Pawan Kalyan- BRS: భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్) పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ క్రమంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో మొదట పార్టీని స్థాపించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో కీలక నేతలను బీఆర్‌ఎస్‌లో చేరుకునేందుకు లేదా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ స్థాపనకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈమేరకు ప్రగతి భవన్ నుంచి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

ఏపీపై ఫస్ట్ ఫోకస్..
ఇంటగెలిచి రచ్చ గెలవాలన్న ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలో మొదట తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలంగా స్థాపించాలని భావిస్తున్నారు. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా’ అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంట్రీనే గ్రాండ్‌గా ఉండాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఈమేరకు ప్రముఖులు, మేధావులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీపై ఫస్ట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీ బీఆర్‌ఎస్ చీఫ్‌గా మాజీ ఎంపీ ఉండవల్లి పేరు ప్రచారంలో ఉంది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తూ వస్తున్న కేసీఆర్ బీఆర్‌ఎస్‌కి మద్దతుగా పలువురిని ప్రచారం చేయిస్తారనే వార్తలు వస్తున్నాయి.
జనసేన సపోర్టుతో ఏపీలోకి..
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఏపీలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. జాతీయ పార్టీగా ఆయనకు నాలుగు రాష్ట్రాల్లో ఆరుశాతం ఓట్లు రాబట్టుకోవడానికి కీలకమైన రాష్ట్రంగా ఏపీ నిలవబోతోంది. ఈ క్రమంలో జనసేన, టీఆర్‌ఎస్ పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తరుచుగా తమ ప్రభుత్వాన్ని కొనియాడే పవన్ కల్యాణ్ పైకానీ, జనసేనపై కానీ కేసీఆర్ ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో జనసేన మద్దతులో ఏపీలో అడుగుపెట్టాలని భావిస్తున్నరు గులాబీ బాస్.
జనసేనతో పొత్తు?
ఏపీలో సినీ గ్లామర్ బీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనతో పొత్తుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవల బీజేపీకి జనసేనకు మధ్య గ్యాప్ రావడంతో దీనిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ బాస్. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా పవన్ కళ్యాణ్‌ను కలుపుకుపోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేనాని నిర్ణయం ఏంటి?
ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం అందినట్లు జనసేన నాయకులు నిర్ధారించకపోయినా.. ఒకవేళ ఆహ్వానం వస్తే జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలోను, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేరోజు పవన్ తెలంగాణ రాష్ట్ర సమితికే మద్దతిచ్చారు. పీవీ.నరసింహారావు కుమార్తెను పోటీకి దింపడంవల్ల మద్దతిచ్చారనుకున్నా తరుచుగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడుతున్నారు. పవన్ సినిమాలకు సంబంధించి జరిగే వేడుకలకు తెలంగాణలో ముఖ్యమైన మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు.

టీడీపీతో వెళితే కష్టమనే..
కేసీఆర్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే పార్టీని స్థాపిస్తున్నామని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీతో వెళ్లే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, ఎన్నికల సమయంలో బహిర్గతం చేస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ కూడా కలిసివస్తే ఒక కూటమిగా వెళ్దామనే యోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నప్పటికీ ఒంటరిగా పోటీచేయడానికే బీజేపీ మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ కూడా టీడీపీతో మొదట ఏపీలో ఎంటర్ అవ్వాలనుకున్నారు. గతంలో చంద్రబాబుతో ఉన్న సంబంధాలు, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి నేపథ్యంలో తనకు రాజకీయ భిక్షపెట్టిన తెలుగు దేశం మద్దతు ఏపీలో తీసుకోవాలని కేసీఆర్ భావించారు. కానీ.. టీడీపీ భవిష్యత్‌లో బీజేపీతో కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీతో వెళ్లడం కష్టమని డిసైడ్ అయి.. జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ విషయంలో పవన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.