crocodile : ఆడ మగ కలయిక ద్వారా పిల్లలు పుట్టడం ప్రకృతి సిద్ధం. సృష్టిలో ఏ జీవి అయినా ఇలాగే జన్మనిస్తుంది. మనిషి, జంతువు, పక్షి.. ఇలా జీవి ఏదైనా సరే సంపర్కం జరగనిదే పిల్లలకు జన్మ ఇవ్వడం సాధ్యం కాదనే భావన అందరిలో ఉంటుంది. అయితే అది తప్పు అని ఇప్పటికే కొన్ని రకాల పక్షులు, చేపలు, బల్లులు ఇతర కొన్ని జీవులు నిరూపించాయి. కాగా తాజాగా కోస్టారికాలో మరో ఆశ్చర్యపరిచే జీవసంబంధమైన ఘటన జరిగింది. ఒక ఆడ మొసలి, మగ జీవి తోడు లేకుండానే గుడ్లు పెట్టింది. సుమారు 16 ఏళ్లుగా మగ మొసళ్లతో లైంగికంగా సంబంధం పెట్టుకోని ఈ ఆడ మొసలి వర్జిన్ బర్త్ ఇచ్చిందని, ఇలా జరగడం ప్రపంచంలోనే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కోస్టారికా జూలో అమెరికా మొసలి..
క్రోకోడైలస్ అక్యుటస్ అని పిలిచే ఈ ఆడ అమెరికన్ మొసలిని 2002లో కోస్టారికా దేశంలోకి తీసుకొచ్చి ఒక జూలో 16 ఏళ్లుగా ఉంచారు. ఈ సమయంలో ఇది ఏ ఇతర మొసలితోనూ కలవకుండా ఒంటరిగా నివసించింది. అయినా 2018, జనవరిలో దీని ఎన్‌క్లోజర్‌లో 14 గుడ్లు కనిపించినట్లు జూకీపర్స్ తెలిపారు. దురదృష్టవశాత్తు, ఈ గుడ్లలో ఒక్కటి తప్ప ఏవీ పొదగలేదు. ఆ ఒక్క గుడ్డు లోపల పూర్తిగా అభివృద్ధి చెంది, పుట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక మొసలి పిల్లను కనుగొన్నారు.
తల్లిని పోలికలతో జననం..
ఈ గుడ్డులో నుంచి పుట్టిన మొసలి పిల్ల దాదాపు తన తల్లిని పోలి ఉంది. శాస్త్రవేత్తలు జన్యువులను పరిశీలించినప్పుడు, మొసలి పిల్ల దాని తల్లితో 99.9% జన్యుపరంగా ఐడెంటికల్‌గా ఉన్నట్లు తేలింది. అంటే ఆ మొసలి పిల్ల తన తల్లి నుంచి దాదాపు 100% జన్యు సమాచారాన్ని పొందింది. శాస్త్రవేత్తలు మొసలి పిల్ల గుండె, తల్లి చర్మాన్ని అధ్యయనం చేసి వాటి జన్యు సమాచారం దాదాపు 99.9% సరిపోలికలతో సమానంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా మొసలి పిల్లకు తండ్రి లేదని వారు నిర్ధారించారు. ఈ వివరాలను బయాలజీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించేందుకు సిద్ధం చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వివరాలు తెలిస్తే కాలక్రమేణా జంతువులు ఎలా అభివృద్ధి చెందాయనే ఆసక్తికరమైన అంశాలపై అవగాహన ఇస్తుందనిభావిస్తున్నారు. ఆడ మొసలికి మగ తొడ లేకుండా పిల్లలు పుట్టే ఈ సామర్థ్యం గతంలో డైనోసార్ల వంటి జంతువులు ఉన్న సమయంలో కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.
కన్య జననం..
కొన్నిసార్లు కొన్ని జంతువులు తండ్రి అవసరం లేకుండా పిల్లలను కంటాయి. దీనిని ‘కన్య జననం’ లేదా ‘ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్’ అంటారు. ఈ పద్ధతిలో మగ జీవి స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందకుండా అండం శిశువుగా మారుతుంది. ఇది గతంలో కొన్ని రకాల పక్షులు, చేపలు, బల్లులు, పాములలో కనిపించింది, కానీ మొసళ్లలో ఈ వింత పుట్టుక ఇప్పటివరకు కనిపించలేదు.