Congress – Ponguleti : కాంగ్రెస్ పార్టీలోకి తమ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరడం ఇక లాంఛనమే. ఇప్పటికే ఆయన చేరికకు సంబంధించి రాహుల్ గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జూమ్ మీటింగ్లో కూడా మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పొంగులేటి అనుచరులకు ఖమ్మం జిల్లాలో టికెట్లు కూడా ఖాయం అయ్యాయని తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ నుంచి మార్గదర్శకాలు రావడంతో ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గాలు కూడా సైలెంట్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇది నిన్న మొన్నటి వరకు ఉన్న సమాచారం. అయితే తాజాగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. తమకు బద్ధ శత్రువుగా మారిన కెసిఆర్ భారత రాష్ట్ర సమితికి భారీగా గండి కొట్టే ప్రయత్నాలు చేస్తోంది. భారత రాష్ట్ర సమితికి అండగా ఉండుకుంటూ వస్తున్న ఓ బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసింది.
Congress – Ponguleti : పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక వెనుక భారీ స్కెచ్.. కేసీఆర్ ఇలా షాక్..
ఆషా మాషీగా కాదు
తెలంగాణలో చేరికలపర్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంతా సులభంగా తీసుకోలేదు. చేరికలకు అధిష్టానం కూడా పక్కాగా లెక్కలు వేసుకుంది. స్థానిక నాయకత్వానికి మార్గదర్శకాలు విడుదల చేయడంతో.. అదికూడా ఆ విధానాన్ని అనుసరించడం ప్రారంభించింది. ముఖ్యంగా రాష్ట్రంలో బలంగా మారిన భారత రాష్ట్ర సమితిని దెబ్బ కొట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తులకు గాలం వేసింది. వారితో స్థానిక నాయకత్వాన్ని కాకుండా అధిష్టానంతో మాట్లాడించింది. పొంగులేటి విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. రాహుల్ గాంధీ టీం వెళ్లి మాట్లాడిన తర్వాతే రేవంత్ ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత పొంగులేటికి సంబంధించిన డిమాండ్లు మొత్తం విన్నారు. వాటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాగానే తెర వెనుక కసరత్తు మొదలైంది. పార్టీలోకి ఎవరు వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి? వారి రాకతో పార్టీకి ఏ మేరకు బలం చేకూరుతుంది? వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఇన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాతే తదుపరి కార్యక్రమం జరిగింది.
ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా బలమైన నేత కావడం, వరంగల్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ సురేందర్ రెడ్డి అతడికి అండగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం అయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైఎస్ఆర్సిపి తరఫునుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేశారు. అప్పటి టిడిపి అభ్యర్థి నామా నాగేశ్వరరావు మీద గెలుపొందారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. సింగరేణి ఎన్నికల్లోను భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భారత రాష్ట్ర సమితి విస్తరణ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారత రాష్ట్ర సమితి ఉనికి ఖమ్మం జిల్లాలో విస్తరించేందుకు మరింత కృషి చేశారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొంగులేటిని కాదని భారత రాష్ట్ర సమితి నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం ఖమ్మం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఒకానొక దశలో ఎమ్మెల్సీ కూడా ఇస్తా అన్నారు. కాని చివరికి అవేమీ ఇవ్వకపోగా అతని సంస్థలపై దాడులు చేయించారు. ఇవన్నీ ఓపికగా భరించిన పొంగులేటి.. చివరికి పార్టీ మారారు. పార్టీ మారడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు. తాను అనుకున్న మాట తీరుగానే కాంగ్రెస్ పార్టీలో చేరి భారత రాష్ట్ర సమితికి స్కెచ్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో బలమైన శక్తులుగా ఉన్న భట్టి, రేణుకా చౌదరి వర్గాలను సముదాయించారు. తన వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.
ఇక పొంగులేటి రాకతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా స్థితిమంతమైన పొంగులేటి పార్టీ కోసం ఏదైనా చేసేందుకు వెనకాడబోరని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వైపు భారత రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉండుకుంటూ వస్తున్న రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఖమ్మం లో జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ సమావేశం వేదికగానే చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కీలకమైన నేతలను దూరం చేయడం, అటు బలమైన సామాజిక వర్గం అండ లేకుండా చేయడం వల్ల భారత రాష్ట్ర సమితి ఏకాకి అవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఉన్నాయి. ఇక ఈ పరిణామాలతో ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.