Unstoppable 2 Promo Record Views: అన్ స్టాపబుల్ సీజన్ 2కి రంగం సిద్ధమైంది. బాలయ్య మరిన్ని సంచలనాలకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 14 నుండి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా బాలయ్య బావగారు నారా చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో నిన్న విడుదల చేశారు. ఎప్పటిలాగే బాలయ్య తన మార్క్ చూపించాడు. సొంత బావా, అల్లుళ్ళపై క్రేజీ అండ్ కాంట్రవర్సీ ప్రశ్నలతో దాడి చేశారు. 1995 లో ఎన్టీఆర్ నుండి చంద్రబాబుకు అధికార మార్పిడి ఎపిసోడ్ గురించి అడగడం నిజంగా సాహసం.

చంద్రబాబును మీ లైఫ్ లో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏమిటని బాలయ్య అడగడంతో..బాబు 1995 పై డెసిషన్ అన్నారు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాను. అయినా ఆయన వినలేదు. అప్పటి నిర్ణయం గురించి నీకు కూడా తెలుసుగా అన్నాడు. అవును ఆ సమయంలో నేను కూడా అక్కడ ఉన్నానని బాలయ్య 1995 నాటి కఠిన పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కి బాబు వెన్నుపోటు ఎపిసోడ్ గా ప్రాచుర్యం పొందిన ఆ నాటి సంగతులు చర్చించడం నిజంగా సాహసం.
అలాగే అల్లుడు నారా లోకేష్ ని కూడా ఒక కాంట్రవర్సీ ప్రశ్న అడిగారు. స్విమ్మింగ్ పూల్ లో ఫారిన్ అమ్మాయిలతో జలకాలాడుతున్న ఫోటో చూపించి, ఇది అసెంబ్లీ వరకు వెళ్ళింది, మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయని బహుశా నారా లోకేష్ ఊహించాడో లేదో. నారా చంద్రబాబు చేసిన చిలిపి పనులు గురించి అడగడం, భువనేశ్వరికి ఫోన్ లో ఐ లవ్ యూ చెప్పించడం వంటి క్రేజీ విషయాలు ప్రోమోలో చోటు చేసుకున్నాయి.

దీంతో అన్ స్టాపబుల్ 2 డెబ్యూ ప్రోమోకి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. యూట్యూబ్ ని ఈ వీడియో ఊపేస్తోంది. విడుదలైన 13 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ దాటేసింది. జనాలు అన్ స్టాపబుల్ ప్రోమోను ఎగబడి చూస్తున్నారు. దీంతో ఆహా మేనేజ్మెంట్ ఆరంభం అదిరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 24 గంటలు పూర్తి అయ్యే నాటికి ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ కి భారీ రెస్పాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=jGMH_luXetg&feature=youtu.be