఎవరు చెల్లిస్తానంటే వారికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసేస్తారు. ఒక్కోసారి అమ్మాయిలను అమ్మేస్తారు. ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్ లోని గ్రామాల్లో పలు రకాలుగా జరుగుతుంటాయి.
గుణా ప్రాంతానికి చెందిన ఓ యువతిని నాత్రా ఆచారం ప్రకారం తండ్రి, మామయ్య కలిసి అమ్మేయబోయారు. దీంతో ఆ యువతి ఇండోర్ పారిపోయింది. కొంతకాలం తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోయి రాజస్థాన్ లోని కోటా చేరింది. అక్కడ ఘీసాలాల్ భీల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వారికి ఒక బాబు కూడా పుట్టాడు. ఆమె విషయం తెలిసిన తండ్రి, సోదరుడు కోటాకు చేరి ఆమెను తీసుకుపోవాలని చూశారు. ఆమె ససేమిరా అనడంతో రూ.1.5 లక్షలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేశారు. ఆ సొమ్ము తీసుకుని తిరిగి వెళ్లిపోయారు. కానీ వారు మరోసారి కూడా రాజస్థాన్ వెళ్లి ఆమెను బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లి సుల్తాన్ అనే వ్యక్తికి రూ.2 లక్షలకు అమ్మేశారు. ఆమెను తనతో తీసుకెళ్లిన సుల్తాన్ బలవంతంగా అత్యాచారం చేశాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి భర్త చెంతకు చేరింది.
రాజ్ గఢ్ జిల్లా ఖిల్జీపూర్ గ్రామానికి చెందిన రామ్ కళా బాయి అనే యువతికి చిన్నతనంలోనే కమల్ సింహ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. వయసుకు వచ్చిన తరువాత ఆమెను అత్తారింటికి పంపారు. అత్తారింటి వాళ్లు చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆమె భర్త కమల్ పచ్చి తాగుబోతు. అతని హింస తట్టుకోలేక పుట్టింటికి తిరిగొచ్చి తన కష్టాలు చెప్పుకుంది. రామ్ కళా బాయి అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేదని చెప్పింది. దీంతో కమల్ కుటుంబం 2019లో ఆమె కుటుంబంపై విరుచుకుపడింది. ఇంటికి నిప్పు పెట్టింది. రూ.9 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమెను ఎవరికైనా అమ్మేసి తమకు సొమ్ము ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఖిల్జీపూర్ లో ఆ కుటుంబంపై కేసు నమోదు చేశారు.